Pawan Varahi  Yatra : జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వారాహి యాత్ర విశాఖ టౌన్ లో ముగిసింది. దాదాపుగా పది రోజుల పాటు యాత్ర చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కానీ తర్వాత ఏమిటన్నదానిపై స్పష్టత లేదు. వారాహియాత్ర జోరుగా సాగించడానికి కారణం ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఉద్దేశమే. కానీ  ఏపీ ప్రభుత్వం ముందస్తుకు వెళ్లే ఆలోచన చేయకపోవడంతో... పవన్ ఇప్పుడు పూర్తి చేయాల్సిన సినిమాలపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆయన సినిమా షూటింగ్‌లు చాలా వరకూ పెండింగ్ లో ఉన్నాయి. వాటికి డేట్లు సర్దుబాటు చేస్తున్నారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్… వచ్చే మూడు నెలల పాటు కొంత కాలం షూటింగ్‌లకు కాల్ షీట్లు కేటాయించారు. ఈ కారణంగా వారాహి యాత్రకు కొంత గ్యాప్ రానుంది.  


వరుసగా రెండు, మూడు నెలల పాటు సగం రోజులు షూటింగ్‌లకే 


ఈ నెలతోపాటు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వరుసగా సగం  రోజుల పాటు షూటింగ్‌లకే సమయం కేటాయించాలని పవన్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.  పవన్ కల్యాణ్ నటిస్తున్న  ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ,  హరిహర వీరమల్లు షూటింగ్‌లో ఉన్నాయి. ఉస్తాద్ కి...  ఓజీకి పెద్ద ఎత్తున కాల్ షీట్లు కేటాయించాల్సి ఉంది.  ఆ సినిమాల షూటింగ్ కూడా ఇంకా చాలా కాలం చేయాల్సి ఉంది.  అందుకే... నెలలో సగం రోజుల పాటు అక్టోబర్ లో ఇరవై రోజుల పాటు కేటాయించాలని నిర్ణయించుకున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.  ఈ కారణంగా మూడు నెలల్లో  వారాహియాత్ర జరగకపోవచ్చునని.. జరిగినా అతి కొద్ది రోజులు మాత్రమే జరుగుతుందని చెబుతున్నారు.  ఎన్నికలు వచ్చే మార్చి తర్వాత ఉంటాయి. ఈ లోపు… నిర్మాణంలో ఉన్న సినిమాలను పూర్తి చేస్తే ఓ భారం దిగిపోతుందని భావిస్తున్నారు.


పార్టీ కార్యక్రమాల్లో ఊపు తగ్గకుండా జాగ్రత్తలు


ఉస్తాద్ ఎన్నికలకు ముందు రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే జనసేన పార్టీ కార్యక్రమాలు ఎక్కడా తగ్గకుండా చూసుకోవాలని భావిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు ఎప్పుడూ హైలెట్ అయ్యేలా ఏదో ఓ కార్యక్రమం చేపట్టాలని భావిస్తున్నారు. అదే సమయంలో పొత్తులు, అభ్యర్థుల అంశంపై… పార్టీ ముఖ్య నేతలతో పవన్ ఎప్పటికప్పుడు చర్చలు జరిపే అవకాశం ఉంది. ఎన్నికల ఏడాదిలో పూర్తిగా పవన్ రాజకీయాలకే సమయం కేటాయించి ఉంటే మరింత సీరియస్ నెస్ ఉండేదని జనసైనికులు భావిస్తున్నారు. ముందస్తుగా ప్రణాళిక లేకపోవడం వల్ల ఎన్నికల సమయంలోనూ షూటింగ్‌లకు వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. అయితే పార్టీ నడపడానికే… పవన్ సినిమాలు చేస్తున్నారని… రెండు పడవలపై కాళ్లు పెట్టినా… సమన్వయం చేసుకుంటారని జనసైనికులు ధీమాతో ఉన్నారు.


చివరి ఏడాదిలో షూటింగ్‌లు లేకుండా చూసుకోవాల్సిందన్న  అభిప్రాయం


పార్టీ నడపడానికే సినిమాలు చేస్తున్నానని పవన్ చెబుతూంటారు.   ఓ వైపు అన్ని పార్టీల నేతలు ప్రజల్లోనే ఉంటున్నారు.  న్నికల ఏడాదిలో అయినా ప్రజల మధ్య ఉండేలా పవన్ ప్లాన్ చేసుకోకపోవడం మైనస్ అవుతుందన్న ఆందోళన జనసైనికుల్లో ఉంది.  వారాహియాత్రతో పవన్ కల్యాణ్ పార్టీకి కాస్త ఊపు తీసుకు వచ్చారు.  ఆయ  రెండు పడవలపై సమాంతరంగా పయనిస్తూండటం..  ఎన్నికల సమయంలోనూ  షూటింగ్‌లు పెట్టుకోవడం కాస్త ఇబ్బందికరమే. అన్ని పార్టీలు పూర్తి స్థాయిలో జనాల్లోనే ఉంటున్నాయి.