Left Parties Plan : తెలంగాణలో వామపక్ష పార్టీలు రగిలిపోతున్నాయి. కేసీఆర్ ఘోరంగా అవమానించారని .. వాడుకుని వదిలేశారని.. అమాయకంగా మోసపోయామని వారు భావిస్తున్నారు. అందుకే బీఆర్ఎస్‌కు తామేంటో చూపించాలని అనుకుంటున్నారు. హైదరాబాద్‌లో రెండు వామపక్ష పార్టీలు సుదీర్ఘంగా చర్చించాయి. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాయి. బీఆర్ఎస్‌కు బుద్ది చెప్పాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇందు కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసే అవకాశాలపై చర్చించాలని నిర్ణయించారు.
కమ్యూనిస్టులను వద్దనుకున్న కేసీఆర్
మునుగోడు ఉపఎన్నికల్లో మద్దతు కోసం ప్రగతి భవన్‌కు పిలిచి మరీ వామపక్ష నేతలకు మర్యాదలు చేసిన కేసీఆర్.. తర్వాత వారిని పట్టించుకోలేదు. ఇప్పుడు పొత్తులు వద్దనుకున్నారు. మునుగోడు ఉపఎన్నికల తర్వాత ప్రగతి భవన్ గేట్లు కమ్యూనిస్టులకు ఓపెన్ కాలేదు. చాలా సార్లు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోరినా వారికి అధినేత ఇవ్వలేదని సమాచారం. పొత్తులపై ఏదో ఒక్కటి తేల్చండి.. మా దారి మేము చూసుకుంటామని గత నెల నుంచి సీపీఐ, సీపీఎం నేతలు బహిరంగంగానే స్వరం పెంచారు. అప్పటికి వారికి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ అన్ని అంశాలు బేరీజు వేసుకున్న తర్వాత చివరికి పొత్తు లేదని అన్ని స్థానాలకూ అభ్యర్థుల్ని ప్రకటించడం ద్వారా కేసీఆర్ తేల్చేశారు.
పోటీ హోరాహోరీగా ఉంటే.. కమ్యూనిస్టులు కీలకం
వచ్చే ఎన్నికల్లో పోరాటం హోరాహోరీగా ఉంటందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. దక్షిణ తెలంగాణలో సీపీఐ, సీపీఎం పార్టీలకు నమ్మకమైన ఓటు బ్యాంక్ ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో గత రెండు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఒక్క సీటు కంటే ఎక్కువ దక్కించకోలేకపోయింది. దక్షిణ తెలంగాణలో తక్కువలో తక్కువగా ప్రతి నియోజకవర్గంలో 5 వేల వరకు ఓట్లు ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ఉన్నాయి. ఈ ఓట్లు గెలుపోటముల్ని తేలుస్తాయని నమ్ముతున్నారు.
కానీ కేసీఆర్ కమ్యూనిస్టుల్ని వద్దనుకున్నారు.
పొత్తుల కోసం ఆలోచించకుండా ప్రయత్నాలు చేయాలనుకుంటున్న వామపక్షాలు
పొత్తుల సంగతి తర్వాత ముందు మన బలం పెంచుకుందామని రెండు వామపక్షాలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తమకు పట్టున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బహిరంగసభలతో బలాన్ని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కొత్తగూడెంలో సీపీఐ భారీ బహిరంగ సభ నిర్వహించింది. వచ్చే ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉంటుందని కమ్యూనిస్టులు నమ్ముతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బలపడుతోందని.. అదే సమయంలో కర్ణాటక ఎన్నికల తర్వాత ఇక్కడ బీజేపీ పూర్తిగా బలహీనపడిందని లెఫ్ట్ నేతలు అంచనాలు వేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, వైరా, పినపాక స్థానాలపై సీపీఐ గురిపెట్టింది. సీపీఏం సైతం అదే ఫార్ములాను అనుసరిస్తోంది. పొత్తుల విషయం పక్కన పెట్టి వారికి పట్టు ఉన్నా ప్రాంతాల్లో బలం పెంచుకునే ప్రయత్నంలో సీపీఎం నాయకులు ఉన్నారు.
జాతీయ స్థాయి కూటమి లో భాగంగా కాంగ్రెస్‌తో కలిసి వెళ్తారా ?
కామ్రేడ్ల చూపు ఇప్పుడు కాంగ్రెస్ వైపునకు మళ్లినట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు హస్తం పార్టీతో జతకట్టాలనిచూస్తున్నట్టు తెలుస్తోంది. ఇండియా కూటమిలో సీపీఐ, సీపీఎం భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. మునుగోడు ఉపఎన్నికల సమయంలో కలసి రావాలని కాంగ్రెస్ కోరినా..బీజేపీని ఓడించాలంటే బీఆర్ఎస్ కే సాధ్యమని ప్రకటనలు చేసి.. బీఆర్ఎస్ తో వెళ్లారు. ఇప్పుడు రెండు వామపక్షాలు పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో కలిసే పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చాయి. కాంగ్రెస్ తో జతకట్టడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదనే అభిప్రాయాన్ని రెండుపార్టీల నేతలూ వ్యక్తం వచ్చారు. బీఆర్ఎస్ ను ఓడించడం కూడా తమ లక్ష్యాల్లో ఒకటిగా చేసుకున్నారు.