Komatireddy Venkat Reddy: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయం వేడెక్కుతోంది. అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార పార్టీ బీఆర్‌ఎస్ నేతలు, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు పంచులకొద్ది పంచులు పేలుస్తూ ఎన్నికల వేడి రాజేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికార పార్టీ బీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌పై తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటకలోని కూర్గ్‌లో జరుగుతున్న బొగ్గు గనులు, ఉక్కు ఆధారిత పరిశోధన కోసం ఏర్పాటు చేసిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ స్టడీ టూర్‌లో కోమటిరెడ్డి మాట్లాడారు. సూర్యాపేట సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కోమటి రెడ్డి స్పందిస్తూ.. 50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో సీఎం కేసీఆర్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ రాజకీయ జీవితం మొదలైంది కాంగ్రెస్ పార్టీ నుంచేనని, కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ కాంగ్రెస్ అన్నారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మించింది కాంగ్రెస్ హయాంలోనే అని కేసీఆర్‌కు తెలియదా అని ఎద్దేవా చేశారు. శ్రీశైలం, కల్వకుర్తి, శ్రీరాంసాగర్ లాంటి ఎన్నో ప్రాజెక్టులను కాంగ్రెస్ పూర్తి చేసిందన్నారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ అభివృద్ధి కోసం కోట్లాడింది తామేనని, ఎస్ఎల్‌బీసీని కేసీఆర్ అటకెక్కించారని కోమటిరెడ్డి విమర్శించారు. ఈ పదేళ్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, పెన్షన్ల పెంపు వచ్చాయన్నారు. 1వ తేదీన పెన్షన్‌లు ఇచ్చామని, కేసీఆర్‌లాగా 15వ తేదీన ఇవ్వలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
బీఆర్‌ఎస్ మొదటి విడత అభ్యర్థుల జాబితాపై వెంకటరెడ్డి స్పందించారు. కేసీఆర్ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల ఆస్తులు.. ఎమ్మెల్యేలు కాకముందు ఎంత, అయ్యాక ఎంత పెరిగిందనే వివరాలు సేకరించి సోషల్ మీడియాలో షేర్ చేయాలని కార్యకర్తలు, ఉద్యమకారులు, నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. ఉచిత కరెంటును వ్యతిరేకించిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని విమర్శించారు. దేశంలో మొదటి సారి ఉచిత విద్యుత్ ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.
టీడీపీతో పొత్తులో ఉన్నప్పుడు ఇదే కేసీఆర్ చంద్రబాబుతో కలిసి ఉచిత విద్యుత్‌పై జోకులు వేశారని, కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత విద్యుత్ ఇచ్చినట్లు గుర్తు చేశారు. రైతులకు విద్యుత్ బకాయిలు, రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే అయ్యాయన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ది చేసిన ఘనత కాంగ్రెస్‌దే అన్నారు. డబ్బుల కోసం మద్యం టెండర్లు మూడు నెలల ముందే వేశారని మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్‌కు ఈసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 26 నుంచి తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తుందన్నారు.
సూర్యాపేట జిల్లాలో జరిగిన ప్రగతి నివేదన సభలో సీఎం చంద్రశేఖర్ రావు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఏంచేసిందని ప్రశ్నించారు. మరరోసారి కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేస్తారని విమర్శించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి సీఎం కేసీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు.