ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని మంత్రి హరీష్ రావు దీమా వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే తనకు సిద్దిపేట టికెట్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గంలో అభ్యర్థుల పేర్లు ఖరారు అయిన వారికి మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.... కాంగ్రెస్ పార్టీ సీట్లను అమ్ముకుంటుందని విమర్శించారు. బిజెపికి క్యాడర్ లేదని, కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరని హరీష్ రావు వ్యాఖ్యానించారు.


 ఈనెల 23వ తేదీన మెదక్ జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలతో పాటు బీఆర్ఎస్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. ఆసరా పింఛన్ పెంపును మెదక్ జిల్లా నుంచి సీఎం ప్రారంభిస్తారని అన్నారు. దివ్యాంగులకు ఆసరా పింఛన్ 4,016 రూపాయలకు చెప్పారు.


కాంగ్రెస్ పార్టీ, బిజెపి నేతలది మేకపోతు గాంభీర్యం అని, వారికి ప్రజల్లో బలం లేదని మంత్రి హరీష్ రావు అన్నారు. వారికి ప్రజల్లో బలం లేదని... ప్రజా మద్దతు ఉన్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని మంత్రి హరీష్ తెలిపారు. కేవలం సోషల్ మీడియాలో,  గాంధీభవన్ లో వాళ్ల పార్టీ ఆఫీసులల్లో మాత్రమే కాంగ్రెస్, బిజెపి నేతలకు బలం ఉందని సెటైర్లు వేశారు.  కాంగ్రెస్ పార్టీకి లీడర్లు లేరు... బిజెపి పార్టీకి క్యాడర్ లేదు... బీఆర్ఎస్ పార్టీకి తిరుగు లేదన్నారు.


ముచ్చటగా మూడోసారి తాము విజయం సాధిస్తామని, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారని చెప్పారు. టికెట్లకు దరఖాస్తు తీసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులను తేల్చేందుకు అప్లికేషన్ తీసుకుంటున్నారని తెలియజేశారు. అభ్యర్థుల కోసం అప్లికేషన్లను అమ్ముతున్న కాంగ్రెస్ పార్టీ రేపు రాష్ట్రాన్ని కూడా అమ్ముతుందని ఎద్దేవా చేశారు.  ఇలాంటి వాళ్లు ప్రజలకు న్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని 30 నుంచి 40 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అసలు అభ్యర్థులే లేరన్నారు. అందుకే అభ్యర్థుల వేట కోసం డబ్బులు తీసుకొని దరఖాస్తులు తీసుకుంటున్నారని చెప్పారు.


 కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది?  అధికారంలోకి వచ్చాక ఏం చేస్తుందో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. అక్కడ కరెంట్ పరిస్థితి ఎలా ఉంది? రైతుల పరిస్థితి ఎలా ఉంది? కర్ణాటకలో ఏం జరుగుతుందో అందరికీ తెలుస్తుందని విమర్శించారు. ఓడ దాటే వరకు ఓడ మల్లప్ప, దాటాకపోవడం వల్లప్ప అనేలా కాంగ్రెస్ పార్టీ తీరు ఉందని విమర్శించారు.


 బీఆర్ఎస్, బిజెపి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమానేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో సినిమా చూపించేది ప్రజలే అని సినిమా చూసేది మాత్రం టిఆర్ఎస్ పార్టీ నేతలని బిజెపి నేత ఈటెల రాజేందర్ మంత్రి కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ పై సంపూర్ణ విశ్వాసం ఉందని వరుసగా మూడోసారి గెలిపిస్తారని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. కెసిఆర్ మరోసారి సీఎం పీఠంపై కూర్చుంటారని హరీష్ రావు చెప్పుకొచ్చారు.