టిడిపి అధినేత చంద్రబాబు ఈ నెల 28న హస్తినకు వెళ్లనున్నారు. ఏపిలో ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. పనిలో పనిగా కేంద్ర పెద్దలను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కమలం పార్టీ పెద్దల అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి మోడీ, హోం మినిస్టర్ అమిత్ షాతోపాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాను కలిసే అవకాశం ఉంది.  2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిజెపి కూటమికి దూరమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటూ అమరావతితో పాటు ఢిల్లీలో కూడా ఆందోళనలు చేశారు. 


2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి వచ్చింది. టిడిపి కేవలం  23 సీట్లకే పరిమితం అయింది.  ఆ తర్వాత టిడిపి తరపున గెలిచిన కొందరు శాసనసభ్యులు  అధికార పార్టీ వైఎస్‌ఆర్‌సీపీలోకి జంప్ అయ్యారు. పార్టీకి అండగా ఉండే వారిని అధికార పార్టీ టార్గెట్ చేసిందన్న ఆరోపణలు గట్టిగా ఉన్నాయి. అధికార పార్టీ కేసులు, ఒత్తిళ్లతో టీడీపీ నేతలతోపాటు చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను వివరిస్తూ.. చాలాసార్లు ప్రధానికి లేఖలు రాశారు. పలుసార్లు కలిసేందుకు ప్రయత్నించినా కుదరలేదు. జగన్ కు అడ్డుకట్ట వేయాలంటే బిజెపికి దగ్గరైతేనే సాధ్యమనే నిర్ణయానికి వచ్చారు. చాలా కాలం తర్వాత చంద్రబాబు, మోడీ...ఆజాదీకా అమృత్ మహోత్సవ్ నేషనల్ మీటింగ్ లో కలిసారు. పార్లమెంట్ లో కేంద్రం పెట్టిన పలు బిల్లులకు మద్దతు ఇచ్చారు. 


తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమిపిస్తున్నాయ్. గులాబీ బాస్ కెసిఆర్...115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి నడిచే అంశంపై బిజెపి నేతలతో చర్చించే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి... ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఫిర్యాదు చేయనున్నారు. ఎక్కడెక్కడ దొంగ ఓటర్లు ఉన్నారో...వాటి జాబితాను ఎన్నికల సంఘానికి అందించనున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా రిపోర్టును తయారు చేసుకున్నారు.


దొంగ ఓట్ల వ్యవహారంలో అనంతపురం జిల్లా ఉరవకొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా పరిషత్ సిఈఓగా ఉన్న భాస్కర్ రెడ్డిని సస్పెండ్ చేసారు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో అయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతపురంలో ఆరు వేల దొంగ ఓట్లను చేర్పించడంతోపాటు, ఉన్న వారి ఓట్లను కూడా తొలగించిన అంశంపై  ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్...కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కేశవ్ ఫిర్యాదు మేరకు అనంతపురం జిల్లా ఉరవకొండ వచ్చి పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు... క్షేత్రస్థాయి పరిశీలనలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి భాస్కర్ రెడ్డి పాత్ర ఉందని తేల్చారు. దీంతో అతనిని సస్పెండ్ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చింది. జడ్‌పి సీఈఓగా ఉన్న భాస్కర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2021లో అనంతపురంలో జడ్‌పి సీఈఓగా పనిచేసిన శోభ స్వరూప రాణిఫై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ టూర్ ఆసక్తి రేపుతోంది.