Lokesh Transformation :  తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ ఆ పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నింపుతున్నారు. చంద్రబాబునాయుడు అడపాదడపా జిల్లా టూర్లకు వెళ్తున్నారు. కానీ లోకేష్ మాత్రం తరచుగా జిల్లాలు పర్యటిస్తున్నారు. ఆయన ఎక్కువగా రోడ్ మార్గం ద్వారా వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దారి మధ్యలో నియోజకవర్గాల్లోని నేతలందర్నీ కలుస్తూ.. ప్రజలతో మాట్లాడుతూ వెళ్తున్నారు. అలాగే అధికార పక్షానికి.. ఇతరులకు సమాధానం చెప్పే స్టైల్ కూడా మారింది. గతంలో ఆయనను  ట్రోల్ చేసే వారు ఇప్పుడు సీరియస్‌గా తీసుకుంటున్నారు. దీంతో లోకేష్‌లో వచ్చిన మార్పు  టీడీపీ క్యాడర్‌ను కూడా ఆకట్టుకుంటోంది.


కాల్స్ నుంచి మాస్ గెటప్ కు మార్పు ! 


లోకేష్ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆయన మొదట్లో నీట్ షేవ్‌తో కనీసం మీసాలు కూడా లేకుండా ఉండేవారు. ఆయన ఆహార్యం రాజకీయాలకు వర్కవుట్ కాదన్న అభిప్రాయం మొదట్లోనే వినిపించింది. అయితే పెద్దగా పట్టించుకోలేదు. లోకేష్ తన స్టైల్‌ను కొనసాగించారు. ఆయన మాట తీరు కూడా మొదట్లో మృదువుగా ఉండేది. రాజకీయాల్లో ఉండాల్సిన కటువుతనం ఉండేది కాదు. అందుకే ఆయన రాజకీయాలకు సూటబుల్ కాదు  అనే ప్రచారాన్ని రాజకీయ ప్రత్యర్థులు చేశారు. సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో పకడ్బందీగా వినియోగించుకున్న రాజకీయ ప్రత్యర్థులు ఆయనపై క్లాస్ ముద్ర వేశారు. రాజకీయాల్లో  క్లాస్ ఇమేజ్ వర్కువుట్ కాదు. అయితే ఇప్పుడు లోకేష్ గెటప్ మారిపోయింది. బాగా సన్నబడ్డారు. గడ్డం, మీసాలతో కనిపిస్తున్నారు. మాస్ లుక్‌లోకి వచ్చారు. దీంతో ఆయన పై పడిన క్లాస్ ముద్ర కూడా మెల్లగా పోతోంది. 


మాటతీరులో మార్పు !


లోకేష్ మొదట్లో తెలుగులో ప్రసంగించాల్సి వచ్చినప్పుడు తడబడేవారు. ఆయన విద్యాభ్యాసం ఇతర కారణాలు కావొచ్చు కానీ ఇలా తడబడినప్పుడు ఆయన మాటల్ని పట్టుకుని రాజకీయ ప్రత్యర్థులు సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవాళ్లు. ఒక్కో సారి అనని మాటల్ని అన్నట్లుగా ప్రచారం చేసేవారు. వాటిని విస్తృతంగా వైరల్ చేసేవారు. అయితే ఇటీవలి కాలంలో లోకేష్ ఆ లోపాన్ని కూడా సవరించుకున్నారు.  తెలుగులో ధాటిగా మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్‌సీపీ నేతలు చేసే విమర్శలకు  అదే భాషలో కౌంటర్ ఇస్తున్నారు. దీంతో టీడీపీ నేతలు లోకేష్ కౌంటర్లను వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు లోకేష్ ప్రసంగాలు టీడీపీ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నాయి. 


విపక్ష నేతలూ సీరియస్‌గా తీసుకుంటున్నారు..!


గతంలో లోకేష్ చేసే విమర్సలను విపక్ష పార్టీల నేతలు ట్రోల్ చేసేవారు. కానీ ఇప్పుడు ఘాటుగా సమాధానాలిస్తున్నారు. లోకేష్‌పై ఎదురుదాడికి దిగుతున్నారు. వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన ఓ మహిళా నేత ఏకంగా మద్యం, మగువ లేకపోతే లోకేష్ నిద్రపట్టదని తీవ్రమైన విమర్శలు కూడా చేశారు. గతంలో ఆయనపై చేసిన విమర్సలకు ఇవి భిన్నమైనవి .  ఇలా రాజకీయ ప్రత్యర్థుల విమర్శల్లోనూ మార్పులు తెచ్చేలా లోకేష్ రాజకీయంగా మారిపోయారు. 


టీడీపీ కార్యకర్తలకు పిలిస్తే పలికే ఏర్పాటు !


టీడీపీ కార్యకర్త బాధ్యతలను చాలా కాలంగా లోకేష్ చూసుకుంటున్నారు. కార్యకర్తలకు ఇన్సూరెన్స్ కల్పించాలన్న ఆలోచన లోకేష్‌దే. చాలా పార్టీలు ఇప్పుడా విధానాన్ని అవలంభిస్తున్నాయి. కార్యకర్తల సంక్షేమానికి ప్రత్యేకంగా ఓ టీమ్‌ను నిర్వహిస్తున్నారు లోకేష్. అన్నక్యాంటీన్లు అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయడం.. మొబైల్ ఆస్పత్రులు నిర్వహించడం వంటి ఆలోచనలు అమలు చేస్తున్నారు. లోకేష్‌లో వచ్చిన మార్పు.. టీడీపీ నేతలను కూడా సంతృప్తికి  గురి చేస్తోంది. చంద్రబాబు వ్యూహాలు రచిస్తే లోకేష్ అమలుచేస్తారన్న నమ్మకానికి వచ్చారు.