Telugu States Assembly Sessions: " అసెంబ్లీలో లేదా పార్లమెంట్‌లో ప్రజాసమస్యలపై చర్చల్లో పాల్గొనడం, చట్టాల రూపకల్పనలో భాగం కావడం " చట్టసభ సభ్యుని ప్రధాన బాధ్యత. అంతే కాదు ఈ చట్టసభల నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తేనే ప్రజాస్వామ్యం మెరుగ్గా ఉంటుందని రాజ్యాంగ నిర్మాతలు కూడా భావించారు. ఐదారేళ్ల కిందటి వరకూ చట్టసభలు సుదీర్ఘ కాలం  నిర్వహించేవారు. ప్రజాసమస్యలపై విస్తృతంగా చర్చించేవారు.  ఇప్పటికీ పార్లమెంట్ వరకూ చట్టసభలు నిర్వహిస్తున్న సమయం ఏమంత తీసికట్టుగా లేదు కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అసలు అసెంబ్లీని నిర్వహించడం అవసరమా అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. తాజాగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను తెలంగాణ ప్రభుత్వం రెండు రోజులే నిర్వహించాలనుకుంటోంది. ఏపీ ప్రభుత్వం మూడు రోజులనుకుంటోంది. ఇదే మొదటి సారి కాదు. గత మూడేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీలు సమావేశమైన వ్యవధి చాలా తక్కువ 


అసెంబ్లీని అత్యవసరం అయితేనే సమావేశ పరుస్తున్న ప్రభుత్వాలు ! 
 
అసెంబ్లీని ఆరు నెలలలోపు సమావేశపరచడం రాజ్యాంగ విధి.  ఖచ్చితంగా సమావేశపర్చాల్సిన టైమ్‌కు సమావేశపర్చి.. ఒకటి రెండు రోజులు నిర్వహించి మ మ అనిపిస్తున్నాయి. అటు ఏపీ .. ఇటు తెలంగాణ రెండు ప్రభుత్వాలూ అంతే. తెలంగాణ ప్రభుత్వం ఈ పధ్నాలుగో తేదీ లోపు సభను సమావేశపర్చాల్సి ఉంది. ఈ కారణంగా వెంటనే ఓ రోజు సమావేశపర్చి వారానికి వాయిదా వేశారు. ఆ తరవాత మరో రెండు రోజులు మాత్రమే సభను మొక్కుబడిగా నిర్వహిస్తారు. దాంతో వర్షాకాల సమావేశాలు పూర్తయిపోయినట్లవుతాయి.ఏపీలోనూ అంతే రాజ్యాంగ నిబంధనల ప్రకారం నిర్వహించాల్సిన చివరి గడువు వచ్చే టప్పటికీ సమావేశపర్చి.. నాలుగైదు రోజులుసభ నిర్వహించి అయిపోయిందనిపిస్తారు. చర్చలు ఎక్కడా జరుగుతున్నట్లుగా ఉండదు. 


కరోనా సాకుతో పూర్తిగా లైట్ తీసుకుంటున్న ప్రభుత్వాలు !


కరోనా కారణంగా సభలు నిర్వహించడం ఓ ఏడాది కష్టమయింది. అది మొదలు ఇక సభ నిర్వహణ ఎందుకు సమయం దండగ అన్నట్లుగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. తెలంగాణలో గత మూడేళ్ల కాలంలో .. ఏ సీజన్‌లో అయినా అసెంబ్లీ జరిగింది వారంలోపే. పనిదినాలు చాలా తక్కువ. ఏపీలోనూ అంతే. వాస్తవానికి బడ్జెట్‌ సాధారణ సమావేశాలు కనీసం ఆరు వారాలు నిర్వహించేవారు.  ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు అంటే హైవోల్టేజ్  ఎట్మాస్పియర్ ఉండేది.  సెలవులు పోను కనీసం 28 నుంచి 31 రోజుల వరకూ పూర్తి పని దినాలుండేవి.  విభజన తర్వాత బడ్జెట్‌ సమావేశాల కాలాన్ని తగ్గించుకుటూ వచ్చారు. ఓ సారి బడ్జెట్ సమావేశాల్ని ఏపీ ప్రభుత్వం రెండు అంటే రెండు రోజులు నిర్వహించింది. గవర్నర్ ప్రసంగం..బడ్జెట్ ప్రవేశ పెట్టడం.. చర్చించడం.. ఆమోదించడం  అన్నీ జరిగిపోయాయి. పైకా కొన్ని బిల్లులుకూడా పాస్ చేసేసుకున్నారు. అసెంబ్లీ నిర్వహించకుండా బడ్జెట్‌కు ఆర్డినెన్స్ ను వరుసగా రెండేళ్ల పాటు ఏపీ ప్రభుత్వంజారీ చేయడం కొసమెరుపు.  



రెండు అధికార పార్టీలకూ తిరిగులేని మెజార్టీ - కానీ ఎందుకిలా ?


రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు తిరిగులేనంత మెజార్టీ ఉంది. విపక్ష పార్టీలకు తగినంత బలం లేదు. తమ వాదన బలంగా వినిపించుకునే అవకాశం ఉంది. కానీ రెండు చోట్ల ఉన్న కొద్ది పాటి ప్రతిపక్ష ఎమ్మెల్యేల వాదన కూడా వినకూడదన్నట్లుగా తీరు ఉంటుంది. అధికార పక్ష సభ్యులు బూతులతో విరుచుకుపడే సందర్భాలు కనిపిస్తున్నాయి. స్పీకర్ కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సందర్భాలు.. తాను అధికార పార్టీ ఎమ్మెల్యేను అన్నట్లుగా విపక్ష నేతలపై సవాళ్లు చేయడం కూడా చట్టసభల్లో కనిపిస్తోంది. ఇక టీవీ లైవ్‌లలో విపక్ష సభ్యులు అసలు కనిపంచరు. వారకిమాట్లాడే చాన్స్ పెద్దగా రాదు. అంతా అధికారపక్షమే కనిపిస్తూ ఉంటుంది. అధికారపక్షమే తమ వాదన వినిపిస్తుంది. ప్రతిపక్ష పార్టీలకు చాన్స్ లేదు. జరిపేది అతి  కొద్ది రోజులు ఆ రోజుల్లోనూ ఇలా ఏకపక్షంగా సభను నిర్వహించేస్తున్నారు. 


చట్టసభలు ఎంత బాగా జరిగితే ప్రజాస్వామ్యం అంత బలోపేతం !
 
అసెంబ్లీలో చర్చలు జరిగితేనే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ ప్రభుత్వాలు ఇలా చర్చలు జరపడానికి ఆసక్తి చూపించడం లేదు. రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల్లో సమావేశ పర్చాల్సి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా సమావేశ పరుస్తున్నారు కానీ అది కూడా లేకపోతే.. ఇక చట్టసభల అవసరం ఏముందని అనుకునేపరిస్థితి  ఉది. ఎమ్మెల్యేల ప్రధాన బాధ్యత చట్టసభల చర్చల్లో పాల్గొనడం. కానీ ప్రభుత్వాలే ఇప్పుడు చట్టసభలకు ప్రాధాన్యం తగ్గించేస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి  అంత మంచిది కాదు.