CBI In Telangana : తెలంగాణ ప్రభుత్వం సీబీఐకి నో ఎంట్రీ బోర్డు పెట్టాలని నిర్ణయించుకుంది.  ఏ క్షణమైనా ఉత్తర్వులు రానున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ విషయంలో  బీహార్‌లో ఇప్పటికే సూచనలు చేశారు. అన్ని రాష్ట్రాలు జనరల్ కన్సెంట్‌ను రద్దు చేయాలన్నారు. ఆయనే అలా పిలుపునిచ్చినందున వీలైనంత వేగంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది.  తెలంగాణలోనూ సీబీఐ విరుచుకుపడే అవకాశాలున్నాయని.. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితపై లిక్కర్ స్కాం కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతున్న సమయంలో కేసీఆర్ సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేయాలని నిర్ణయం తీసుకోనుండటం సహజంగానే చర్చనీయాంశమవుతోంది. 


రాష్ట్రం  సిఫార్సు చేస్తేనే సీబీఐ విచారణ ! 


ఢిల్లీ అవినీతి నిరోధక చట్టం-1988, ఐపీసీలోని పలు సెక్షన్లతో పాటు, 63కుపైగా కేంద్ర చట్టాల్లోని సెక్షన్ల ప్రకారం ఢిల్లీలో తప్ప దేశంలోని ఏ రాష్ట్రంలోనూ సీబీఐ నేరుగా వెళ్లి దర్యాప్తు చేసేందుకు వీలులేదు. ఇందు కోసం రాష్ట్రాలు జనరల్ కన్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సీబీఐ తమ రాష్ట్రాల్లో కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేయడానికి గతంలో సాధారణ సమ్మతి ఇచ్చి, తర్వాత కాలంలో వాటికి రద్దు చేసి నో ఎంట్రీ చెప్పిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి. 2018లో చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ సీబీఐకు ఇచ్చిన సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంది. దాంతో రాష్ట్రంలో సీబీఐ కేసులు పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇబెంగాల్‌, ఛత్తీస్ గఢ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, మేఘాలయ, కేరళ, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లు తమ రాష్ట్రాల్లో సీబీఐ ప్రవేశానికి వెసులుబాటు కల్పించే సాధారణ సమ్మతి ఉత్తర్వుల్ని ఉపసంహరించుకున్నాయి. అయితే ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత సీబీఐకి జనరల్ కన్సెంట్‌ను పునరుద్ధరింారు. 


జనరల్ కన్సెంట్‌తో పని లేకుండా కోర్టు ఆదేశిస్తే సీబీఐ దర్యాప్తు !


దేశ రాజధాని ఢిల్లీ మినహా ఏ రాష్ట్రంలో సీబీఐ తన అధికారాల్ని వినియోగించుకోవాలన్నా ఆ రాష్ట్రం సాధారణ సమ్మతి తెలపాల్సి ఉంటుంది. అన్ని రాష్ట్రాలు ఇందుకు ఎప్పటికప్పుడు సమ్మతి నోటిఫికేషన్‌లు ఇస్తుంటాయి. సమ్మతి నోటిఫికేషన్‌ ప్రకారం... ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా సీబీఐ తనిఖీలు, దర్యాప్తులు చేయవచ్చు. సీబీఐకి సాధారణ మద్దతు ఉపసంహరించుకున్న రాష్ట్రాలు అన్నీ బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్నవే. కేంద్ర ప్రభుత్వ సంస్థలో అవినీతి జరిగిందని సమాచారం అందితే... కేసు గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి.  ప్రభుత్వం ఇచ్చే అనుమతి మేరకే సీబీఐ కేసు దర్యాప్తులో ముందుకెళ్లాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఎన్నో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. వీటన్నింటిపై సీబీఐ కేసులు నమోదు చేయాలంటే ప్రతి కేసుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి వస్తుంది.  అయితే, రాష్ట్రాలు తమ సమ్మతి ఉపసంహరించుకున్నంత మాత్రాన సీబీఐ ఆ రాష్ట్రంలో అడుగు పెట్టడం ఆపలేరు. కోర్టులు ఆదేశిస్తే... దర్యాప్తు చేయవచ్చు.  సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం కూడా అడ్డుకోలేదు. 


ఢిల్లీలో నమోదు చేసిన కేసులకు కోర్టు అనుమతి కూడా అక్కర్లేదు ! 
 
బీహార్  ఉప ముఖ్యమంత్రి తేజస్వి మీద సీబీఐ ఉద్యోగాల కుంభకోణం కేసు పెట్టింది.  బిహార్‌ కూడా ఇటీవలే జనరల్‌ కన్సెంట్‌ ను రద్దు చేశారు.  సీబీఐ తేజస్వి మీద కేసును ఢిల్లీలో నమోదు చేసింది కాబట్టి దర్యాప్తునకు ఇబ్బంది ఉండదని  అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ కేసు కూడా అక్కడే్ ఉంది. ఆ కేసులోనే కల్వకుంట్ల కవిత పేరు ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే తెలంగాణలో సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేసినా పెద్దగా ప్రభావం ఉండదని అంచనా వేస్తున్నారు. నిజానికి సీబీఐకే పరిమితులు కానీ ఈడీకి.. ఐటీకి ఇలాంటి జనరల్ కన్సెంట్‌లు అవసరం లేదు. అందుకే సీబీఐకు సాధారణ సమ్మతి అనుమతి ఉపసంహరించడం పెద్ద విషయం కాదని బీజేపీ నేతలంటున్నారు.