వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్ర వ్యాప్తంగా 5000 చోట్ల బిజేపీ ప్రజా పోరు సభలు నిర్వహిస్తామని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైఎస్ జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా పోరులో భాగంగా రాష్ట్రంలోని 5000 గ్రామ స్థలాలలో ప్రజా బహిరంగసభలను నిర్వహించనున్నట్లు సోము వీర్రాజు తెలిపారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశంలోనిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఏపీలో దూకుడు పెంచుతున్న బీజేపీ
ఏపీలో బీజేపి మరింత దూకుడు ప్రదర్శించేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్ర వ్యాప్తంగా 5000 చోట్ల బిజేపీ ప్రజా పోరు సభలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైఎస్ జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా పోరులో భాగంగా రాష్ట్రంలోని 5000 గ్రామ స్థలాలలో ప్రజా బహిరంగసభలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అద్యక్షులు వీర్రాజు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం గత 8 సం.ల కాలంలో రాష్ట్రానికి ఇచ్చిన వేల కోట్ల రూపాయల అభివృద్ధి నిధులను గురించి, మంజూరు చేసిన అనేక విద్యాసంస్థలను గురించి, ఎయిమ్స్, ఈఎస్ఐ ఆసుపత్రులు వంటి వైద్య, ఆరోగ్య సంస్థలను గురించి, వేలాది కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న జాతీయ రహదారులను గురించి వివరిస్తామని చెప్పారు.
డబుల్ ఇంజన్ ప్రభుత్వం ప్రయోజనాలు ప్రజల్లోకి..
పంచాయతీల అభివృద్ధికి మంజూరు చేసిన వేలకోట్ల రూపాయల నిధులను గురించి, జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయిల కనెక్షన్లు ఏర్పాటు చేయటం గురించి, కరోనా సమయంలో ప్రారంభించి రెండున్నర సంవత్సరాలుగా ఇస్తున్న ఉచిత బియ్యం గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఏపీ బీజేపీ భావిస్తోంది. పీఎం కిసాన్ ద్వారా రైతులకు చేస్తున్న ఆర్థిక సహాయం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను గురించి ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఈ సభల ద్వారా వివరించడం జరుగుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో - కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉండడం వల్ల.. డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో, ఆయా రాష్ట్రాలలో పెద్ద ఎత్తున జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు. ప్రత్యేకంగా నిర్వహించనున్న బహిరంగ సభల్లో డెవలప్‌మెంట్‌తో పాటు జరగనున్న మార్పులను తెలియజేస్తామన్నారు.
కుటుంబ, వారసత్వ రాజకీయాలకు చెక్..
కుటుంబ వారసత్వ, అవినీతి, కులతత్వ పార్టీలను రాష్ట్ర ప్రజలు బహిష్కరించి, వచ్చే 2024 సాధారణ ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పాలని కోరుతూ రాష్ట్రంలో బీజేపీ ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలకు వివరించడం బీజేపీ ముఖ్య ఉద్దేశమన్నారు. రాష్ట్ర ప్రజల్లో బీజేపీ క్షేత్రస్థాయి ఉద్యమాన్ని నిర్మాణం చేయడం జరుగుతుందని, ఈ బహిరంగ సభలలో పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులు, ఎంపీలు, జాతీయ నేతలు, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నేతలు పాల్గొనడం ద్వారా ఏపీలో బీజేపి కార్యకలాపాలను విస్తృతం చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి లబ్ధిని చేకూర్చే అన్ని అంశాలను ప్రజాక్షేత్రంలో ప్రజలకు తెలియజేసి, సీఎం జగన్ మోహన్ రెడ్డి అవినీతి, బంధుప్రీతి, మోసపూరిత రాజకీయాలను ఎండగట్టడం, ప్రజలను చైతన్య వంతులను చేయడంతో పాటు బీజేపీని బలమైన శక్తిగా మార్చేందుకు సభలు ఉపయోగపడతాయని సోము వీర్రాజు అన్నారు.
ప్రత్యేక కమిటీల నియామకం
ఈ సభలను విజయవంతం చేయటానికి ప్రత్యేక కమిటీని నియమించి, కమిటీల నాయకుల పేర్లను వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిని రాష్ట్ర ఇంఛార్చీగా నియమించారు. ప్రాంతాల వారీగా పరుశురాం రాజు (ఉత్తరాంధ్ర), కోలా ఆనంద్ (కోస్తాంధ్ర), తపనా చౌదరి (గోదావరి), పనతల సురేష్ (రాయలసీమ) నియామకం జరిగింది. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా సభల నిర్వహణ, ఏర్పాట్లును పర్యవేక్షిస్తుంది.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు బీజేపీని బలోపేతం చేసే దిశగా పార్టీ నేతలు అడుగులు వేస్తున్నారు. కేంద్రంలో ఉన్న పార్టీ ఏపీలోనూ అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే సభలు నిర్వహించి ప్రజలకు నిజాలు వివరించి బీజేపీకి అధికారం సాధించాలని ప్లాన్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 5000 సభలను నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది.