Girl Died With Dengue Fever: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం కుయిగూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మొన్నామధ్య పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ తో చలాకీగా మాట్లాడిన ఆ బాలిక డెంగీ జ్వరంతో గురువారం ప్రాణాలు విడిచింది. ఎంతో చలాకీగా ఉండే ఆ పదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోవడంతో గ్రామస్థులంతా కంటతడి పెడుతున్నారు. గ్రామానికి చెందిన కారం సంధ్య (10) చింతూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. జులై 27వ తేదీన సీఎం జగన్ చింతలూరు మండలం కుయిగూరు పర్యటనకు వెళ్లినప్పుడు సంధ్య చాలా చలాకీగా తిరుగుతూ కనిపించింది. చాలా యాక్టివ్ గా ఉండటంతో సీఎం జగన్ కంటపడిన ఆ పాపను.. దగ్గరకు పిలిచి వివరాలు అడిగారు. నీ పేరేంటి, ఏం చదువుతున్నావంటూ సీఎం ఆప్యాయంగా మాట్లాడారు. 


ముందుగా బాలిక తండ్రికి సోకిన డెంగీ.. 
సంధ్య.. కల్లేరు మాజీ సర్పంచి కారు ఏసుబాబు కుమార్తె. ఆయన కుటుంబ కుయిగూరలోనే నివాసం ఉంటోంది. అయితే గత నాలుగు రోజుల కిందట ఏసుబాబుకు తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నాడు. పరీక్షించిన వైద్యులు డెంగీ సోకిందని తెలిపి చికిత్స అందించారు. తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. కుమార్తె సంధ్య ఆయనతో పాటే ఉంది. వ్యాధి నయం కావడంతో ఏసుబాబు సోమవారం డిశ్ఛార్జీ అయ్యారు. అయితే అదే రోజు బాలిక సంధ్యకు కూడా ఒంట్లో బాగా లేకపోవడంతో ఆస్పత్రిలో చూపించారు. పరీక్షలు చేయిన వైద్యులు మామూలు జ్వరమేనని నాలుగైదు రోజుల్లో తగ్గిపోతుందని తెలిపారు. 


జ్వరంతో వణికిపోవడంతో ఆస్పత్రికి.. 
దీంతో బాలికను తీసుకొని ఇంటికి చేరుకున్నారు. కానీ బుధవారం సంధ్యకు జ్వరం మరింత ఎక్కువైంది. విషయం గుర్తించిన ఆమె తల్లిదండ్రులు వెంటనే చింతూరు ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రైవేటు ఆస్పత్రిలో రక్త పరీక్షలు చేయించగా.. డెంగీగా నిర్ధారణ అయింది. భద్రాచలం వెళ్లాలని చింతూరు వైద్యులు సూచించడంతో వెంటనే అక్కడి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. తిరిగి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లే సరికి బాలిక పరిస్థితి మరింత విషమించింది. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ గురువారం రోజు ఉదయం చనిపోయింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 


ఇప్పటికైనా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి..


రెండు, మూడు నెలల కిందట కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా... ఆయా జిల్లాల్లో దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. వైద్య సేవలు కూడా పూర్తిగా అందకపోవడం వల్ల చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే బాలిక చనిపోయిందని స్థానికులు చెబుతున్నారు. సీఎం వచ్చినప్పుడు ఆయనతో చలాకీగా తిరిగిన పిల్ల.. వైద్య సేవలు అందక చనిపోవడం చాలా విచారంగా ఉందంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయాలని కోరుతున్నారు. ప్రాణాల మీదకు వచ్చే వరకు సమస్య తీవ్రత తెలియట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.