Telangana BJP : తెలంగాణ బీజేపీలో నాయకత్వ మార్పు తర్వాత కూడా పరిస్థితి మారలేదు. ఇప్పుడు మరింత ఎక్కువగా అసంతృప్తి పెరిగిపోతోందన్న సూచనలు కనిపిస్తున్నాయి. నాయకత్వ మార్పు తర్వాత చంద్రశేఖర్, యెన్నం శ్రీనివాసరెడ్డి వంటి వారు పార్టీ మారిపోయారు. ఇటీవల జరుగుతున్న మార్పులతో మరికొంత మంది సీనియర్ నేతలు కూడా మండిపోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణ బీజేపీలో నివురుగప్పిన నిప్పులా పరిస్థితి ఉందని.. ఎప్పుడైనా బద్దలు కావొచ్చునన్న ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది.
వలస నేతలతోనే అసలు సమస్య
తెలంగాణలో బీజేపీలో మొదటి నుంచి ఉన్న నేతలకు ఆ తర్వాత వివిధ పార్టీల నుంచి వచ్చి చేరిన నాయకులకు మధ్య ఆధిపత్య పోరు పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈటల రాజేందర్ కు ఇటీవల ప్రాధాన్యత పెంచారు. అయితే ఆయన ప్రతి నిర్ణయంపై అభ్యంతరం చెప్పేందుకు ఇతర నేతలు రెడీగా ఉంటున్నారని అంటున్నారు. అదే సమయంలో కేసీఆర్‌ను గద్దె దించేందుకు ప్రత్యామ్నాయంగా బీజేపీలో చేరితే, ఇప్పుడు రెండు పార్టీల మధ్య ఉన్న రహస్య అవగాహన బట్టబయలైందని కొంత మంది ఇప్పటికీ గొణుక్కుంటున్నారు. బీజేపీలో ఉంటే కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడలేమన్న అభిప్రాయంలో ఉన్నారు.
ఆపరేషన్ ఆకర్ష్ లో ఫెయిలయిన ఈటల
బీజేపీలో చేరికల కమిటీ చైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్ బీఆర్‌ఎస్ నుంచి భారీ ఎత్తున చీలికలు తెచ్చి, నేతల్ని బీజేపీలోకి తెస్తారని ఆశించారు. అలాంటిదేం అక్కడ జరక్కపోవడంతో ఈటలపై పార్టీ పెద్దలు కూడా నమ్మకం కోల్పోతున్నారు. ఇటీవల ఖమ్మం సభలో ఇరవై రెండు మంది బీఆర్ఎస్ ముఖ్య నేతలు పార్టీలో చేరుతారని ప్రచారం చేశారు. కానీ.. ఒక్కరు కూడా చేరలేదు. దీంతో ఆయనకు ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న చర్చ జరుగుతోంది.
అసలే చేరికల్లేవు.. అరకొర చేరికలతో అనేక సమస్యలు
ఈటల రాజేందర్ వ్యవహారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డికి ఇబ్బందికరంగా మారినట్లు పార్టీలో చర్చ జరుగుతుంది. అంబర్‌పేట నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి సీ కృష్ణయాదవ్‌ను బీజేపీలో భూకంపం బీజేపీలోకి తెచ్చేందుకు ఈటల రాజేందర్ పూర్తిస్థాయి కసరత్తు చేశారు. ఆయన పార్టీలో చేరడం దాదాపు ఖరారైంది. కృష్ణయాదవ్ కూడా తాను ఆగస్టు 30న బీజేపీలో చేరుతున్నానని ప్రకటించారు. దానిలో భాగంగా హైదరాబాద్ సిటీలో తనతో పాటు ఈటల రాజేందర్, మోడీ, అమిత్‌షా, నడ్డాల ఫోటోలతో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పార్టీలో చేరేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నాక, అనూహ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి అడ్డుపడ్డారు. తన నియోజకవర్గంలో తనకు సమాచారం లేకుండా కృష్ణయాదవ్‌ను పార్టీలోకి ఎలా తీసుకుంటారని ఆయన ఈటలతో వాగ్వివాదానికి దిగినట్టు తెలిసింది. అదే రోజు ఉదయం మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగరరావు కుమారుడిని కాషాయకండువా కప్పి కిషన్‌రెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అక్కడ తుల ఉమకు వేములవాడ టిక్కెట్ ఇప్పిస్తాననే హామీతో ఈటల రాజేందర్ తనతోపాటు బీజేపీలోకి తెచ్చారు.
కీలక నేతలు కాంగ్రెస్ లో టచ్‌లో ఉన్నారని ప్రచారం
యొన్నం శ్రీనివాసరెడ్డి తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లుగా ప్రకటించారు. మరికొంత మంది సీనియర్ నేతలు కూడా అదే బాటలో ఉన్నారంటున్నారు. తనతో పాటు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జీ వివేక్, రవీంద్రనాయక్ వంటి నేతలమంతా కలిసి కాంగ్రెస్‌తో చర్చలు జరిపామని యెన్నం చెబుతున్నారు. పార్టీలో చేరతామని చెప్పిన కొందరు మాట తప్పారనీ, తాను మాత్రం కాంగ్రెస్‌లో చేరుతున్నాననీ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ను బీజేపీలో ఉంటే ఎదుర్కోలేమనీ, ఉద్దేశ్యపూర్వకంగానే బీఆర్‌ఎస్‌కు బీజేపీ లోపాయికారి సహకారాన్ని అందిస్తున్నదనీ ఆరోపించారు. రోజులు గడిచే కొద్దీ.. బీజేపీలో పరిస్థితి మరింత దిగజారిపోతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.