ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వచ్చిన నిజం విత్ స్మితా టాక్‌లో ఈసారి గెస్ట్‌గా తెలుగుదేశం అధినేత వచ్చారు. చాలా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. కార్యక్రమంలో భాగంగా తన చిన్ననాటి స్నేహితులతో కూడా ముచ్చటించారు. ఈ సందర్భంలో ఓ ఆసక్తి కరమైన ఘటనను చంద్రబాబు మిత్రుడైన దేవరాజ్ నాయుడు చెప్పారు.
చంద్రబాబు నాయుడు ఎస్‌ఎస్‌ఎల్‌సీ తప్పిపోయినప్పుడు బాధతో రైలు పట్టాలపై పరుగెత్తారట. అదే సమయంలో వెనుక నుంచి ట్రైన్ వస్తున్న సంగతి కూడా గమించకుండా వెళ్తున్నారట. దీన్ని గమనించిన మిత్రుడు దేవరాజ్ నాయుడు ఆయన్ని పక్కకు లాక్కొని వచ్చారని చెప్పారు. దీన్ని విన్న చంద్రబాబు అవును నిజమే అని చెప్పారు. కొన్నిసార్లు ఓటమి బాధ కలిగిస్తుందని.. కసిని పెంచుతుందన్నారు. ఎస్‌ఎస్‌ఎల్‌సీ మళ్లీ అదే స్కూల్‌లో చదవలేక తిరుపతిలో చేరానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. తర్వాత ఇంకెప్పుడూ పరీక్షలల్లో ఫెయిల్ కాలేదన్నారు.
స్మితా టాక్ షో మొత్తం చాలా సరదాగా సాగింది. చంద్రబాబు ప్రేమ సంగతులు కూడా అడిగి తెలుసుకున్నార స్మిత. కాలేజీ రోజుల్లో వన్‌సైడ్ లవ్‌లు మాత్రం ఉండేవని.. ఎక్కడా గాఢమైన ప్రేమలో పడిన సందర్భాలు లేవన్నారు చంద్రబాబు. విద్యార్థి దశ నుంచే నమ్మిన సిద్ధాంతాల కోసం పని చేశానన్నారు. అందుకే యూనివర్శిటీలో గొడవలు బాగా జరిగేవన్నారు. ఎప్పుడూ కత్తులు మాత్రం పట్టలేదని క్లారిటీ ఇచ్చారు.
యూనివర్శిటీలో చదువుతూ ఎన్నికల్లో పోటీ చేసిన గెలిచిన వ్యక్తిని తానే అన్నారు చంద్రబాబు. అప్పట్లో సాయంత్రం అయ్యేసరికి క్యాంపెయిన్ వెహికల్స్ యూనివర్సిటీకి వచ్చేవన్నారు. అప్పట్లో జరిగిన సంఘటనలు చూసి.. విద్యార్థులు చెడిపోతారేమో అన్న ఉద్దేశంతోనే తాను సీఎం అయ్యాక విద్యార్థి సంఘాల్ని నిషేధించానన్నారు. విద్యార్థులు రాజకీయాల్లోనే కాకుండా అన్ని రంగాల్లో ఉండాలనే ఉద్దేశంతో ఆ పని చేశానన్నారు.. అప్పటి పరిస్థితులను బట్టి తాను చేసింది నిజమని భావించినట్టు తెలిపారు.
ఈ సందర్భంగా మరోసారి వెన్నుపోటు ప్రస్తావన వచ్చింది. దీనిపై కూడా అన్‌స్టాపబుల్‌లో చెప్పిన సమాధానాన్నే చంద్రబాబు ఇక్కడ కూడా చెప్పారు. ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నాం కాబట్టే ఇప్పుడు పార్టీ పటిష్టంగా ఉందన్నారు చంద్రబాబు. ఆ రోజుల ఆ ఘటనకు కారణమైన వాళ్లు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు అంటూ లక్ష్మీపార్వతిపై ఇన్‌డైరెక్ట్‌గా విమర్శలు చేశారు.
టాక్‌షోలో సందర్భంగా కొందరి వ్యక్తులు పేర్లు చెప్పిన స్మిత వారికి సంబంధించ నిర్వచనం చెప్పమన్నారు. అందులో భాగంగా లోకేష్ పేరు చెబితే... బాగా చదువుకున్న సంస్కారం ఉన్న వ్యక్తిగా అభివర్ణించారు చంద్రబాబు. భవిష్యత్‌ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. కేటీఆర్ పేరు ప్రస్తావిస్తే... ఓ స్ట్రాటజీ ప్రకారం... అనుకున్నది సాధించుకునే వ్యక్తిగా కితాబు ఇచ్చారు. బెస్ట్ కమ్యూనికేటర్ అంటూ పొగిడారు. పవన్ పేరు ప్రస్తావిస్తే... సమాజానికి ఏదో చేయాలనే తపన ఉన్న వ్యక్తిగా చెప్పారు. రేవంత్‌రెడ్డి పేరు చెబితే... ధైర్యంగా ముందుకు వెళ్లే వ్యక్తి అని... ప్రజల్లో ఇంకా నిరూపించుకోవాల్సి ఉందన్నారు.
ఎన్టీఆర్‌లో అన్ని కోణాలు ఇష్టమే అన్నారు చంద్రబాబు అన్నింటికంటే రాజకీయ నాయకుడిగా ఎక్కువ ఇష్టమని తెలిపారు. రాష్ట్ర విభజన , టీడీపీ ఓటమి కంటే అమరావతి అంశం ఎక్కువ బాధ పెట్టిందన్నారు చంద్రబాబు.