Jagan New Cabinet : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన మంత్రి వర్గ టీమ్‌ను మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారని వైఎస్ఆర్‌సీపీలో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఎనిమిది స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేయడానికి కసరత్తు నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి చేరిన జయమంగళ వెంకటరమణకు ఓ ఎమ్మెల్సీ స్థానాన్ని ఖరారు చేశారు మరో ఏడు స్థానాలకు అభ్యర్థుల్ని సామాజిక వర్గాల సమతూకంతో నిర్ణయించే కసరత్తు చేస్తున్నారు. ఈ సారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే వారికి వెంటనే మంత్రి పదవులు కూడా ఇచ్చే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. కనీసం నలుగురు మంత్రులకు ఉద్వాసన పలికి కొత్త వారిని తీసుకోవాలని జగన్ అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ముగ్గురు ఎమ్మెల్సీలకు మంత్రులుగా అవకాశం కల్పిస్తారా ?
సీఎం జగన్ మొదట ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయన కేబినెట్‌లో ఇద్దరు ఎమ్మెల్సీలు మంత్రులుగా ఉండేవారు. మోపిదేవి వెంకటరమణ, పిల్లిసుభాష్ చంద్రబోస్ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ వారిని మంత్రుల్ని చేసి తర్వాత ఎమ్మెల్సీలుగా చాన్సిచ్చారు. అయితే రాజధాని వివాదంతో తర్వాత మండలిని రద్దు చేయాలని నిర్ణయించుకున్న తర్వాత వారిని పదవుల నుంచి తప్పించి రాజ్యసభ సీట్లు కేటాయించారు. ఆ స్థానంలో ఎమ్మెల్యేలనే తీసుకున్నారు. అయితే ఇఫ్పుడు మండలిని రద్దు చేయకూడదని నిర్ణయించుకున్నారు. గతంలో చేసిన తీర్మానాన్ని ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు మండలిలో పూర్తి స్థాయిలో ఆధిపత్యం వైఎస్ఆర్సీపీకే ఉంది. అందుకే పార్టీ కోసం పని చేసిన వారికి మండలిలో సభ్యత్వం ఇచ్చి మంత్రి పదవులు ఇవ్వాలన్న ఆలోచనకు సీఎం జగన్ వచ్చారని చెబుతున్నారు.
ఆరు నెలల కిందటే ముగ్గురు,నలుగురు మంత్రుల్ని తప్పిస్తానని ప్రకటించిన సీఎం జగన్!
ఓ సందర్భంలో సీఎం జగన్ సతీమణి భారతిపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న సమయంలో మంత్రులు స్పందించడం లేదంటూ.. కేబినెట్ సమావేశంలోనే సీఎం జగన్ కొంత మంది మంత్రులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముగ్గురు, నలుగురు మంత్రుల్ని తప్పిస్తానని అప్పట్లోనే చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. అయితే మంత్రులు తర్వాత ఎగ్రెసివ్ గా మారడంతో మళ్లీ అలాంటి వార్తలు రాలేదు. కానీ సీఎం జగన్ కేబినెట్ పునర్వవ్యవస్థీకరణ పై గట్టి ఆలోచనతోనే ఉన్నారని తాజాగా స్పష్టమవుతోంది. గతంలోనే ముగ్గురు మంత్రులను మంత్రి వర్గం నుండి తప్పించే అవకాశం ఉంది.మంత్రి పదవిని కోల్పోయే మంత్రుల్లో ఒక మహిళా మంత్రి కూడా ఉన్నారని చెప్పుకున్నారు.
వివాదాస్పదంగా కొంత మంది మంత్రుల తీరు !
కొత్త మంత్రుల్లో కొంత మంది తీరు వివాదాస్పదంగా మారింది. దూకుడుగా స్పందించలేకపోవడంతో పాటు వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు. ఐటీ, పరిశ్రమల మంత్రిగా గుడివాడ అమర్నాథ్ ప్రకటనలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ఉంటున్నాయి. మరికొంత మంది మంత్రులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. వారు చురుకుగా స్పందించడం లేదు కూడా . మంత్రి పదవుల నుంచి తప్పించినప్పటికీ ... కొడాలి నాని, పేర్ని నానిలే ఎక్కువగా పార్టీని డిఫెండ్ చేసుకుంటూ వస్తున్నారు. వారు కూడా ఇప్పుడు పదవులు ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి సమీకరణాలను చూసుకుని కొత్తగా ఎమ్మెల్సీ స్థానాలను ఇచ్చే వారి నుంచి లేదా గతంలో హామీలు ఇచ్చిన వారికి పదవులు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
గత ఏడాది ఏప్రిల్ మాసంలో జగన్ కేబినెట్ మంత్రులంతా రాజీనామా చేశారు. ఏప్రిల్ 11న కొత్త కేబినెట్ ప్రమాణం చేసింది. 13 మంది కొత్తవారికి సీఎం జగన్ తన కేబినెట్ లో అవకాశం కల్పించారు. అంతకు ముందు కేబినెట్ లో పనిచేసిన 11 మందికి మరోసారి కేబినెట్ లో కొనసాగే అవకాశం కల్పించారు. గత కేబినెట్ లో పనిచేసిన వారిని పార్టీ అవసరాల కోసం వినియోగించుకుంటున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల వరకు ఇదే కేబినెట్ ను కొనసాగించాలని జగన్ భావించారు. అయితే మంత్రుల పనితీరు ఇతర సమీకరణాలతో మళ్లీ మార్పులు చేస్తున్నారు.