Tahsildar Ramanaiahs Murder: విశాఖ రూరల్‌ తహసీల్దార్‌ సనపల రమణమయ్య విశాఖ నగరంలో శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఈ వ్యవహారం ఇప్పుడు విశాఖలో రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న విశాఖ నగరాన్ని హత్యలు, కిడ్నాప్‌లకు కేంద్రంగా అధికార వైసీపీ నేతలు మార్చారంటూ ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. గతంలో సాక్షాత్తూ విశాఖ ఎంపీ కుటుంబ సభ్యులను కిరాయి గూండాలు కిడ్నాప్‌ చేశారు. తాజాగా మండల స్థాయిలో మెజిస్ర్టేట్‌గా వ్యవహరించే తహసీల్దార్‌ను హత్య చేయడం, అదీ నగర నడిబొడ్డులోని ఆయన ఇంటికి వెళ్లి మరీ దారుణానికి ఒడిగట్టడం ఇప్పుడు సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ రాజధాని చేస్తామని చెబుతున్న వైసీపీ నాయకులు.. కనీస స్థాయిలో నగర పౌరులకు భద్రత లేకుండా చేస్తున్నారన్న విమర్శలను గుప్పిస్తున్నారు. ఇప్పుడే నగరంలో ఇటువంటి దారుణాలు చోటు చేసుకుంటుంటే.. భవిష్యత్‌లో పరిస్థితి ఇంకెలా ఉంటుందోనన్న ఆందోళన సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 


ఇంటికెళ్లి మరీ దారుణ హత్య


విశాఖ జిల్లా రూరల్‌ తహీల్దార్‌గా పని చేస్తూ రెండు రోజులు కిందట రమణయ్యకు విజయనగరం బదిలీ అయింది. మొదటి రోజు విధులకు హాజరైన రమణయ్య రాత్రి 8 గంటలు సమయంలో ఇంటికి చేరుకున్నారు. కొమ్మాదిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న ఆయన ఇంటికి రాత్రి సుమారు 10.15 గంటలు సమయంలో కొందరు వ్యక్తులు వచ్చి ఫోన్‌ చేశారు. ఫోన్‌ వచ్చిన వెంటనే వారిని కలిసేందుకు రమణయ్య కిందకు వచ్చారు. ఓ వ్యక్తితో ఏడు నిమిషాలపాటు సీరియస్‌గా చర్చించారు. ఇద్దరి మధ్య వాదనలు పెరగ్గా, బయటి నుంచి వచ్చిన వ్యక్తి తనతోపాటు తీసుకువచ్చిన ఇనుప రాడ్డుతో రమణయ్యను బలంగా బాదారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన తహసీల్దార్‌ అక్కడికక్కడే కూలిపోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న రమణయ్యను అపోలో ఆస్పత్రి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. కొమ్మాదిలోని ఎస్‌టీబీఎల్‌ సినీ థియేటర్‌ వెనక ఉన్న చరణ్‌ క్యాస్టల్స్‌ అపార్ట్‌మెంట్‌లోని ఐదో అంతస్తులో నివాసం ఉంటున్నారు. ల్యాండ్‌ ఇష్యూకు సంబంధించి ఇరు వర్గాలు మధ్య గొడవ జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. రమణకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. రమణయ్య సొంత ఊరు శ్రీకాకుళం జిల్లా నందిగామ మండల పరిధిలోని దిమ్మిలాడ గ్రామం. పదేళ్లు కిందట విధుల్లో చేరారు. డిప్యూటీ తహసీల్దార్‌, తహసీల్దార్‌, కలెక్టరేట్‌లో ఏవోగా పని చేశారు. వజ్రపుకొత్తూరు, పద్మనాభం, విశాఖ రూరల్‌ చిన గదిలి ఎమ్మార్వోగా పని చేసి.. రెండు రోజులు కిందట విజయనగరం బదిలీపై వెళ్లారు. 


రాజకీయంగా పెను దుమారం.. అధికార పార్టీపై ఒత్తిడి


విశాఖ అంటే ప్రశాంతమైన నగరంగా పేరుతుంది. అటువంటి నగరంలో గడిచిన కొన్నాళ్ల నుంచి హత్యలు, కిడ్నాప్‌లు, బెదిరింపు వ్యవహారాలు సాధారణ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. కడప ఫ్యాక్షన్‌ రాజకీయాలను వైసీపీ పెంచి పోషిస్తోందని, ఈ ఘటనలు దానికి మచ్చు తునకలని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా జరిగిన ఈ ఘటన వైసీపీని కూడా డిఫెన్స్‌లోకి నెట్టినట్టు అయింది. కొద్ది నెలలు కిందట వైసీపీ ఎంపీ కుటుంబ సభ్యులను కిడ్నాప్‌ చేయడం, తాజాగా మండల స్థాయి అధికారి హత్యకు గురి కావడం వంటి వ్యవహారాలన్నీ విశాఖ నగరంలో క్రైమ్‌ రేటు పెరగడాన్ని తెలియజేస్తున్నాయని పలు వర్గాలు నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇళ్లకు వెళ్లి మరీ హత్యలు, కిడ్నాప్‌లు చేసే సంస్కృతికి విశాఖలో పెరుగుతోందంటే దానికి కారణం ప్రభుత్వ ఉదాసీన వైఖరేనన్న విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని వైసీపీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. హత్యకు కారణమైన వారిని తక్షణమే పట్టుకుని వారిపై యాక్షన్‌ తీసుకునేలా అధికార పార్టీ పోలీసులపై ఒత్తిడి పెడుతోంది. ప్రతిపక్షాలు మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలను గుప్పిస్తున్నాయి.


హత్యను ఖండించిన అసోసియేషన్‌


తహసీల్దార్‌ రమణయ్య హత్యను ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ తీవ్రంగా ఖండించింది. రమణయ్య కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని నాయకులు తెలియజేశారు. హత్యకు కారకులను వెంటనే అరెస్ట్‌ చేయాలని అసోసియేషన్‌ నాయకులు బొప్పరాజు, చేబ్రోలు కృష్ణమూర్తి డిమాండ్‌ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించడంతోపాటు రమణయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. అధిక భూ వివాదాలు ఉన్న మండలాల్లో పని చేసే తహసీల్దార్‌కు ప్రభుత్వం ప్రత్యేక రక్షణ కల్పించాలని, విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించినా, దాడులకు పాల్పడినా దోషులపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాలు తీసుకురావాలని కోరారు.