South Indian Political Heroes: రాజ‌కీయాల్లో(Politics) ఉన్న‌వారు ఇత‌ర రంగాల్లో ప్ర‌వేశించే అవ‌కాశం ఉన్నా..  ఇత‌ర రంగాల్లో ఉన్న‌వారు మాత్రం రాజ‌కీయ బాట పట్ట‌డం చాలావ‌ర‌కు త‌క్కువ‌గానే ఉంది. ముఖ్యంగా సినీ రంగం నుంచి రాజ‌కీయాలు చేసే వారు.. త‌గ్గుతున్నార‌నే చెప్పాలి. 1970, 1980ల‌లో సినీ రంగం నుంచి ఎక్కువ మంది రాజ‌కీయాల్లోకి వ‌స్తే.. 1990లలో ఇదే జోరు క‌నిపించింది. అయితే.. అప్ప‌టి రాజ‌కీయాల‌కు ఇప్ప‌టి రాజ‌కీయాల‌కు తేడా క‌నిపిస్తుండ‌డం.. నిబద్ధ‌త, క‌ట్టుబాటు అనే చ‌ట్రంలో నాయ‌కులు ఇమ‌డ‌లేక పోవ‌డం వంటి కార‌ణాల‌తో రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు మెజారిటీ న‌టులు ఆస‌క్తి చూపించ‌డం లేదు. 


విజ‌య్ కొత్త పార్టీ


ఇక‌, రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన సినీ రంగ దిగ్గ‌జాలు.. కొందరు ముఖ్యమంత్రి(CM) పదువులు అధిష్ఠించి, వాటికి వ‌న్నెతెచ్చారు. ద‌క్షిణాదిరాష్ట్రాల్లో క‌ర్ణాట‌క మిన‌హా ఏపీ, తమిళనాడు(Tamilnadu)లో ఈ ట్రెండ్ ఎక్కువ‌గా కనిపిస్తుంది. ఏపీ విష‌యానికి వ‌స్తే.. తెలుగు వారి ఆత్మ‌గౌర‌వ నినాదంతో రాజ‌కీయ పార్టీ పెట్టిన నంద‌మూరి తారక రామారావు(Nandamuri Tharaka Rama Rao).. కేవ‌లం 9 నెల‌ల కాలంలోనే అధికారంలోకి వ‌చ్చేశారు. ఆ త‌ర్వాత‌.. ఇలాంటి ప‌రిస్థితి ఏపీలో లేక‌పోయినా.. త‌మిళ‌నాడులో ఉంది. ఇక‌, ఇప్పుడు ప్రముఖ కోలీవుడ్ స్టార్ విజయ్ కూడా ఓ పార్టీ లాంచ్ చేశారు. `త‌మిళ‌గ వెట్రి క‌గ‌ళం` పేరుతో ఆయ‌న పార్టీని ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో ద‌క్షిణాదిన పార్టీలు పెట్టిన వారిలో ఎంత మంది స‌క్సెస్ అయ్యారు. ఎవ‌రెవ‌రు.. ప్ర‌జానాయ‌కులుగా నిలిచార‌నే ఆసక్తి నెల‌కొంది. 


ఏపీ విష‌యానికి వ‌స్తే.. 


టీడీపీ:   తెలుగు వారి అన్న‌గా, విశ్వ విఖ్యాత న‌ట‌సార్వ‌భౌముడిగా పేరొందిన‌ నంద‌మూరి తార‌క రామారావు 1983లో స్థాపించిన తెలుగు దేశం పార్టీ(Telugu Desam Party).. అన‌తి కాలంలోనే అధికారంలోకి వ‌చ్చింది. రంగులేసుకునేవారికి రాజ‌కీయాలు ఏం తెలుస్తాయ‌న్న విప‌క్ష పార్టీల‌కు చెంపపెట్టుగా ఆయ‌న 9 నెల‌ల కాలంలోనే అధికార ప‌గ్గాలు చేప‌ట్టారు. 1983, 1984, 1994లో ఆయన మూడు సార్లు సీఎం అయ్యారు.


పీఆర్పీ: ఎన్టీఆర్ తర్వాత‌.. అంత‌టి ఇమేజ్ను సొంత చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) 2009లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. `ప్రజారాజ్యం`(PRP) పేరుతో పార్టీని స్థాపించారు. 2008లో స్థాపించిన ఈ పార్టీ.. 2009 ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి ఏపీలో త‌ల‌ప‌డి.. 18 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుంది. ఆ తరువాత అనివార్య కార‌ణాల‌తో పార్టీని న‌డ‌ప‌డం సాధ్యం కాదంటూ.. 2011లో కాంగ్రెస్‌లో విలీనం చేశారు. 2009-12 మధ్య తిరుపతి ఎమ్మెల్యేగా చిరంజీవి సేవలందించారు.  


జనసేన: ప‌వ‌ర్ స్టార్ గా పేరొందిన అగ్ర‌న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌(Pawan Kalyan).. 2014లో సొంత‌గా ప్రారంభించిన పార్టీ జ‌న‌సేన‌. 2019లో ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టారు. అప్ప‌టి ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. కానీ, హీరోగా ఆద‌రించిన ప్ర‌జలు అప్ప‌టి ఎన్నికల్లో ఆయ‌న పోటీ చేసిన రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ(గాజువాక‌, భీమ‌వ‌రం) గెలుపు గుర్రం ఎక్కించ‌లేక‌పోయారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పార్టీ యాక్టివ్‌గా ఉంది.


తమిళనాడులో..


అన్నాడీఎంకే: వెండితెరపై ఓ వెలుగు వెలిగి రాజకీయాలను కూడా శాసించిన వారిలో ముందుగా చెప్పుకునే పేరు ఎంజీఆర్. 1972 అక్టోబర్ 17న ఎంజీఆర్ అన్నాడీఎమ్‌కే పార్టీని ప్రారంభించారు. త‌మిళులు ఆయ‌న‌ను నెత్తిన పెట్టుకున్నారు. 1977 నుంచి 1987 వరకు తమిళనాడు సీఎంగా గెలిపించారు. ఎంజీఆర్ తరువాత పార్టీ పగ్గాలు అప్ప‌టి అందాల రాశిగా పేరొందిన దిగ్గ‌జ న‌టి జయలలిత చేతుల్లోకి వెళ్లాయి. ఆమె రాజ‌కీయ అరంగేట్రంతో త‌మిళ‌నాడులో నాడు-నేడు అనే ప‌రిస్థితి వ‌చ్చేసింది. 1991-96, 2001, 2002-06, 2011-14, 2015-16 మధ్యకాలంలో సీఎంగా చేశారు. అయితే.. పురుట్చిత‌లైవి!గా ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచిపోయి.. `అమ్మ‌`గా సుస్థిరస్థానం సంపాయించుకున్నారు. 


డీఎంకే: తెలుగు సినీ ర‌చ‌యిత‌గా.. నిర్మాత‌గా ఉన్న క‌రుణానిధి.. అన్నాడీఎంకేతో విభేధించి.. డీఎంకే(ద్ర‌విడ మున్నెట్ర క‌ళ‌గం) పార్టిని స్థాపించుకున్నారు. ఈయ‌న కూడా.. ముఖ్య‌మంత్రి ప‌దవిని స్వీక‌రించారు. ఆయన వారసత్వాన్ని కుమారుడు స్టాలిన్ ముందుకు తీసుకెళ్తున్నారు. 


డీఎమ్‌డీకే: మరో ప్రముఖ తమిళస్టార్ విజయ్‌కాంత్ డీఎమ్‌డీకేను 2005లో స్థాపించారు. ఇటీవలే అనారోగ్య కారణాలతో ఆయన కన్నుమూశారు. ప్రస్తుతం పార్టీ వ్యవహారాలను ఆయన భార్య ప్రేమలత చూస్తున్నా రు. 2011లో విజయ్‌కాంత్ ప్రతిపక్ష పార్టీ నేతగా కూడా పనిచేశారు.


మక్కల్ నీది మయ్యమ్:   బ‌హుభాషా న‌టుడు కమలహసన్ 2018లో ఈ పార్టీని లాంచ్ చేశారు. తమిళనాడుతో పాటూ పుదుచ్చేరిలో కూడా ఈ పార్టీ క్రియాశీలకంగా ఉంది. కానీ, ప్ర‌త్య‌క్ష ఎన్నికల్లో డిపాజిట్ కూడా ద‌క్కించుకోక‌పోతోంది. 


ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి: 2007లో సినీనటుడు శరత్ కుమార్ ఈ పార్టీని లాంచ్ చేశారు. 2011 ఎన్నికల్లో అన్నాడీఎమ్‌కేతో కలిసి పోటీ చేసిన ఈ పార్టీ రెండు సీట్లు గెలుచుకుంది.


టీఎమ్ఎమ్: ప్రముఖ తమిళనటుడు శివాజీ గణేశన్ ప్రారంభించిన ఈ పార్టీ కొంతకాలమే ఉనికిలో ఉంది. 1988లో ఆయన దీన్ని స్థాపించారు.


ఏఐఎన్ఎమ్‌‌కే: సినీనటుడు కార్తీక్ ఈ పార్టీని 2009లో లాంచ్ చేశారు. పార్టీ మద్దతుదారుల్లో ఆయన అభిమానులే ఎక్కువ.


త‌మిళ‌గ క‌ట్రి క‌ళ‌గం:  తాజాగా విజ‌య్ ప్ర‌క‌టించిన పార్టీ.. నిస్వార్థ రాజ‌కీయాలు. ప్ర‌జాసేవ కోస‌మే తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. చూడాలి.. మ‌రి ఏమేర‌కు విజయం ద‌క్కించుకుంటారో!!