ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులాంటి వ్యక్తి.. ఆయన్ని ముట్టుకుంటే భస్మం అయిపోతారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యపేట జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ను శనివారం సూర్యపేట జిల్లా కేంద్రంలోని మంత్రి జగదీశ్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సభకు మంత్రి జగదీశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ సభలో మంత్రి మాట్లాడుతూ... కాళేశ్వరం కల సాకారం చేసిన నేత కేసీఆర్ అన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ సంచలనాలు సృష్టించేలా చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ అన్నారు. పైరవీలు, దందాలు చేసినోళ్లే ఊర కుక్కల్లా మొరుగుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీల నేతలు... సీఎం కేసీఆర్, ఆయన కుటుంబంపై అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆరోపించారు. 


కాంగ్రెస్ కు సొంత నాయకుడెవరో తెలీదు


29 రాష్ట్రాలలో చిన్న రాష్ట్రమైన తెలంగాణ... ఇప్పడు సంక్షేమం, అభివృద్ధిలో పరుగులు పెడుతున్నందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లేకుంటే 24 గంటల విద్యుత్ ఉండేదా, ఇంటింటికి మంచినీరు అందేదా అని ప్రశ్నించారు. దళారులకు దోచి పెట్టడం వారితో అంట కాగడం తప్ప కేంద్ర ప్రభుత్వం చేసిందేంలేదన్నారు. గుజరాత్ లో దారిద్ర్య రేఖ మరింత పెరిగిందన్న మంత్రి...మోదీ పాలనలో దళారులు కుబేరులైనారని, దేశం దివాళా తీసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి దిక్కు మొక్కు లేదన్నారు. పార్టీని నడిపే నాయకుడు ఎవరో వారికే  తెలీదన్నారు. సొంత పార్టీకి నాయకుడు ఎవరో వారికే తెలియదని ఎద్దేవా చేశారు.  అటువంటి పార్టీలు పేలుతున్న పిచ్చి ప్రేలాపనలను ప్రజలు గమనిస్తున్నారని వారికి ఎన్నికల్లో బుద్ధి చెబుతారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పారదర్శక పాలన చేస్తుందన్నారు. 


ఏడేళ్లలో 75 శాతం అభివృద్ధి


మ్యానిఫెస్టోలో ఉన్నది ఉన్నట్లు అమలు చేసిన ఏకైక పార్టీ  టీఆర్ఎస్ అని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఏ అంశంలో చర్చకైనా గులాబీ శ్రేణులు సిద్ధమేనన్నారు.  72 ఏళ్లగా జరగని అభివృద్ధి ఏడేళ్లలో  75% పూర్తి చేశామన్నారు. టీఆర్ఎస్ పార్టీ సంచలనాలకు కేంద్ర బిందువు అన్న మంత్రి.. అటువంటి పార్టీలో సభ్యత్వం పొందడమే గౌరవమన్నారు. నిబద్ధతే కార్యకర్తలకు గుర్తింపు నిస్తుందన్నారు. ఆ నిబద్ధత గల వ్యక్తి బడుగులకు పదవి దక్కిందన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి.  


Also Read: రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోంది... జైత్రం నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన రేవంత్ రెడ్డి