MLA Jaggareddy About His Resignation: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మొదట కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి.. వీ హనుమంతరావు, మరికొందరు నేతలు సర్దిచెప్పడంతో రాజీనామా నిర్ణయాన్ని నిన్న తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. 15 రోజులు తరువాత రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానని చెప్పిన జగ్గారెడ్డి ఆదివారం ఆటోలో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్రెస్ మీట్‌కి వచ్చారు. పులి లాంటి వ్యక్తినైన తాను ఎలుకలతో పోట్లాడనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) రాష్ట్రంలో సమస్యల మూలాలను తెలుసుకోవడం లేదన్నారు. నేతల మధ్య సమస్య వచ్చిందా లేదా అని చర్చించకుండా సులువుగా కొట్టి పారేస్తున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలవడం ద్వారా మాత్రమే తన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. ఇప్పుడే తాను ఆట మొదలుపెట్టానని, తన వెనుక ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఢిల్లీ పెద్దల అపాయింట్‌మెంట్ కోసం పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. తన సమస్యకు పరిష్కారం దొరకకపోతే త్వరలోనే కాంగ్రెస్‌కు రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నట్లు ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు వచ్చి మాట్లాడతాడని కొందరు నేతలు చెబుతున్నారు, కానీ పులి లాంటి తాను ఎలుకలతో పోట్లానంటూ వ్యాఖ్యానించారు.
ఒక్కో రాష్ట్రంలో రాజకీయ పార్టీలు వారి పార్టీ విధానాలు ఒక్కో తీరుగా ఉంటాయి. ప్రాంతీయ పార్టీల నేతలు ప్రజల మధ్య ఉంటూ పాలిటిక్స్ చేస్తారు. ఉదాహరణకు తమిళనాడు విషయానికొస్తే కరుణానిధి, జయలలిత వారి రాష్ట్ర ప్రజల కోసం తమ విధానాలతో పోరాటం చేశారు. కరుణానిధి అధికారంలో ఉన్నప్పుడు జయలలితకు అవమానం జరగగా.. ఆమె అధికారంలోకి రాగానే కరుణానిధిని అదే తీరుగా ప్రతీకారం తీర్చుకున్నారని పేర్కొన్నారు. ఈ స్థాయిలో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని, చివరి దశకు చేరుకున్నాక వాళ్లు రియలైజ్ అయ్యారని తమిళనాడు రాజకీయాలు పూర్తిగా మారిపోయానని ప్రస్తావించారు. జయలలిత చనిపోయిన తరువాత ఆమె ఓటమిని మాత్రమే కోరుకున్నానని, మరణాన్ని కోరుకోలేదని కరుణానిధి ప్రస్తావించడాన్ని జగ్గారెడ్డి గుర్తుచేశారు.
తెలంగాణలోనూ రాజకీయాలు (Telangana Politics) అదే తీరుగా మారాల్సిన అవసరం ఉందని తమిళనాడు రాజకీయాలను గుర్తుచేశానని చెప్పారు. తన రాజీనామాపై మీడియా ప్రశ్నించగా.. పార్టీ సీనియర్లు, కీలక నేతలు తనను కోరినందున రాజీనామాను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు తెలిపారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీల వద్ద తన ఆవేదనకు పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 15 రోజుల్లో అపాయింట్‌మెంట్ దొరికి సమస్యకు పరిష్కారం దొరికితే ఓకే అని, దొరకని పక్షంలో రాజీనామా తప్పదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో కోవర్ట్‌లను గుర్తించాలని ఇదివరకే అధిష్టానానికి జగ్గారెడ్డి రాసిన లేఖ పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: Jagga Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో కోవర్టులను గుర్తించండి, కాంగ్రెస్ అధిష్ఠానానికి జగ్గారెడ్డి లేఖ