ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం అయ్యేందుకు ముంబయికి వెళ్తున్న వేళ ఆ నగరంలో వెలసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశం అవుతున్నాయి. ముంబయి నగరంలో ‘దేశ్ కా నేత కేసీఆర్’ అనే నినాదంతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ముంబయి ప‌ర్యట‌న‌కు ఒక్క రోజు ముందే ముంబయిలోని తెలంగాణ వారు, ముఖ్యంగా కేసీఆర్ అభిమానులు ఈ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి, అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడు ఈ ఫ్లెక్సీలకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సీఎం కేసీఆర్‌కు అభిమాని అయిన తెలంగాణ సాయి వీటిని ఏర్పాటు చేయించారు. ఒకట్రెండు చోట్ల ఎల్ఈడీ లైట్లతో కూడిన ఫ్లెక్సీలు కూడా పెట్టారు.


ఈ ఫ్లెక్సీల్లో మహారాష్ట్ర, తెలంగాణ సీఎంలు, కేటీఆర్ ఫోటోలతో పాటు ప్రాంతీయ పార్టీల నేతల చిత్రాలు ఉన్నాయి. మమతా బెనర్జీ, దేవెగౌడ, అఖిలేష్ యాదవ్, నవీన్ పట్నాయక్, స్టాలిన్ వంటి నేతల ఫోటోలను ఫ్లెక్సీపై ముద్రించారు.


ఆఖరికి ప్రధాని మోదీ ఎంపీగా గెలిచిన వారణాసి వీధుల్లోనూ కేసీఆర్ ఫ్లెక్సీకి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ అభిమాని కేసీఆర్‌ పుట్టిన రోజు ఫ్లెక్సీలు కట్టి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు.






మధ్యాహ్నం ఒంటిగంటకు సీఎంల భేటీ
నేడు (ఫిబ్రవరి 20) ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి బయల్దేరి ముంబయికి వెళ్తారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఉద్ధవ్‌తో కేసీఆర్ భేటీ అవుతారు. ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం అనంతరం ఆయనతోనే కలిసి భోజనం చేయనున్నారు. ఆ తర్వాత కేసీఆర్.. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో భేటీ అవుతారు. సాయంత్రం 4 గంటలకు వీరి భేటీ జరుగుతుంది. కేసీఆర్‌ వెంట పలువురు పార్టీ నాయకులు కూడా వెళ్లనున్నారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ర్టాల హక్కుల్లో పెరుగుతున్న కేంద్రం జోక్యం, కేంద్రంపై పోరాటంలో భావసారూప్యం ఉన్న పక్షాల ఐక్యత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ వీరితో భేటీ అవుతున్న సంగతి తెలిసిందే.