Rajasthan: ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు కొత్త పథకాలు ప్రకటిస్తూ ఉంటాయి. ప్రతిపక్షాలు అధికారంలోకి రావడానికి, అధికార పార్టీలు మరోసారి అధికారం నిలుపుకోవడానికి పథకాలు, ఎత్తులు, పై ఎత్తులు వేస్తుంటారు. పథకాల పేరుతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేసేస్తుంటారు. ఇటీవల కర్ణాటకలో సైతం కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్ర ప్రజల కోసం పథకాలు ప్రకటించింది. అందులో ప్రముఖంగా ఓ పథకం ఎప్పుడు వార్తల్లో ఉంటోంది. అదే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.


ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక తరహాలోనే రాజస్థాన్‌లో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. మహిళలకు ఉచితంగా స్మార్ట్‌ ​ఫోన్లు, మూడేళ్ల పాటు ఉచిత 4G ఇంటర్నెట్​ అందించాలని రాజస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అశోక్‌ గెహ్లాత్‌ ప్రభుత్వం ముఖ్యమంత్రి డిజిటల్‌ సేవా యోజన పథకాన్ని ప్రవేశ పెట్టింది. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. 


దాదాపు 1.3 కోట్ల మంది మహిళలకు మూడేళ్ల ఉచిత డేటాతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను పంపిణీ చేయనుంది. మొదటి విడతగా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక శిబిరాల ద్వారా జైపూర్‌లోని 1.9 లక్షల మంది మహిళలు ఒక్కొక్కరికి రూ.6,800 విలువైన 40 లక్షల స్మార్ట్‌ఫోన్‌లను పంపిణీ చేస్తారు. ఈ పథకం కింద తొలి విడుత కింద ప్రముఖ మొబైల్ కంపెనీలైన రియల్‌మి, రెడ్‌మీ ఫోన్లను అందించనున్నారు. తర్వాత శాంసంగ్, నోకియా వంటి కంపెనీల ఫోన్లను కూడా అందిస్తామని ఓ అధికారి, నాయకుడు తెలిపారు. 


ఫోన్ విలువ రూ.6,800 ఉండగా ఇంటర్నెట్ ఛార్జీల కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.900 చెల్లిస్తుందని చెప్పారు. ఇందుకోసం లబ్ధిదారులు వారి జన్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఎన్‌రోల్‌మెంట్ కార్డ్ తీసుకురావాలని సూచించారు. వితంతువులు కూడా తమ పీపీఈ కార్డును చూపించవలసి ఉంటుంది. చిరంజీవి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ పేరిట అందిస్తున్న ఆరోగ్య బీమా పథకంలో చేరిన కుటుంబాల్లోని దాదాపు 1.35 కోట్ల మంది మహిళలకు ఈ ఫోన్లు అందించనున్నారు.


వీరికి మూడేళ్ల పాటు ఉచితంగా 4G ఇంటర్నెట్‌ సదుపాయం కూడా కల్పిస్తారు. ఇందులో మొదటి సిమ్‌కార్డు లాక్‌ చేసి ఉంటుంది. రెండో సిమ్‌ స్లాట్‌లో ఇంకో సిమ్‌ కార్డు వేసుకునే వీలుంటుంది. పేద మహిళలకు సాధికారత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఉచిత డేటా-ఎనేబుల్ మొబైల్ హ్యాండ్‌సెట్‌లను అందిస్తున్నట్లు రాజస్థాన్ ప్రభుత్వం తెలిపింది. వాస్తవానికి ఈ పథకాన్ని గత ఏడాది ప్రకటించారు. తాజాగా దీనికి సంబంధించిన విధివిధానాలు, టెండర్ల ప్రక్రియను అప్పుడే ప్రారంభించారు. ఇందుకోసం మూడు ప్రైవేటు టెలికాం కంపెనీలతో పాటు బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా పోటీ పడ్డాయి. 


ఈ పథకంపై గతంలో సీఎం గెహ్లాత్‌ మాట్లాడుతూ.. స్మార్ట్‌ఫోన్ ద్వారా పేద మహిళల పిల్లలు ఆన్‌లైన్‌ చదువులకు ఉపయోగపడుతుందన్నారు. మహిళా సాధికారత కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. గ్రామీణ మహిళలు స్మార్ట్‌ఫోన్‌ ప్రయోజనాలను పొందుతారని అన్నారు. తమ ప్రభుత్వం 1.30 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించి ఉపాధి కల్పించిందని, వివిధ శాఖల్లో దాదాపు లక్ష కొత్త ఉద్యోగాలు పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని సీఎం చెప్పారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial