జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టే మూడో విడత వారాహి విజయయాత్ర విశాఖలో ప్రారంభంకానుంది. పది రోజుల పాటు ఆయన ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఈ యాత్రంలో సందర్భంగా ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. జనవాణి కార్యక్రమంలో ప్రజల సమస్యలు తెలుసుకోనున్నారు. 


ఉదయం విశాఖ చేరుకున్న పవన్ కల్యాణ్‌కు జనసేన నాయకులు భారీగా స్వాగతం తెలిపారు. పోలీసులు ఆంక్షలు అమల్లో ఉన్నందున ఎలాంటి హడావుడి లేకుండానే సాగింది యాత్ర. విమానాశ్రయానికి చేరుకున్నా ఆయనకు జనసైనికులు స్వాగతం తెలిపి బస చేసే హోటల్‌కు తీసుకెళ్లారు. 


విశాఖ పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్‌ సాయంత్రం జగదాంబ సెంటర్‌లో బహిరంగ సభలో పాల్గొంటారు. విశాఖలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తారు. స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టు కార్మికుల పోరాటానికి మద్దతు తెలుపనున్నారు పవన్. జనవాణి కార్యక్రమం, క్షేత్రస్థాయి పర్యటనలు చేయనున్నారు. 






విశాఖలో జరిగే జనసేన వారాహి యాత్రపై పోలీసులు మరికొన్ని ఆంక్షలు పెట్టారు. ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని, ఎయిర్‌పోర్ట్ నుంచి ర్యాలీగా రావొద్దని కండీషన్ ఉంది. వాహనం పైనుంచి అభిమానులకు అభివాదాలు చేయవద్దని షరతు పెట్టారు. భవనాలపైకి కార్యకర్తలు, అభిమానులు ఎక్కకుండా చూసే బాధ్యత జనసేనదేనని, ఉల్లంఘనలు జరిగితే అనుమతి తీసుకున్నవారిదే బాధ్యతని స్పష్టం చేశారు. డ్రోన్ కెమెరాలు వాడకూడదని కూడా చెబుతున్నారు. 


పోలీసులు విధించిన ఆంక్షలపై జనసేనికులు మండిపడుతున్నారు. పోలీసుల షరతులపై జనసేన పార్టీ ట్విట్టర్‌లో స్పందించింది. ర్యాలీలో లేదా సభా వేదిక వద్ద క్రేన్లతో గజమాలలు వేయడం లాంటివి చేయవద్దని, భద్రతకు సహకరించాలని కోరింది. వ్యక్తిగత భద్రతాపరమైన నిబంధనలను పాటించాలని జనసేన ప్రకటన విడుదల చేసింది. భద్రతా కారణాలను పార్టీ శ్రేణులు, అభిమానులు దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది.