విశాఖలో పవన్ కల్యాణ్ తన మూడో విడత వారాహి విజయ యాత్ర స్టార్ట్ చేయనున్నారు. కాసేపట్లో ఆయన విశాఖ చేరుకుంటారు. ఆయన్ని హైవే గుండా సిటీలోకి తీసుకురావాలని జనసేన పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. దీనికి ఇంత వరకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని సమాచారం. సెక్షన్ 30 అమల్లో ఉందని పోలీసులు చెబుతున్నారు. 


విశాఖలో జరిగే జనసేన వారాహి యాత్రపై పోలీసులు మరికొన్ని ఆంక్షలు పెట్టారు. ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని, ఎయిర్‌పోర్ట్ నుంచి ర్యాలీగా రావొద్దని కండీషన్ ఉంది. వాహనం పైనుంచి అభిమానులకు అభివాదాలు చేయవద్దని షరతు పెట్టారు. భవనాలపైకి కార్యకర్తలు, అభిమానులు ఎక్కకుండా చూసే బాధ్యత జనసేనదేనని, ఉల్లంఘనలు జరిగితే అనుమతి తీసుకున్నవారిదే బాధ్యతని స్పష్టం చేశారు. డ్రోన్ కెమెరాలు వాడకూడదని కూడా చెబుతున్నారు. 


పోలీసులు విధించిన ఆంక్షలపై జనసేనికులు మండిపడుతున్నారు. పోలీసుల షరతులపై జనసేన పార్టీ ట్విట్టర్‌లో స్పందించింది. ర్యాలీలో లేదా సభా వేదిక వద్ద క్రేన్లతో గజమాలలు వేయడం లాంటివి చేయవద్దని, భద్రతకు సహకరించాలని కోరింది. వ్యక్తిగత భద్రతాపరమైన నిబంధనలను పాటించాలని జనసేన ప్రకటన విడుదల చేసింది. భద్రతా కారణాలను పార్టీ శ్రేణులు, అభిమానులు దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది.


ఇన్ని ఆంక్షలు ఓకే చెప్పినప్పటికీ పవన్ కల్యాణ్‌ వచ్చే రోడ్‌ మ్యాప్‌కు పోలీసులు ఎలాంటి అనుమతి ఇవ్వకపోవడంపై జనసేన నేతలు మండి పడుతున్నారు. మూడో విడత వారాహి యాత్ర 19వ తేదీ వరకు కొనసాగే అవకాశముంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జనసేన ప్రకటించింది. ఈ యాత్రలో విశాఖలో భూకబ్జాలకు సంబంధించి పవన్ క్షేత్రస్థాయి పరిశీలనలు చేపడతారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. పర్యావరణానికి నష్టం కలిగించేలా ధ్వంసం చేసిన ప్రాంతాలను సందర్శించనున్నారని అంటున్నాయి.