పవన్ కల్యాణ్ పై మంత్రి గుడివాడ అమర్ నాథ్ మరోసారి వ్యక్తిగత విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ తొలుత ఉత్తరాంధ్ర బిడ్డకే అన్యాయం చేశారని మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఆరోపించారు. విశాఖకు చెందిన కాపు అమ్మాయిని పెళ్లి చేసుకొని మోసం చేశారని అన్నారు. అలా 20 ఏళ్ల క్రితం అత్తారింటికి దారేది అంటే విశాఖపట్నం, 15 ఏళ్ల క్రితం అత్తారింటికి దారేది అంటే ముంబయి, పదేళ్ల క్రితం అత్తారింటికి దారేది అంటే రష్యా అంటూ ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో మంత్రి గుడివాడ అమర్ నాథ్ మీడియాతో మాట్లాడారు.


పవన్ కల్యాణ్ తీరు బీజేపీతో సంసారం, చంద్రబాబుతో సహజీవనం అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. గాజువాకలో పవన్ కల్యాణ్ ఓడిపోయారని, ఓడిపోయినందుకు, ఓడిపోయిన చోట వారాహి యాత్ర ఎందుకు చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. చంద్రబాబు సిద్ధాంతమే జనసేన సిద్ధాంతమని వ్యాఖ్యలు చేశారు. విశాఖ అభివృద్ధిపై పవన్‌ కల్యాణ్ కు ఉన్న ఆలోచన ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు.


పవన్‌ కల్యాణ్‌ దత్తతండ్రి చంద్రబాబు అని, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజూ సమస్యలు కనిపించలేదా అంటూ గుడివాడ సెటైర్లు వేశారు. ఉత్తరాంధ్రకు ఏం అన్యాయం జరిగిందని పర్యటనకు వస్తున్నారని ప్రశ్నించారు. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటిస్తే ఎందుకు స్వాగతించలేదని ప్రశ్నించారు. 


వారాహి యాత్రను గుడివాడ అమర్ నాథ్ వెబ్‌ సిరీస్‌ అని అభివర్ణించారు. మూడో విడత రేపు విశాఖపట్నంలో ప్రారంభమవుతోందని, ఈ యాత్రలోనే తాను 175 స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పగలవా? అని ప్రశ్నించారు. 25 సీట్లలో పోటీ చేసి సీఎం అవుతారా? అని ఎద్దేవా చేశారు. కనీసం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో జనసేన నేతల పేర్లు పవన్‌ కల్యాణ్ కు తెలుసా? అని ప్రశ్నించారు. విశాఖపట్నం జిల్లా జనసేన అధ్యక్షుడి పేరు కూడా పవన్‌ కల్యాణ్ కు తెలియదని అన్నారు. విశాఖ వచ్చేది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని విమర్శించడానికేనా? అని అన్నారు.


గుడివాడ అమర్ నాథ్ అడిగిన ప్రశ్నలు


విశాఖను పరిపాలన రాజధానిగా వ్యతిరేకించిన పవన్‌ కల్యాణ్ కు ఉత్తరాంధ్రలో పర్యటించే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. అసలు ఉత్తరాంధ్ర మీద పవన్‌ కల్యాణ్ కు సొంత ఎజెండా ఉందా అని అడిగారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎందుకు అడ్డుకోలేదని, చంద్రబాబు పాలనలో 40 గుడులను కూలగొడితే ఎందుకు నోరెత్తలేదని అన్నారు. కమీషన్ కోసం కక్కుర్తిపడి చంద్రబాబు పోలవరాన్ని నాశనం చేశాడని, దాన్ని ఎందుకు ప్రశ్నించలేదని ప్రశ్నించారు. ప్రత్యక హోదాపై మాట్లాటకపోవడంపైనా స్పందించారు. ఉద్దానం కిడ్నీ సమస్యను పరిష్కరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ని ఎందుకు అభినందించలేకపోతున్నావని ప్రశ్నించారు.


వాలంటీర్ వ్యవస్థను కించపరిచిన పవన్ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని, పోలీసు కానిస్టేబుల్ కుమారుడిని అని చెప్పుకొనే పవన్ 40 మంది పోలీసులకు గాయలైతే ఎందుకు స్పందించలేదని అడిగారు. స్టీల్ ప్లాంట్‌పై కార్మికులకు ఒక స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.


Also Read: విశాఖ వారాహి యాత్రకు పలు ఆంక్షలు - పవన్‌ను అభివాదాలు కూడా చేయవద్దన్న పోలీసులు!