Varahi Yatra :   విశాఖలో జనసేన వారాహి యాత్రపై పోలసులు పలు రకాల ఆంక్షలు పెట్టారు. గురువారం నుంచి జనసేన  అధినేత పవన్ కల్యాణ్ చేపడుతున్నారు. ఈ సందర్భంగా పోలీసులు పలురకాల ఆంక్షలతో అనుమతి ఇచ్చారు.  పలు నిబంధనలు విధించారు. కొన్ని షరుతలతో విశాఖలో యాత్రకు అనుమతులు జారీ చేశారు. ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని, ఎయిర్‌పోర్ట్ నుంచి ర్యాలీగా రావొద్దని కండీషన్ విధించారు. ఇక వాహనం పైనుంచి అభిమానులకు అభివాదాలు చేయవద్దని షరతు పెట్టారు. జగదాంబ జంక్షన్‌లో బహిరంగ సభకు పోలీసులు అనుమతి మంజూరు చేశారు. భవనాలపైకి కార్యకర్తలు, అభిమానులు ఎక్కకుండా చూసే బాధ్యత జనసేనదేనని, ఉల్లంఘటనలు జరిగితే అనుమతి తీసుకున్నవారిదే బాధ్యత అని పోలీసులు స్పష్టం చేశారు. 


పోలీసులు విధించిన ఆంక్షలపై జనసేనికులు మండిపడుతున్నారు. పోలీసుల షరతులపై జనసేన పార్టీ ట్విట్టర్‌లో స్పందించింది. ర్యాలీలో లేదా సభా వేదిక వద్ద క్రేన్లతో గజమాలలు వేయడం లాంటివి చేయవద్దని, భద్రతకు సహకరించాలని కోరింది. వ్యక్తిగత భద్రతాపరమైన నిబంధనలను జనసేనికులు పాటించాలని జనసేన ప్రకటన విడుదల చేసింది. క్రేన్లతో భారీ దండలు, గజమాలలు లాంటివి వేయవద్దని సూచించింది. యాత్ర మార్గంలో క్రేన్లు, వాహనాలు ఏర్పాటు చేయడం వల్ల వాహన శ్రేణి సాఫీగా సాగడం లేదని, పవన్ కళ్యాణ్ భద్రతకు భగం వాటిల్లకుండా వారాహి విజయ యాత్రకు విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. భద్రతా కారణాలను పార్టీ శ్రేణులు, అభిమానులు దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది.          





 మూడో విడత వారాహి యాత్ర 19వ తేదీ వరకు కొనసాగే అవకాశముంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జనసేన ప్రకటించింది. ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతున్న వేళ పవన్ వారాహి యాత్ర కీలకంగా మారింది. ఈ యాత్రపై చిరంజీవి వ్యాఖ్యలపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు పనన్ కౌంటర్ ఇచ్చే అవకాశముంది.  గత రెండు విడతల యాత్రను మించి మూడో విడత యాత్రను సక్సెస్ చేయాలని జనసేన భావిస్తోంది. యాత్రను పర్య వేక్షించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది.                             


ఈ యాత్రలో పవన్ కల్యాణ్ విశాఖలో జరుగుతున్న భూకబ్జాలకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలనలు చేపడతారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. పర్యావరణానికి నష్టం కలిగించేలా ధ్వంసం చేసిన ప్రాంతాలను కూడా పవన్ కల్యాణ్ సందర్శించనున్నారని జనసేన వర్గాలు తెలిపాయి. మరి ఈ సందర్శనలు జరుగుతాయా..? లేదా ఏమన్నా మార్పులు ఉండనున్నాయా అనే దానిపై జనసేన ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.