Caste Politics : రాజకీయ పార్టీలో ఉండి ఆ పార్టీ కోసం ఎంత కష్టపడ్డారన్నది పాయింట్ కాదు.. గుర్తింపు రావాలంటే.. పదవి పొందాలంటే ఖచ్చితంగా ఓ సమీకరణం కలసి రావాలి. అధినేతతో సాన్నిహిత్యమో.. విధేయతగా ఉండటమో కాదు.. కావాల్సింది సామాజిక సమీకరణం. రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు పదవుల భర్తీలో సామాజికవర్గాన్నే చూస్తున్నాయి. ఈ ట్రెండ్ మొదటి నుంచి ఉన్నా.. ఇప్పుడు ఊహించని స్థాయికి వెళ్లిపోయింది.
కుల సమీకరణాలతోనే పదవుల పంపకం !
ఎమ్మెల్సీ నుంచి రాజ్యసభ స్థానం వరకు ఏదైనా భర్తీ చేయాలంటే.. ముందుగా కుల సమీకరణాలు చూసుకుంటున్నారు అధినేతలు. విధేయత, ప్రతిభతో పాటు సామాజికవర్గం కార్డు కూడా కీలకం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సామాజిక వర్గాల కోణంలోనే పదవులు పంపకం ఇటీవల కాలంలో ఎక్కువ గా జరుగుతుంది. గతంలో సామాజిక వర్గాలకు అంతాగా ప్రాధాన్యత ఉండేది కాదు. అప్పట్లో పార్టీల అధిష్టానాలు, పార్టీ పెద్దల ఆశ్వీర్వాదాలు ఉంటే సరిపోయేది. కానీ రాను రాను రాజకీయాపార్టీల్లో సామాజిక వర్గాల చర్చ పెద్ద ఎత్తున జరుగుతుండటంతో అధికారపార్టీలు కూడా ఆయా సామాజిక వర్గాల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బలమైన సామాజిక వర్గాలపై దృష్టి పెట్టాయి రాజకీయ పార్టీలు.
సామాజికవర్గాల ప్రకారం పదవుల పంపిణీ !
2014 తర్వాత ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్ లోనూ సామాజిక వర్గాల ప్రాతిపదికనే ఎక్కువ పదవులు లభిస్తున్నాయి. అంతేకాదు అన్నీ సామాజికవర్గాలకు ప్రాధాన్యత అనే కోణంలోకూడా ఇటు టిఆర్ఎస్, అటు వైఎస్ ఆర్ సీ పార్టీలు చూస్తున్నాయి. ఎప్పుడూ పదవులు రాని కొన్ని సామాజికవర్గాలకు పదవులు వస్తుంటే.. బలమైన సామాజిక వర్గాలకు కూడా పదవులు బాగానే లభిస్తున్నాయనే వాదన కూడా విన్పిస్తుంది. అయితే రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు విషయంలో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికారపార్టీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఏపిలోనూ, తెలంగాణలోనూ బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మరో వైపు ఒకే సామాజిక వర్గం ఓట్లు గుండుగుత్తగా తమకు పడేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందుకు రాజకీయ విశ్లేషకులు కొన్ని ఉదాహరణలు కూడా చెబుతున్నారు.
కులాల్ని మచ్చిక చేసుకునేందుకు తంటాలు !
తెలంగాణలో రాజ్యసభ సభ్యుల ఎంపిక నే చూస్తే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మున్నురుకాపు సామాజిక వర్గానిక చెందిన వ్యక్తి కావడంతో బీజేపీవైపు ఆ సామాజిక వర్గం ఓటర్లు అటు వైపు వెళ్తారనే అని అనుకుందో ఏమో టీఆర్ఎస్... అదే మున్నురుకాపు సామాజిక వర్గంలో బలమైన నాయకుడు, బిజినెస్ మ్యాన్ అయిన వద్దిరాజు రవిచంద్రకు రాజ్యసభ వరించింది. వద్ది రాజు రవిచంద్ర పొలిటికల్ గా అంత పెద్ద లీడర్ కాకపోయినా ఆయన సామాజిక వర్గంలో మాత్రం మంచి పట్టు ఉన్నానాయకుడే. మరోవైపు బీజేపీ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, డా.కె. లక్ష్మణ్ కు ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపిస్తోంది. అంటే తెలంగాణలో ఆ సామాజికవర్గంతో పాటు బీసీ నాయకుడైన లక్ష్మణ్ కు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వడం వల్ల బీసీ ఓట్లు తనవైపు తిప్పుకునే ప్రయత్నం బీజేపీ చేస్తుందని అనుకుంటున్నారు. ఇప్పటివరకూ టీఆర్ఎస్ పార్టీ భర్తీ చేసిన అన్నీ పోస్టులు దాదాపు క్వాస్ట్ ఈక్వేషన్ లోనే ఫిల్ అప్ చేస్తుందనేది ఆపార్టీ నేతలే చెబుతున్నారు.
సామాజిక న్యాయం పేరుతో ఏపీలో రాజకీయం !
అటు అంద్రప్రదేశ్ లోనూ ఇదే పరిస్థితి. తెలంగాణకు చెందిన బీసీ నాయకుడు ఆర్. కృష్ణయ్యను జగన్మోహన్ రెడ్డి రాజ్యసభకు పంపిస్తున్నారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇదే ఈక్వీషన్ లో తెలంగాణలో టీడీపీ గెలిస్తే ఆయన్నీ ముఖ్యమంత్రి చేస్తానంటూ ప్రచారం చేశారు. కృష్ణయ్య మాత్రం గెలిచారు. పార్టీ ఓడిపోయింది. కాలక్రమంలో ఆర్. కృష్ణయ్య పార్టీకి దూరమయ్యారు. వైఎస్ ఆర్ సీపి తరపున పెద్దల సభకు పోతున్నారు. ఇదే ఈక్వేషన్ లో వైఎస్ ఆర్ సీపి బీసీలు, మైనార్టీలకు, ఎస్సీ, ఎస్టీలకు పదవులు ఇచ్చామని చెబుతూ మంత్రులు బస్సుయాత్ర కూడా చేశారు. సామాజిక న్యాయభేరి పేరుతో. అయితే కొంత మంది నేతలు , చిన్న కులాలకు చెందిన నేతలు మాత్రం తమకు బలమైన నాయకత్వ లక్షణాలు ఉన్నప్పటికీ క్యాస్ట్ ఈక్వేషన్లో అవకాశాలు రావడంలేదని వాపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సామాజికవర్గాల ఈక్వేషన్ మరింత బలంగా పనిచేసే అవకాశం లేకపోలేదు .