తెలుగుదేశం పార్టీకీ రాజీనామా చేస్తున్నట్లుగా ఆ పార్టీ అధికార ప్రతినిధి, సినీ నటి దివ్యవాణి సోషల్ మీడియాలో ప్రకటించారు. తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ విషయాన్ని ప్రకటించి .. తర్వాత డిలీట్ చేశారు. అయితే అదే స్క్రీన్ షాట్‌ను ఇన్  స్టా అకౌంట్‌లో పోస్ట్ చేశారు.  తెలుగుదేశం పార్టీలో కొన్ని దుష్ట శక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకి్స్తూ రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇంత వరకూ ఆదరించిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. 


 





మహానాడులో మాట్లాడనివ్వలేదని మనస్థాపం !


మహానాడులోనూ దివ్యవాణి ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలి రోజు కొన్ని కార్యక్రమాలను నిర్వహించారు. అయితే రెండో రోజు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆమె అవమానం ఫీలయినట్లుగా తెలుస్తోంది. మహానాడు అయిపోయిన తర్వాత ఆమె మాట్లాడిన ఓ వీడియో క్లిప్ వైరల్ అయింది. అందులో మహానాడులో తనకు అవమానం జరిగిందని... తన ఆరోగ్యాన్ని కూడా లక్ష్య పెట్టకుండా మహానాడుకు వచ్చానని చెప్పుకున్నారు. తాను దేవుని బిడ్డనని.. అవసరం అయితే వైఎస్ఆర్‌సీపీలో చేరుతానని కూడా చెప్పారు. ఆ వీడియో వైరల్ అయింది.. ఆ తర్వాత సోషల్ మీడియాలో టీడీపీకి రాజీనామా అంశాన్ని పోస్ట్ చేశారు. 


గతంలోనూ దివ్యవాణి అసంతృప్తిగా ఉందని ప్రచారం !


దివ్యవాణి పార్టీపై అసంతృప్తిగా ఉన్నారని గతంలోనూ ప్రచారం జరిగింది. అయితే ఆమె అప్పట్లో ఎలాంటి ప్రకటనా చేయలేదు. మళ్లీ టీడీపీలో యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు సోషల్ మీడియాలో స్టేట్ మెంట్ తప్ప ఇంకా ఎలాంటి అదికారిక ప్రకటన చేయలేదు. పార్టీలో తనకు అవకాశాలు రాకుండా.. అధికార ప్రతినిధిని అయినప్పటికీ మాట్లాడకుండా తనను అడ్డుకుంటున్నారనే భావనతో దివ్యవాణి ఉన్నారని అంటున్నారు. 


వైఎఎస్ఆర్‌సీపీలో చేరాలని నిర్ణయించుకున్నారా ? 


తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దివ్యవాణి టీడీపీలో చేరారు. ధాటిగా మాట్లాడగలగడంతో ఆమెకు ప్రాధాన్యం ఇచ్చారు. అధికార ప్రతినిధి హోదా ఇచ్చారు. ఇప్పుడు దుష్టశక్తుల ప్రమేయం పేరుతో పార్టీకి గుడ్ బై చెప్పారు.  ఆమె వైఎస్ఆర్‌సీపీలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.