Divyavani Update : టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి మళ్లీ మనసు మార్చుకున్నారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా తాను చేసిన ట్వీట్‌ను.. సోషల్ మీడియా పోస్టులను డిలీట్ చేశారు. పార్టీలో తనకు ఉన్న సమస్యలపై చంద్రబాబు, లోకేష్‌లతో మాట్లాడతానని ప్రకటించారు. దివ్యవాణి నిర్ణయంపై పార్టీలో కొంత మంది ముఖ్యులు స్పందించి ఆమెతో మాట్లాడటంతోనే ఆమె నిర్ణయం వెనక్కి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 


మహానాడులో అవమానం జరిగిందని దివ్యవాణి ఆరోపణ 
 
మహానాడులోనూ దివ్యవాణి  పాల్గొన్నారు.  అయితే మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆమె అవమానం ఫీలయినట్లుగా తెలుస్తోంది. మహానాడు అయిపోయిన తర్వాత ఆమె మాట్లాడిన ఓ వీడియో క్లిప్ వైరల్ అయింది. అందులో మహానాడులో తనకు అవమానం జరిగిందని... తన ఆరోగ్యాన్ని కూడా లక్ష్య పెట్టకుండా మహానాడుకు వచ్చానని చెప్పుకున్నారు. తాను చనిపోతే శవంతో కూడా రాజకీయాలు చేస్తారేమోనని ఘాటు వ్యాఖ్యలు చేశారు.  తాను దేవుని బిడ్డనని.. అవసరం అయితే వైఎస్ఆర్‌సీపీలో చేరుతానని కూడా చెప్పారు. ఆ వీడియో వైరల్ అయింది.. ఆ తర్వాత సోషల్ మీడియాలో టీడీపీకి రాజీనామా అంశాన్ని పోస్ట్ చేశారు. 


రాజీనామా పోస్టులు పెట్టి తీసేసిన దివ్యవాణి


అయితే ఆమె నిర్ణయం తీసుకోవడంలో గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే మొదట ట్విట్టర్‌లో రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. తర్వాత దాన్ని డిలీట్ చేశారు. అయితే ఆ ట్వీట్ స్క్రీన్ షాట్‌ను ఇన్ స్టా అకౌంట్‌లో ఉంచారు. తర్వాత ఇన్‌స్టా అకౌంట్ నుంచి కూడా ఆ పోస్ట్‌ను తొలగించారు. దీంతో దివ్యవాణి రాజకీయంగా నిర్ణయం తీసుకోవడంలో గందరగోళంలో ఉన్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. 


చంద్రబాబు, లోకేష్‌లతో మాట్లాడతానని వివరణ 


దివ్యవాణి పార్టీపై అసంతృప్తిగా ఉన్నారని గతంలోనూ ప్రచారం జరిగింది. అయితే ఆమె అప్పట్లో ఎలాంటి ప్రకటనా చేయలేదు. మళ్లీ టీడీపీలో యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు సోషల్ మీడియాలో స్టేట్ మెంట్ తప్ప ఇంకా ఎలాంటి అదికారిక ప్రకటన చేయలేదు. పార్టీలో తనకు అవకాశాలు రాకుండా.. అధికార ప్రతినిధిని అయినప్పటికీ మాట్లాడకుండా తనను అడ్డుకుంటున్నారనే భావనతో దివ్యవాణి ఉన్నారని అంటున్నారు.  తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దివ్యవాణి టీడీపీలో చేరారు. ధాటిగా మాట్లాడగలగడంతో ఆమెకు ప్రాధాన్యం ఇచ్చారు. అధికార ప్రతినిధి హోదా ఇచ్చారు. ఈ అంశంపై మళ్లీ ఏమైనా ప్రకటన చేస్తారేమోనని టీడీపీ వర్గాలు చూస్తున్నాయి.  దివ్యవాణి వివాదంపై తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా ఇంకా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.