Bandi Sanjay Statement On Women and children Missing In AP: ఆంధ్రప్రదేశ్‌లో 2019-23 మధ్య అదృశ్యమైన 44,685 మంది మహిళల్లో 44,022 మందిని పోలీసులు వెతికి పట్టుకున్నారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పార్లమెంట్‌లో ప్రకటించారు. ఈ విషయంలో కేంద్ర హోంశాఖ రాష్ట్ర పోలీస్ శాఖకు సహాయపడిందని టీడీపీ ఎంపీలు బీకే పార్థసారథి, లావు శ్రీకృష్ణ దేవరాయలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మహిళలపై వేధింపులు, చిన్నారులపై అఘాయిత్యాలు తదితర చర్యల నుంచి కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి `విముక్తి` కార్యక్రమం నిర్వహించినట్టు మంత్రి బండి సంజయ్ వివరించారు.
మానవ అక్రమ రవాణాను నివారించడంలోనూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హోం మంత్రిత్వ శాఖ ఆర్థిక సాయం చేసినట్టు బండి చెప్పారు. దీని కోసం ప్రతి జిల్లాలో యాంటీ ట్రాఫికింగ్ యూనిట్లను నెలకొల్పామన్నారు.
నాలుగేళ్లలో అదృశ్యమై, మళ్లీ గుర్తించిన వారి వివరాలు..
సంవత్సరం | అదృశ్యమైనవారి సంఖ్య | దొరికిన వాళ్లు |
2019 | 6,896 మంది | 6,583 మంది |
2020 | 7,576 మంది | 7,189 మంది |
2021 | 10,085 మంది | 9,616 మంది |
2022 | 10,443 మంది | 10,994 మంది |
2023 | 9,695 మంది | 9,640 మంది |
ఎన్నికల ముందు అదృశ్యంపై రాజకీయ రచ్చ
వైసీపీ పాలనలో 30 వేల మంది ఏపీ మహిళలు చిన్నారులు అదృశ్యమయ్యారని ఎన్నికల ముందు పవన్ పదే పదే ప్రచారం చేశారు. మహిళల మిస్సింగ్ వెనుక వలంటీర్ల పాత్ర ఉందని ఆరోపించారు. ఇంటింటికీ తిరిగే కొందరు వలంటీర్లు మహిళల, యువతుల వివరాలు సేకరించారని అన్నారు. అయితే ఇప్పుడు కేంద్రమంత్రి ప్రకటనతో ఆయనపై విమర్శలు ఎక్కుపెట్టింది వైసీపీ. రాజకీయ లబ్ధి కోసమే అబద్దపు ప్రచారం చేశారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు.
పవన్ ట్వీట్‌కు వైసీపీ రీట్వీట్..
మహిళల అక్రమ రవాణా, అదృశ్యానికి సంబంధించి జులై 26, 2023న సోషల్ మీడియాలో పవన్ పెట్టిన పోస్టుకు కేంద్రమంత్రి పార్లమెంట్ స్టేట్‌మెంట్‌ను ట్యాగ్ చేసింది. దిశ యాప్ కారణంగా కనిపించకుండాపోయిన వారిని పోలీసులు తేలిగ్గా వెతికి పట్టుకోగలిగారని పేర్కొంది. అదృశ్యం కావడానికి ముఖ్యంగా ప్రేమ వ్యవహరాలు, పరీక్షల్లో తప్పడం, ఇంట్లో ఘర్షణలు, మానసిక రుగ్మతలే కారణమవుతాయని వైసీపీ వివరించింది. వాటిని రాజకీయంగా వాడుకుని తప్పుడు ప్రచారం చేయడంపై ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని నిలదీసింది. 2015-18 మధ్య గత చంద్రబాబు ప్రభుత్వలో ట్రేస్ కాని అదృశ్యం అయిన మహిళలు 1,542 మంది ఉన్నారని పేర్కొంది. వారంతా కూడా అక్రమ రవాణాకు గురైనట్టేనా చెప్పాలని డిమాండ్ చేసింది.
30 వేల మందిని తీసుకురావాలని కోరిన కేఏ పాల్.
కూటమి విజయం సాధించిన వెంటనే ప్రెస్‌మీట్ పెట్టిన కేఏ పాల్ ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. తమ్ముడూ పవన్ కల్యాణ్, నువ్వు ఆరోపించినట్టు ఏపీలో అదృశ్యమైన 30 వేల మంది చిన్నారులు, మహిళలను వెతికి కనిపెట్టి వారి ఫ్యామిలీలకు చేర్చే బాధ్యత తీసుకోవాలని సూచించారు. చేతిలో అధికారం ఉంది, డిప్యూటీ సీఎంగా ఉన్నావు కాబట్టీ అదేమంత కష్టమైన పని కాదన్నారు.
అధికారంలోకి వచ్చనిన తర్వాత పవన్... 9 నెలల క్రితం కనిపించకుండా పోయిన ఓ అమ్మాయిని తల్లిచెంతకు రప్పించారు. కశ్మీర్‌లో ఉండగా పోలీసుల సాయంతో ఇంటికి రప్పించారు.
Also Read: పింఛన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్- నేరుగా పంపిణీ చేయనున్న చంద్రబాబు