Pawan Kalyan Election Campaign: వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఏపీలో అధికార వైసీపీ ఒంటరిగా అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రతిపక్ష టీడీపీ, పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కలిసి కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. ఎన్నికలకు సంబంధించి సీట్ల లెక్క తేలకపోయినా ప్రచారంపై జనసేనాని పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) ఫోకస్ చేస్తున్నారు. ఫిబ్రవరి 4వ తేదీన ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాలని జనసేన నిర్ణయించుకుంది. ఆదివారం నాడు అనకాపల్లిలో అతి భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనకాపల్లి నుంచే ఎన్నికల ప్రచారం మొదలుపెడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 


ఫిబ్రవరి 4న శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి దీవెనలతో జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం అదేరోజు అనకాపల్లిలో జనసేన నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అదే సభలో కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే పవన్‌తో కొణతాల భేటీ అయి పార్టీలో చేరికపై చర్చించారని తెలిసిందే.