Ysrcp Mla Candidates : రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్న అధికార వైసీపీ ఐదో విడత అభ్యర్థులు ప్రకటనపై కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో వైసీపీ పలు పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ స్థానాల్లోనూ మార్పులు, చేర్పులు ఉండే అవకాశముందని సూచాయగా చెప్పింది. ఇక, మిగిలిన స్థానాలకు ఐదో విడతలోనే అభ్యర్థులను ప్రకటించేందుకు వైసీపీ అధిష్టానం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో పలు అంశాలను పరిగణలోకి తీసుకుని లెక్కలు వేసుకుంటోంది. ఇందుకోసం సామాజిక సమీకరణలు, సర్వే లెక్కలు వంటి అంశాలను కూలంకుషంగా పరిశీలిస్తోంది. అన్నీ సవ్యంగా సాగితే రెండు, మూడు రోజుల్లోనే ఐదో విడత అభ్యర్థులు ప్రకటన ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఐదో విడత అభ్యర్థులు ప్రకటన కోసం ఆశావహ అభ్యర్థులతోపాటు కేడర్‌ కూడా ఆశగా ఎదురు చూస్తోంది. 


కీలక నియోజకవర్గాల్లో మార్పులు 
వైసీపీ ఇప్పటి వరకు 10 పార్లమెంట్‌, 58 అసెంబ్లీ స్థానాలకు నాలుగు విడతల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ స్థానాల్లో చాలా చోట్ల కొత్త వారికి అవకాశాలు కల్పించిన వైసీపీ అనేక మందికి సీట్లు ఇచ్చేందుకు నిరాకరించింది. కొంత మందికి స్థానాలను మార్చింది. మరి కొందరికి పెండింగ్‌లో పెట్టింది. ఇంకొందరిని ఎంపీ అభ్యర్థులుగా బరిలో నిలుపుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఐదో విడత జాబితా విడుదలకు సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలోని అనేక నియోకజవర్గాల్లో ఈసారి భారీగా మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా చేస్తున్న కొందరిని ఎంపీలుగా బరిలోకి దింపేందుకు జగన్‌ సిద్ధమవుతున్నారు. అనేక చోట్ల ఈసారి కొత్త ముఖాలకు చాన్స్‌ ఇచ్చే యోచనలో ఉన్న జగన్మోహన్‌రెడ్డి.. ఆ మేరకు ఐదో జాబితాపై కసరత్తు పూర్తి చేసినట్టు చెబుతున్నారు. ఆయా అభ్యర్థుల ఆర్థిక, అంగ బలంతోపాటు జనాల్లో  వారికి ఉన్న ఆదరణ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. 


పెండింగ్‌లో 15 ఎంపీ, 117 అసెంబ్లీ స్థానాలు 
రాష్ట్రంలో వైసీపీ ప్రకటించాల్సిన స్థానాలు జాబితాలో 15 ఎంపీ, 117 అసెంబ్లీ సెగ్మెంట్స్‌ ఉన్నాయి. సుమారు 100 స్థానాల్లో ప్రకటించాల్సిన అభ్యర్థులపై స్పష్టతకు వచ్చిన అధిష్టానం.. మిగిలిన స్థానాలపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ స్థానాల్లో ప్రస్తుతం సీనియర్‌ నేతలు ప్రాతినిధ్యం వహిస్తుండడం, కొత్త వారు ఇక్కడ ప్రజల్లోకి వెళ్లి జోరుగా ప్రచారాన్ని సాగిస్తుండడంతో ఇక్కడ అభ్యర్థులు ఎంపిక అధిష్టానానికి ఇబ్బందిగా మారింది. పాత వారికి ఇస్తే విజయావకాశాలు తక్కువగా ఉండడం, కొత్త వారికి ఇస్తే సీనియర్లు కలిసి వచ్చే అవకాశాలు లేకపోవడం వంటి అంశాలతో ఏం చేయాలన్న దానిపై అధిష్టానం ఆలోచన చేస్తోంది.


ఇప్పటికే ఆయా నియోజకవర్గాలపై రెండు, మూడుసార్లు సమావేశాలు నిర్వహించిన ముఖ్య నాయకులు.. ఏకాభిప్రాయం సాధించే దిశగా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఇక్కడ అభ్యర్థుల ప్రకటన వైసీపీకి కత్తి మీద సాములా మారిందని చెబుతున్నారు. ఈ చిక్కులన్నింటినీ పరిష్కరించుకుని వైసీపీ ఐదో విడత జాబితా ప్రకటనకు సిద్ధమవుతోంది. ఈ జాబితా తరువాత వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశముందన్న ప్రచారమూ జోరుగా సాగుతోంది.