Chandrababu Comments on CM Jagan in Nellore Meeting: ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించేలా చర్యలు చేపడతామని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఐదేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని.. నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరులో (Nellore) ఆదివారం నిర్వహించిన 'రా.. కదలిరా' బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ (CM Jagan)పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ అబద్ధాలతో ప్రజలను నమ్మించి మరోసారి అధికారంలోకి రావాలని ఆరాటపడుతున్నారని.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదన్న ఆయన.. వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ బాధితులేనని అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనలో ప్రభుత్వం విఫలమైందని.. ఎంపీ గల్లా జయదేవ్ కు చెందిన అమర్ రాజా బ్యాటరీస్ పరిశ్రమను ఏపీ నుంచి వెళ్లిపోయేలా చేశారని మండిపడ్డారు. గల్లా కుటుంబం రాజకీయాలే వద్దనే పరిస్థితికి తెచ్చారని విమర్శించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం పూర్తిగా నష్టపోయిందని.. వారి బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అన్నారు.


రాష్ట్రాన్ని నెం.1గా నిలబెడతా


ఈ రాష్ట్రాన్ని, తెలుగువారిని ప్రపంచంలో నెం.1 స్థానంలో నిలబెట్టే బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబు అన్నారు. తనకు కష్టం వస్తే వివిధ రాష్ట్రాలతో పాటు.. 80 దేశాల్లో ప్రజలు మద్దతు తెలిపారని గుర్తు చేశారు. తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వారు నెమరు వేసుకున్నారని ఓ నాయకుడికి ఇంతకంటే ఏం కావాలని అన్నారు. పేదవారిని ఆర్థికంగా బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నేడు ఎక్కడ చూసినా విధ్వంసం, తుగ్లక్ విధానాలతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారని.. అందుకే 'రా కదలి రా' అని పిలుపునిచ్చినట్లు వివరించారు. జగన్ రెడ్డి ‘సిద్ధం’ అని మీటింగ్ పెట్టారని.. మీరు సిద్ధమంటే టికెట్లిచ్చిన వైసీపీ నేతలందరూ పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర భవిష్యత్ కోసం వైసీపీ నాయకులకు కూడా  “రా కదలి రా” అని పిలుపునిస్తున్నట్లు పేర్కొన్నారు.


వైసీపీ హయాంలో దీనస్థితిలో రైతులు


వైసీపీ హయాంలో అన్నదాతలు చితికిపోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ వర్గం ఆనందంగా లేదని.. ఆక్వా రంగం కుదేలైందని, ధాన్యం కొనుగోళ్లను కమీషన్ల పర్వం సాగుతోందని ఆరోపించారు. 'ఆక్వా రంగాన్ని బాగు చేసే బాధ్యత టీడీపీ - జనసేన తీసుకుంటుంది. లక్షా 50 వేల రుణమాఫీ చేశాం. ఒకేసారి రూ.50 వేల రుణమాఫీ చేసిన చరిత్ర టీడీపీది. జగన్ రెడ్డి రైతు భరోసా పేరుతో ఇచ్చేది ఏడాదికి రూ.7,500 మాత్రమే. ఐదేళ్లలో రూ.37,500 మాత్రమే ఇస్తున్నారు. ఎక్కువ అప్పులున్న రైతు కుటుంబాల్లో ఏపీ ప్రథమస్థానంలో ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానం, రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో రాష్ట్రాన్ని నిలిపారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఆక్వాకు రూ.1.50కే యూనిట్ విద్యుత్ ఇస్తాం' అని చెప్పారు.


'జగన్ రెడ్డిది భస్మాసుర హస్తం'


జగన్ రెడ్డి అభిమన్యుడు కాదు.. అర్జునుడు కాదు.. భస్మాసురుడని చంద్రబాబు మండిపడ్డారు. చంద్రన్న కానుకలు, విదేశీ విద్య, రైతుల సబ్సిడీలు తీసేసిన వ్యక్తి జగన్ రెడ్డి తనకు ఇల్లే లేదంటున్నారంటూ ఎద్దేవా చేశారు. తాడేపల్లి, బెంగుళూరు, పులివెందుల, హైదరాబాద్, రుషికొండలో రూ.500 కోట్ల ప్యాలెస్ లు కట్టుకోలేదా? అని ప్రశ్నించారు. నేడు గ్రామాల్లో ఎక్కడ చూసినా అంథకారం నెలకొందని.. 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం పేరుతో ప్రజల రక్తాన్ని తాగే వ్యక్తి జగన్ అని.. మద్యపాన నిషేధం అమలు చేయకుంటే ఓట్లు అడగబోనన్నారని మరి ఇప్పుడు ఏం చేశారని నిలదీశారు. త్వరలోనే ప్రజలు ఫ్యాన్ రెక్కలు విరిచి పక్కన పెడతారని జోస్యం చెప్పారు.


'ప్రజల బిడ్డ కాదు.. క్యాన్సర్ గడ్డ'


బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జగన్ రెడ్డి చేసిందేమీ లేదని.. టీడీపీ హయాంలో వారి ఆర్థికాభివృద్దికి కృషి చేసినట్లు చంద్రబాబు తెలిపారు. జగన్ రెడ్డి ప్రజల బిడ్డ కాదు.. క్యాన్సర్ గడ్డ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు ఫ్యాన్ రెక్కలు విరిచి.. రివర్స్ పాలనకు రివర్స్ గిఫ్ట్ ఇస్తారని అన్నారు. అక్రమాలను ప్రశ్నించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వేధింపులకు పాల్పడ్డారని మండిపడ్డారు. 'పెట్రోల్ రేట్లు దేశంలోనే అధికంగా ఉన్నాయి. ఆటో నడిపే వ్యక్తి ఏడాదికి రూ.24వేలు పెట్రోల్ కోసం అదనంగా ఖర్చు చేసే పరిస్థితి వచ్చింది. రూ.10 వేలు రిపేరు ఛార్జీలు. ఫైన్ల పేరుతో వారిని వేధిస్తున్నారు. ఒక్కో ఆటో కార్మికుడిపై అదనంగా రూ.50 వేలు భారం వేసి రూ.10 వేలు ఇస్తున్నారు. పది లక్షల మంది ఉంటే 2.60 లక్షల మందికే ఇస్తున్నారు. దోచింది రూ.5 వేలు, ఇచ్చింది రూ.260. గ్రీన్ ట్యాక్స్ పేరుతో దోచుకుంటున్నారు. ఇదంతా దోపిడీ కాదా? రవాణా రంగం కుదేలైంది. టీడీపీ పాలనలో క్లీనర్ లారీ ఓనరైతే.. జగన్ రెడ్డి పాలనలో ఓనరు క్లీనరయ్యాడు.' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


'అనారోగ్య శ్రీగా మార్చారు'


ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీగా మార్చారని చంద్రబాబు మండిపడ్డారు. పెండింగ్ బిల్లులతో పేదవారిని వంచిస్తున్నారని.. మేం మహాప్రస్థానం పెడితే.. నేడు ద్విచక్ర వాహనాలపై మృతదేహాలను తరలించే పరిస్థితి ఎదురైందని అన్నారు. 'టిడ్కో ఇళ్లను పూర్తి చేయకుండా వంచించారు. పట్టాదారు పాసు పుస్తకంపైనా జగన్ రెడ్డి బొమ్మ వేసుకుంటున్నారు. సర్వే రాళ్లపైనా వేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డి పతనం ప్రారంభమైంది. దేవుడు కూడా కాపాడలేరు. అందుకే స్టార్ క్యాంపెయినర్స్ అంటున్నారు. జగన్ రెడ్డి పాలనలో బాధితులందరూ స్టార్ క్యాంపెయినర్సే. 5 కోట్ల ప్రజలు స్టార్ క్యాంపెయినర్స్ గా మారి జగన్ రెడ్డిని భూస్థాపితం చేస్తామని శపథం చేయాల్సిన అవసరం ఉంది.' అని చంద్రబాబు పిలుపునిచ్చారు. 


'వారు రాజకీయాలకు అనర్హులు'


అనిల్ కుమార్ యాదవ్ అవినీతిపరుడని.. అన్నింటికీ కమిషన్లేనని చంద్రబాబు ఆరోపించారు. గోవా పాండిచ్చేరి నుంచి మద్యం తీసుకువచ్చి అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ బూతులు తిట్టేవారికి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఎంత ఎక్కువ బూతులు తిడితే అంత పెద్ద టికెట్ అని పేర్కొన్నారు. ఇలాంటి వారు రాజకీయాలకు అనర్హులంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


Also Read: YS Sharmila: 'అండగా నిలిచి అధికారంలోకి తెచ్చినా కృతజ్ఞత లేదు' - ప్రజలకు మేలు కోసమే పుట్టింటికి వచ్చానన్న షర్మిల