Govt Officers: ప్రభుత్వ ఉద్యోగం వస్తే కాలుమీద కాలేసుకొని బతకొచ్చనేది చాలా మంది భావన. అందుకే సర్కారీ కొలువు కోసం విపరీతంగా శ్రమిస్తుంటారు. ఉద్యోగం పొందినవారు సక్రమంగా చేసుకుంటే.. మరికొందరు అడ్డదారుల్లో లంచాలకు అలవాటు పడి అక్రమంగా సంపాదిస్తుంటారు. అలా లెక్కకు మించి అక్రమార్జనతో దొరికిపోయిన ప్రభుత్వ ఆఫీసర్లు ఎంతో మంది ఉన్నారు. ఆదాయానికి వందల రెట్లు అధికంగా ఆస్తులు సంపాదించిన తీరు చూసి మనం విస్తుపోయాం. కానీ, అదే ప్రభుత్వ ఉద్యోగం కోసం తన సొంత ఆస్తులను త్యాగం చేసిన వారు మాత్రం ఇప్పటిదాకా చూడలేదనే చెప్పుకోవాలి. కానీ, తమిళనాడులో ఓ మహిళా ప్రభుత్వ అధికారిణి తన రూ.కోట్లాది విలువ చేసే స్థలాన్ని ఓ మంచి పని కోసం ప్రభుత్వానికి ఇచ్చేసి ఆదర్శంగా నిలిచారు.


ఇదిలా ఉంటే ఇటీవలే హైదరాబాద్ లో శివబాలకృష్ణ అనే హెచ్ఎండీఏ ఉద్యోగి విపరీతమైన లంచాలు తీసుకొని పోగు చేసుకున్న అక్రమ సంపదతో దొరికిపోయారు. ఈ రెండు పరిణామాలు దాదాపు ఒకే సమయంలో జరగడంతో వీటికి ప్రాధాన్యం ఏర్పడింది. ఒకరు ప్రభుత్వ ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకొని లెక్కలేనన్ని ఆస్తులు సంపాదించుకుంటే.. మరొకరు మాత్రం మంచి పని కోసం తన సొంత ఆస్తిని ప్రభుత్వానికి ఇచ్చేశారు. ఈ ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది.


హైదరాబాద్ లో శివ బాలకృష్ణ తీరు


వారం రోజుల క్రితం వరకు ఆయన ఎవరో ఓ శివబాలకృష్ణ. కానీ ఇప్పుడు మీడియాలో స్పేస్ క్రియేట్ చేసుకున్నాడు. ఆయన ఇంట్లో వందల కోట్ల నగదు కుప్పలు పోసి ఉంటుంది. కిలోల కొద్దీ బంగారం, వెండి బీరువాల్లో మూలుగుతుంటుంది. ఇక సెల్‌ఫోన్లు, వాచ్‌లు, గిఫ్టులు.. ఓ షోరూమ్ పెట్టుకోవచ్చు. టౌన్ ప్లానింగ్ అధికారి స్థాయి నుంచి రెరా సెక్రటరీవరకు సాగిన ఉద్యోగ ప్రయాణంలో ఆయనది అతిపెద్ద అవినీతి సామ్రాజ్యం 
చేయి తడిపితేనే అనుమతులు. ఈయన పాపంలో పాత్రధారులు ఎందరో ఉన్నారు.


ఒక మనిషి తన జీవిత కాలంలో సంతృప్తికరంగా బతకడానికి ఎంత కావాలి? శివబాలకృష్ణ మాత్రం తన తర్వాత 15 తరాలు దర్జాగా బతికేలా ఓ పద్ధతి ప్రకారం అక్రమ సంపద వెనకేసుకున్నాడు. కొన్ని రోజుల్లో మనం ఈయన గురించి మర్చిపోతాం. ఎందుకంటే ఈయన గారి అవినీతిని పెంచిపోషించిన వ్యవస్థే.. ఏదో రూపంలో ఆయన భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుంది. ఆ కరప్షన్ డబ్బే మళ్లీ బాలకృష్ణకు స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. శివబాలకృష్ణకు ఏసీబీ సంకెళ్లు వేసిన సందర్భంలోనే ఓ ప్రభుత్వ ఉద్యోగి గురించి తమిళనాడులో చర్చ మొదలైంది.


అమ్మాళ్ పూర్ణమ్ అధ్భుతం


ఆమె పేరు ఆయి అమ్మాళ్ అలియాస్ పూర్ణమ్. ఉండేది తమిళనాడు మధురై జిల్లా. ఒకరోజు ఉన్నట్టుండి జిల్లా విద్యాశాఖాధికారి ఆఫీసుకెళ్లారు. సంచిలో నుంచి నాలుగు కాగితాలు తీసి టేబుల్‌పై పెట్టారు. ఆ డాక్యుమెంట్స్ చూసి ఆయన కళ్లల్లో నీటిచారలు. తన ఎకరంన్నర స్థలం.. సుమారు రూ.7 కోట్ల విలువ . ఆ స్థలాన్నే గవర్నమెంట్ స్కూల్‌కి ఇచ్చేశారు అమ్మాళ్. పంచాయతీ స్కూల్‌ను హైస్కూల్‌గా మార్చమని కోరారు. సక్రమంగానో.. అక్రమంగానో ఆస్తులు కూడబెట్టుకునే రోజుల్లో సింపుల్‌గా రూ.7 కోట్ల భూమిని ఊరి పిల్లల చదువు కోసం ఇచ్చేశారు. కూతురు డిగ్రీ చదువుకుంటూ పేదల కోసం పోరాడుతుండేవారు. మురికివాడల్లో పిల్లలకు చదువు చెప్పేది. చదువు మాత్రమే బడుగుల జీవితాలను మారుస్తుందని అమ్మకు ఎప్పుడూ చెప్పేది.




అలాంటి బిడ్డ చిన్న వయసులోనే కాలం చేసింది. కూతురు చనిపోయినా ఆమె ఆశయానికి జీవం పోసింది అమ్మాళ్. ఎప్పుడో పుట్టింటోళ్లు పెళ్లి కానుకగా ఇచ్చిన స్థలాన్ని పాఠశాల భవనం కోసం ప్రభుత్వానికి ఇచ్చేసింది. కెనరా బ్యాంక్‌లో క్లర్క్‌ గా నోట్ల కట్టలు చూస్తూనే ఉంటుంది. అయినా రూ.7 కోట్ల విలువైన భూమిపై ఆమెకు ఆశలేదు. పేద పిల్లల చదువుల్లో తన బిడ్డను ఇక చూసుకుంటుంది.


రిపబ్లిక్ డే సందర్భంగా తమిళనాడు సీఎం స్టాలిన్.. ఆమె నిలువెత్తు సేవకు సెల్యూట్ చేశారు. ఆమెది ఎంత పెద్ద మనసో ఆ చిరునవ్వే చెబుతుంది. ‘‘వందల కోట్లు వెనకేసిన శివబాలకృష్ణ జైల్లో ఉన్నాడు. పెద్దమనసున్న పెద్దమ్మ అమ్మాళ్ జనం గుండెల్లే ఉంది. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే’’ అని సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది.