Apcc Chief Sharmila Comments In Tirupati Wide Level Meeting: తాను ఏపీ ప్రజలకు మేలు చేయడం కోసమే తన పుట్టింటికి వచ్చానని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharimila) అన్నారు. తిరుపతి (Tirupati) జిల్లాలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ (Congress) పార్టీ కీలక నేతలు పల్లం రాజు, రఘువీరా రెడ్డి, కొప్పుల రాజు, గిడుగు రుద్రరాజు ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు వైసీపీని తన భుజాలపై వేసుకుని పాదయాత్ర చేశానని.. అండగా నిలబడి అధికారంలోకి తెచ్చినా, ఈ రోజు కనీసం కృతజ్ఞత లేదని అన్నారు. తన మీద, తన వ్యక్తిగత జీవితం మీద వైసీపీ నేతలు నానా రకాలుగా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. అయినా, ఈ వైఎస్సార్ బిడ్డ భయపడేది కాదని.. పులి కడుపున పులే పుడుతుందని, తన ఒంట్లో ఉన్నది వైఎస్ రక్తం అని పునరుద్ఘాటించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుందని.. పోలవరం, ప్రత్యేక హోదా, రాజధాని వచ్చి ప్రజలకు మేలు కలగాలనే తాను ఇక్కడికి వచ్చినట్లు స్పష్టం చేశారు. తన గుండెల్లో నిజాయితీ ఉందని.. ఎవరు ఎన్ని రకాల నిందలు వేసినా పర్వాలేదని అన్నారు. ఆంధ్ర ప్రజలకు న్యాయం జరిగే వరకూ ఎలాంటి త్యాగానికికైనా తాను సిద్ధంగా ఉన్నానని.. ఎలాంటి పోరాటానికైనా సిద్ధం కావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
'ప్రత్యేక హోదా ఏమైంది.?'
బీజేపీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని.. ఇదే తిరుపతిలో నిలబడి ప్రధాని మోదీ మాట ఇచ్చారని, ఆ హామీ ఏమైందని షర్మిల ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మోదీ చేసింది అన్యాయమని.. బీజేపీది కేడీల పార్టీ అని తీవ్ర విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఏపీకి ఎన్నో పరిశ్రమలు, లక్షల్లో ఉద్యోగాలు వచ్చేవని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ హోదా ఇస్తే.. నిధులు ఇవ్వని వ్యక్తి మోదీ అని మండిపడ్డారు. రాజధానికి కూడా నిధులు ఇవ్వలేదని దుయ్యబట్టారు. మోదీ మనకు వెన్నుపోటు కాదని.. కడుపులో పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా, జగనన్న, చంద్రబాబు బీజేపీకి బానిసలయ్యారని ఆరోపించారు.
'ఒక్క రాజధానీ లేదు'
టీడీపీ హయాంలో చంద్రబాబు అమరావతి అని, సింగపూర్ అని త్రీడీ గ్రాఫిక్స్ చూపించారని.. వైసీపీ హయాంలో జగనన్న 3 రాజధానులన్నారని, చివరకు ఒక్క రాజధానీ లేదని షర్మిల ఎద్దేవా చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మెట్రో ఉన్నా.. ఏపీలో మాత్రం లేదని, ఆంధ్ర ప్రజలు అంత తీసిపోయారా.? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు, జగన్ బీజేపీకి బానిసలుగా మారి.. ఏపీ ప్రజలను సైతం బానిసలుగా మార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు. 'ఒక్క సీటూ గెలవని బీజేపీ ఏపీలో రాజ్యమేలుతోంది. వైఎస్ హయాంలో హంద్రీనీవా ప్రాజెక్టు పనులను రూ.4 వేల కోట్లతో 90 శాతం పూర్తి చేశారు. జగనన్న సీఎం అయ్యాక కనీసం ఆ 10 శాతం పనులు కూడా పూర్తి చేయలేదు. గాలేరు నగరి ప్రాజెక్టును అటకెక్కించారు. వైఎస్ కట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయని మీరు వైఎస్ వారసుల ఎలా అవుతారు.?. వైఎస్ పాలనకు, జగన్ పాలనకు ఆకాశానికి, పాతాళానికి ఉన్న తేడా ఉంది.' అని వ్యాఖ్యానించారు.
'మాట తప్పే నాయకుడు జగన్'
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాట మీద నిలబడే నాయకుడు అని.. జగన్ మాట తప్పే నాయకుడు అని షర్మిల విమర్శించారు. మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లు అడగను అని ఆనాడు జగన్ చెప్పారని గుర్తు చేశారు. మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత వంటిది అన్న జగన్.. ఇచ్చిన ప్రతి మాట తప్పారని ఎద్దేవా చేశారు. వైసీపీ, టీడీపీలకు ఓట్లేస్తే టీడీపీకి ఓట్లేసినట్లేనని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని శ్రేణులకు సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే విభజన హామీలు నెరవేరుతాయని స్పష్టం చేశారు.
Also Read: Galla Jayadev: పార్ట్ టైంగా రాజకీయాలు చేయలేను - అందుకే పూర్తిగా తప్పుకుంటున్నా - గల్లా జయదేవ్