Ration Card E-Kyc Date Extended: రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డుల ఈ - కేవైసీ (E - Kyc) గడువును ఫిబ్రవరి చివరి వరకూ పొడిగిస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఈ - కేవైసీ ప్రక్రియ కొనసాగుతుండగా.. ఈ నెల 31తో గడువు ముగియనుంది. ఈ క్రమంలో రేషన్ షాపుల వద్దకు జనం క్యూ కడుతున్నారు. గత 2 నెలలుగా రేషన్ షాపుల్లో ఈ - కేవైసీ అప్ డేట్ చేస్తున్నా ఇంకా రద్దీ తగ్గలేదు. ఈ - కేవైసీ పూర్తి కాకపోతే రేషన్ సరుకులు కోత పెట్టే అవకాశం కూడా లేకపోలేదు. ముందుగా విధించిన గడువు ప్రకారం మరో 4 రోజులే సమయం ఉండగా.. రేషన్ కార్డు దారులు ఆందోళన చెందారు. దీంతో గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకూ రేషన్ కార్డుల ఈ - కేవైసీ 75.76 శాతం పూర్తైంది. అనేక రాష్ట్రాల్లోనూ ఈ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో రేషన్ కార్డును ఆధార్ తో అనుసంధానించే గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకూ కేంద్రం పెంచింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెలాఖరు కల్లా 100 శాతం ప్రక్రియ పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారిని ఆదేశించారు.


ఈ - కేవైసీ ఎందుకంటే.?


రేషన్ షాపుల్లో గత 2 నెలలుగా డీలర్లు ఈ - కేవైసీ ప్రక్రియ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 'ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన' స్కీం ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ రేషన్ ఉచితంగా అందిస్తోంది. అయితే, బోగస్ కార్డుల ఏరివేతకు రేషన్ కార్డును ఆధార్ నెంబర్ కు లింక్ చేయాలని నిర్ణయించింది. చాలా పాత కార్డుల్లో చనిపోయిన వారి పేర్లు అలాగే ఉన్నాయి. దీంతో రేషన్ సరకులు పక్కదారి పడుతున్నాయి. ఈ ఉద్దేశంతో అక్రమాలకు చెక్ పెట్టేలా ఈ - కేవైసీ విధానం తెరపైకి తెచ్చారు. కుటుంబంలో ఎంత మంది ఉంటే వారంతా కూడా ఈ - కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది.


కొత్త రేషన్ కార్డులు అప్పుడే


మరోవైపు, కొత్త రేషన్ కార్డుల మంజూరు కోసం తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. దీనిపై త్వరలోనే విధానపరమైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ - కేవైసీ ప్రక్రియ పూర్తైతేనే కొత్త లబ్ధిదారుల విషయంలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 100 శాతం లక్ష్యం పూర్తైతే కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ వేగవంతం కానుంది.


ఈ - కేవైసీ అప్ డేట్ ఇలా



  • రేషన్ కార్డు ఈ - కేవైసీ అప్ డేట్ కోసం రేషన్ కార్డులోని కుటుంబ పెద్దతో పాటు కుటుంబ సభ్యులందరూ రేషన్ షాపు వద్దకు వెళ్లి ఈ పాస్ మిషన్ లో వేలిముద్రలు వేయాలి. వేర్వేరుగా వెళ్తే ఈ ప్రక్రియ చేయరు.

  • వేలిముద్రలు వేసిన అనంతరం లబ్ధిదారుల ఆధార్ కార్డు నెంబర్, రేషన్ కార్డు నెంబర్ ఈ పాస్ లో డిస్ ప్లే అవుతుంది. అనంతరం మిషన్ లో గ్రీన్ లైట్ వచ్చి ఈ - కేవైసీ అప్ డేటెడ్ అని వస్తుంది.

  • ఒకవేళ రెడ్ లైట్ ఆన్ లో ఉంటే సదరు లబ్ధిదారుడి రేషన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలు సరిపోవడం లేదని అర్థం. దీంతో ఆ రేషన్ కార్డును తొలగిస్తారు.

  • రేషన్ కార్డు ఉన్న వారంతా ఒకేసారి ఈ - కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.


Also Read: Alpha Hotel: సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్‌కు బాంబు బెదిరింపు - రెండు గంటలపాటు తనిఖీలు