సత్యవేడు: అధికార పార్టీ వైసీపీలో టికెట్ పంపకాలు వివాదాలకు దారితీస్తున్నాయి. ఎక్కువగా దళిత నేతలు తమకు జరిగిన అవమానాలను చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళితులు ఎంత పెద్ద పదవిలో ఉన్న అవమానాలు తప్పడం లేదని మడకశిర వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే తిప్పేస్వామి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. దళితులపై అవమానాలు సహజమే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతుండగానే మరో ఎమ్మెల్యే తన బాధను బయటపెట్టారు. వైసీపీలో ఎస్సీలకు సరైన గౌరవం లేదని చిత్తూరు జిల్లా సత్యవేడు వైకాపా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సొంత పార్టీపైనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 


తిరుపతి ఎంపీ స్థానానికి ఇంఛార్జ్‌గా వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను ఇటీవల ప్రకటించారు. కానీ ఎంపీగా పోటీ చేసేందుకు ఆయన సిద్ధంగా లేరు. అందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలే నిదర్శనమని చెప్పవచ్చు. సత్యవేడు నియోజకవర్గం సమావేశాన్ని మంత్రి పెద్దిరెడ్డి ఇంట్లో ఎలా నిర్వహిస్తారని దళిత ఎమ్మెల్యే ఆదిమూలం ప్రశ్నించారు. పార్టీలో దళితులకు గౌరవం లేదని, తనకు ఇష్టం లేకపోయినా తిరుపతి ఎంపీ సీటుకు ఇన్‌ఛార్జిగా తనను ప్రకటించారని తెలిపారు. ఇదే విధంగా భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మంత్రి రోజా స్థానాల్లో ఇలా ప్రకటించగలరా?’ అని గట్టిగానే నిలదీశారు. 


మంత్రి పెద్దిరెడ్డి కారణంగానే తనకు ఎమ్మెల్యే సీటు దక్కలేదని, అందుకే ఎంపీగా తనను పంపిస్తున్నారని దళిత ఎమ్మెల్యే ఆదిమూలం ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కేసులు ఉంటే, తన నియోజకవర్గంలో ఎవరిపైనా కేసులు లేకుండా రాజీ చేసి నియోజకవర్గం ప్రశాంతంగా ఉండేందుకు పాటుపడ్డట్లు  తెలిపారు. సీఎం జగన్ పిలుపు మేరకు క్యాంప్ ఆఫీసుకు వెళ్లి కలవగా.. ఎంపీగా పోటీ చేయాలని సూచించినట్లు చెప్పారు. తాను ఏం తప్పు చేసినందుకు ఎంపీగా పంపుతున్నారని, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడానికి రెండు కారణాలు చెప్పాలని అడిగానని చెప్పారు. 


సత్యవేడులో జరుగుతున్న అక్రమాలను తనపై నెట్టేసి, పెద్దిరెడ్డి తనను నియోజకవర్గం నుంచి తప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మోటారు సైకిల్‌పై తిరిగిన పెద్దిరెడ్డికి ఇప్పుడు ఎంత ఆస్తి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, దళితులకు మాత్రం స్వేచ్ఛ లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పెద్దిరెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే తిరుపతి నియోజకవర్గం, నగరి లాంటి నియోజకవర్గాల సమావేశాలను తన ఇంట్లో నిర్వహించగలరా అని సవాల్ విసిరారు.  జిల్లాలో తాను సీనియర్ నేతనని, కానీ తగిన గౌరవం దక్కడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు నెలల నుంచి తనను ఎంతో బాధపెట్టారని, నిజాయితీగా పనిచేస్తే తనకు దక్కిన గౌరవం ఇదేనా అని వైసీపీ అధిష్టానాన్ని ప్రశ్నించారు. 


ఏం జరిగినా సరే జగన్ సీఎం కావాలి అని వైసీపీ నేతలు అంటున్నారు. కానీ పార్టీలో దళితులకు అన్యాయం జరిగిందని, అందుకు కొందరు నేతలు కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నారు. సొంత పార్టీ నేతలు టికెట్లు నిరాకరిస్తే పరిస్థితి ఏంటని ఏపీలో చర్చ జరుగుతోంది.