JC Prabhakar Reddy Face to Face Interview: జేసీ కుటుంబం నుంచి జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా, జేసీ పవన్ రెడ్డి ఎంపీగా పోటీ చేయబోతున్నారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. అడగందే అమ్మయినా పెట్టదని.. అందుకే దీనిగురించి ఒక మాట చంద్రబాబును అడిగేసి వచ్చానని అన్నారు. చంద్రబాబు నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. కుటుంబానికి ఒకటే టికెట్ అని కూడా అంటున్నారని.. కానీ జేసీ కుటుంబానికి కూడా ఒకటే సీట్ అంటే ఎలా? అని ప్రశ్నించారు. జేసీ కుటుంబం ఎంతో కష్టపడిందని.. మొత్తం పోగొట్టుకున్నామని అన్నారు. గతంలో జైలుకు కూడా వెళ్లి వచ్చామని.. 88 కేసులు కూడా పెట్టించుకున్నామని అన్నారు.



ప్రశ్న: తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండలంలో జన చైతన్య ముగింపు బస్సు యాత్ర ఎలా కొనసాగుతుంది.. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏమిటి?


జవాబు: గత ఎన్నికల్లో పెద్దవడుగూరు మండలంలో 621 ఓట్లు తక్కువ వచ్చాయి. అందుకోసమే ఈ బస్సు యాత్ర చేపట్టాను. ఎందుకు మెజార్టీ తగ్గింది అంటూ ప్రతి పల్లెలోను యాత్ర చేపట్టాను.. ప్రతిరోజు పక్కన ఊరి వాళ్ళు రాకుండా ఏ ఊరి వాళ్ళయితే ఉంటారో వాళ్లతోనే మమేకమవుతూ వెళ్తున్నా. ఈ బస్సు యాత్రలో తెలుగుదేశం పార్టీకి ఊపు కనిపిస్తోంది. చాలామంది ధైర్యంగా బయటకు వస్తున్నారు. 


ప్రశ్న: తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేస్తారో అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి? 


జవాబు: జేసీ కుటుంబం నుంచి జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా, జేసీ పవన్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నారు.


ప్రశ్న: జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ పవన్ రెడ్డి చంద్రబాబును కలవటం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగా చర్చ కొనసాగుతోంది ఎందుకు?


జవాబు: చంద్రబాబును రాజకీయంగా కలవలేదు.. చంద్రబాబును చూడాలని వెళ్లారు. అడగందే అమ్మయినా పెట్టదు కదా.. అందుకే ఒక మాట అడిగేసి వచ్చాను. చంద్రబాబు నుంచి మంచి స్పందన వచ్చింది. కుటుంబానికి ఒకటే టికెట్ అంటున్నారు. జేసీ కుటుంబానికి ఒకటే సీట్ అంటే ఎలా? జేసీ కుటుంబం ఎంత కష్టపడింది.. మొత్తం పోగొట్టుకున్నాం. జైలుకు కూడా వెళ్లి వచ్చాం. 88 కేసులు కూడా పెట్టించుకున్నాం.


ప్రశ్న: రాష్ట్రంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టారు.. షర్మిల ప్రభావం ఎన్నికల్లో ఎవరి మీద ఉండబోతోంది? 


జవాబు: కచ్చితంగా ఒకటి ఒకటిన్నర శాతం వైఎస్ఆర్సీపీ మీదే ప్రభావం ఉండబోతోంది. 2029కి కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా ప్రభావితం చూపిస్తుంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో వైసీపీ భూస్థాపితం కాబోతోంది. 


ప్రశ్న: తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి టికెట్లు ఎప్పుడు ప్రకటించబోతున్నారు ? 


జవాబు: బీజేపీతో మాట్లాడిన అనంతరం టికెట్ల కేటాయింపు ఉంటుంది.


ప్రశ్న: భీమిలి సభలో నేను సిద్ధం అంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావన్ని పూరించారు. తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో పోటీ చేయడానికి అభ్యర్థులు లేరని జగన్ కామెంట్ చేస్తున్నారు?


జవాబు: మాటలకేముంది ప్రతి ఒక్కరూ మాట్లాడతారు. మా ఇంట్లో కూడా మేం కూడా కొట్లాడుతున్నామని ప్రచారం చేస్తున్నారు.. మేమెందుకు కొట్లాడుకుంటాం.