చంద్రబాబు తనయడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనలో ఏం చేయబోతున్నారు..? ఎవరిని కలవబోతన్నారు..? ఆయన కార్యాచరణ ఏంటి..? అన్న అంశాలపై టీడీపీ నేతల నుంచి స్పష్టమైన సమాచారం రావడంలేదు. నిన్న పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ రాజమండ్రి జైల్లో చంద్రబాబును కలిశారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే లోకేష్ హుటాహుటిన హస్తిన బయల్దేరారు. మూడు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనూ ఉంటారని కూడా సమాచారం.
చంద్రబాబు అరెస్ట్... ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో ఏపీ సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసింది. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. హైస్ రిమాండ్ కోసం పిటిషన్ వేసినా... విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి ఇవ్వకపోవడంతో... చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని... రాజకీయ కక్షసాధింపే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు అరెస్టులో కేంద్రానికి కూడా భాగం ఉందా అంటూ.. కొందరు నేతలు ఆరోపణలు సంధిస్తున్నారు. లేదంటే.. ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నిస్తున్నారు.
రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో ములాకాత్ తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు ప్రకటించారు. టీడీపీ-జనసేన పొత్తును కూడా ఖరారు చేశారు. పవన్‌తోపాటు నారా లోకేష్, బాలకృష్ణ కూడా చంద్రబాబును కలిశారు. ఆ తర్వాత.. చంద్రబాబు కుటుంబసభ్యులతోనూ పవన్ సమవేశయ్యారు. ఆ తర్వాత లోకేష్ హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరారు. మూడు రోజులపాటు ఢిల్లీలోనే ఉండే అవకాశాలున్నాయి. అయితే ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు..? హస్తిన వేదికగా ఏం చేయబోతున్నారు..? అనే అంశాలపై టీడీపీ వర్గాల నుంచి పూర్తి క్లారిటీ రావడంలేదు.
ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చిందని కొందరు చెబుతుంటే.. ఢిల్లీ పెద్దల్ని కలిసేందుకని మరికొందరు చెబుతున్నారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షాతో పాటు కొందరు కేంద్ర పెద్దలను నారా లోకేష్ కలవబోతున్నారని వార్తలు వస్తున్నాయి. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసిన తీరు, ఆ తర్వాత జరిగిన పరిణామాలను జాతీయ స్థాయిలో వివరించాలని లోకేష్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా జాతీయ మీడియాతో ఆయన మాట్లాడతారని... పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇస్తారని... తెలుగు దేశం పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీని వల్ల చంద్రబాబు అరెస్టుపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలన్నదే టీడీపీ ప్లాన్ అని అర్థమవుతోంది. మరోవైపు... చంద్రబాబు కేసు విషయంలో సుప్రీం కోర్టు న్యాయవాదులతోనూ లోకేష్ చర్చించబోతున్నారని సమాచారం.
మొత్తంగా... చంద్రబాబు అరెస్ట్, వైసీపీ విధానాలను జాతీయస్థాయిలో ప్రస్తావించేలా టీడీపీ వ్యూహరచన చేసిందని టీడీపీ వర్గాలు నుంచి సమాచారం వస్తోంది. ఈనెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు కూడా జరబోతున్నాయి. ఈ సమయంలో ప్రత్యేక కార్యచరణ ఉండాలని తెలుగు దేశం పార్టీ భావిస్తోంది. చంద్రబాబు అక్రమ అరెస్ట్, ఏపీలో జరుగుతున్న పరిణామాలు, వైసీపీ కక్ష సాధింపు చర్యలపై జాతీయ స్థాయిలో టీడీపీ గళం వినిపించాలని కూడా భావిస్తోంది. దీనికి సంబంధించిన కార్యాచరణపై పార్టీ ఎంపీలతో నారా లోకేశ్ చర్చించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి