Andhra Politics :  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గురువారం కీలక మార్పు చోటు చేసుకుంది. టీడీపీతో కలిసి వెళ్తున్న జనసేనాని ప్రకటించారు. ప్రకటించిన సందర్భం కూడా సరిగ్గా సరిపోయింది. తాము ఎందుకు కలవాల్సి వచ్చిందో ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోయింది.  ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి కలుస్తున్నామని చేతల ద్వారానే చెప్పారు. ఇక యుద్ధమేనన్నారు. పొత్తుల ప్రకటనతో  ఏపీలో రాజకీయ సమీకరణాలు ఒక్క సారిగా మారిపోయినట్లుగా కనిపిస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది.  


ఖచ్చితంగా ఓట్లు ట్రాన్స్ ఫర్ అయ్యే వాతావరణం


రెండు పార్టీల మధ్య పొత్తులు ఏర్పడినప్పుడు రెండు పార్టీల సానుభూతిపరుల ఓట్లు ట్రాన్స్ ఫర్ అవుతాయా అన్న సందేహం ఉంటుంది. ఎందుకంటే.. ఓ పార్టీ అంటే మరో పార్టీ సానుభూతిపరుడికి ఇష్టం ఉండకపోవచ్చు. ఇతర కారణాలు ఉండవచ్చు. కానీ పవన్ కల్యాణ్ పట్ల వైసీపీ నేతలు వ్యవహరించిన విధానం, ఆయన సామాజికవర్గాన్ని టార్గెట్ చేసుకున్న వైనం చూస్తే..  నిఖార్సైన జనసేన సానుభూతిపరులు ఎవరూ పొత్తులను కాదని ఇతర పార్టీలకు ఓటు వేసే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో టీడీపీకి కూడా. ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన ఎన్నికల్లో  కూటమిని గెలిపించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారు కానీ.. సొంత అభిప్రాయాలకు కాదని చెబుతూంటారు. ఈ విషయంలో వైఎస్ఆర్‌సీపీ నేతల వైఖరి రెండు పార్టీలకు కలిసి వచ్చిందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. 


బలంగా ఉన్న స్థానాల్లోనే పోటీ చేస్తామంటున్న పవన్ కల్యాణ్


పవన్ కల్యాణ్ బలంగా ఉన్న స్థానాల్లోనే పోటీ చేస్తామని కొంత కాలంగా చెబుతున్నారు. ఈ కారణంగానే ఆయన తన వారాహి యాత్రను కూడా జనసేన పార్టీ బలంగా ఉందనుకున్న ప్రాంతాల్లోనే తిప్పుతున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు రెండు వైపుల నుంచి యాత్రలు చేశారు. లోకేష్ పాదయాత్ర.. చంద్రబాబు టూర్లు అన్నీ కలిసి ఎటు వైపు చూసినా టీడీపీ అన్న వాతావరణం కల్పించాయి. పవన్  యాత్రకు సైతం జనం పోటెత్తడంతో ప్రభుత్వ వ్యతిరేకత ఊహించనంతగా ఉందని.. కలిసి పోటీ చేస్తే తిరుగులేని విజయం వస్తుందన్న అభిప్రాయానికి ఆయా పార్టీలు వచ్చాయి. ఈ క్రమంలో సీట్ల సర్దుబాటు విషయంలోనూ.. బలమైన నేతలు.. బలమైన నియోజకవర్గాల సమీకరణాలు చూసుకుని ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. 



పెరిగే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు - కలిసిపోతున్న విపక్షాల ఓట్లు


మనది మెజార్టీ ప్రజాస్వామ్యం. ఏ ప్రభుత్వమైనా ఐదేళ్లు అధికారంలో ఉంటే వ్యతిరేకత వస్తుంది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంపై అనేక వర్గాల్లో అసంతృప్తి ఉందని చెబుతున్నారు. ఉద్యోగ వర్గాలను పూర్తిగా దూరం చేసుకున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో యువత కూడా దూరమయ్యారని అంటున్నారు. జాబ్ క్యాలెండ్ పేరుతో మోసం చేశారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇక అభివృద్ధి, రోడ్ల విషయంలో చాలా కంప్లైంట్లు ఉన్నాయి. సొంత పార్టీ క్యాడర్ కూడా తమకు ప్రాధాన్యత లేదని .. ఖర్చులు పెట్టుకున్నా బిల్లులు రాలేదన్న అసంతృప్తిలో ఉన్నారు. మద్యం ధరలు పెంచినందున మద్యం తాగే వారిలో అసంతృప్తీ ఎక్కువగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఓ వైపు చాలా వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయని జరుగుతూండగా... ఈ అసంతృప్తి ఓట్లన్నీ కన్సాలిడేట్ అయ్యేలా టీడీపీ, జనసేన పొత్తులు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఏపీ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్ అవుతుందని భావిస్తున్నరు.