చంద్రబాబు తరపున వాదిస్తున్న లాయర్‌ సిద్ధార్థ లూథ్రా వరుస ట్వీట్లు.. ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. సూక్తులు వల్లిస్తూ.. ఆయన చేస్తున్న ట్వీట్లు  రెచ్చగొట్టేలా ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఆయన మరో ట్వీట్‌ చేశారు. ప్రపంచంలో తమకు ఎదురవుతున్న అవమానాలను, అపహాస్యాన్ని పట్టించుకోవద్దన్న.. స్వామి వివేకానంద వ్యాఖ్యలను ఆ ట్వీట్‌లో ప్రస్తావించారు. చంద్రబాబు కేసును వాదిస్తున్న సమయంలో సిద్ధార్థ లూథ్రా చేస్తున్న ట్వీట్ల వెనక అర్థం  ఏంటి..? ఏ కారణంతో ఆయన అలాంటి సూక్తులు చెప్తున్నారు..? అన్నదానిపై చర్చ జరుగుతోంది.


స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ అయ్యి.. రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్నారు. ఈ కేసులో చంద్రబాబు తరపున వాదిస్తున్నారు సుప్రీం కోర్టు  సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో చంద్రబాబు పాత్రే లేదని విజయవాడ ఏసీబీ కోర్టులో లూథ్రా వాదనలు వినిపించారు. కానీ, చంద్రబాబు పాత్ర ఉందన్న ప్రభుత్వ తరపు లాయర్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనతో కోర్టు  ఏకీభవించింది. చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో.. ఆయన్ను  రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు సీఐడీ పోలీసులు. మూడు రోజులుగా చంద్రబాబు.. జైల్లోనే ఉన్నారు. దీంతో.. చంద్రబాబు వయస్సు, ఆరోగ్యం, హోదా దృష్టిలో  ఉంచుకుని... హౌస్‌ రిమాండ్‌ అయినా ఇవ్వాలని కోర్టులో ప్రయత్నించి విఫలయ్యారు లాయర్‌ సిద్ధార్థ లూథ్రా. ఇప్పుడు.. చంద్రబాబు బెయిల్ కోసం.. అటు ఏసీబీ కోర్టు, ఇటు  హైకోర్టులోనూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నిన్న రాజమండ్రి జైలుకు వెళ్లి చంద్రబాబుతో ములాఖత్‌ అయ్యారు. ఆ తర్వాత... చంద్రబాబు కుటుంబసభ్యులతోనూ ప్రత్యేకంగా  సమావేశమయ్యారు.


చంద్రబాబు కేసును వాదిస్తున్న సమయంలో... లూథ్రా చేస్తున్న వరుస ట్వీట్లు చర్చకు దారితీస్తున్నాయి. సూక్తులు వల్లిస్తూ... కొటేషన్లు పెడుతూ ఆయన  చేస్తున్న ట్వీట్లకు అర్థాలు వెతుకుంటున్నారు టీడీపీ శ్రేణులు. నిన్న మధ్యాహ్నం లూథ్రా ఆసక్తికర ట్వీట్ చేశారు. అన్ని ప్రయత్నాలూ చేసినా న్యాయం కనుచూపుమేర  కనిపించనప్పుడు కత్తి పట్టడమే సరైందని.. పోరాటమే శరణ్యం అంటూ.. సిక్కుల గురువు గురుగోవింద్ సింగ్ సూక్తి ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. చంద్రబాబు కేసును వాదిస్తున్న  సమయంలో లూథ్రా ఇలాంటి ట్వీట్ చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. లూథ్రా లాంటి సీనియర్ న్యాయవాది ఇలాంటి ట్వీట్ చేయడం టీడీపీ శ్రేణులను కొంత  కలవరానికి గురిచేసింది. లూథ్రా ట్వీట్‌ ప్రకారం చంద్రబాబుకు ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం లేదా? అనే అనుమానాలు టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు..  రాజకీయ వర్గాల్లోనూ ఆ ట్వీట్‌ హాట్‌ టాపిక్‌గా మారింది.


నిన్నటి ట్వీట్‌పై చర్చ జరుగుతుండగానే... ఇవాళ ఉదయం మరో ట్వీట్‌ చేశారు లూథ్రా. ఈ ట్వీట్‌లో స్వామి వివేకానంద కర్మయోగంలో ఇలా అన్నాడు అంటూ రాసుకొచ్చారు.  ప్రపంచంలో తమకు ఎదురవుతున్న అవమానాలను, అపహాస్యాన్ని పట్టించుకోకుండా మనిషి తన విధులను నిర్వర్తించాలని పేర్కొన్నారు. అలాగే... న్యాయం, ధర్మం కోసం  నిలబడిన సిక్కు గురు చెప్పిన సూక్తులను అర్థం చేసుకోనివారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఆయన ఎందుకు అలా ట్వీట్లు చేస్తున్నారు..? ఆ ట్వీట్ల వెనుక ఉన్న అర్థం ఏంటి..? అన్న దానిపై రాష్ట్ర వ్యప్తంగా చర్చ జరుగుతోంది. మరోవైపు.. టీడీపీ శ్రేణులను ఆయన రెచ్చగొడుతున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది.