Nara Brahmani: న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉందని, చంద్రబాబు నిర్దోషిగా బయటకు వస్తారని నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో భువనేశ్వరి, బ్రాహ్మణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ.. రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబును జైలుకు పంపారని ఆమె ఆరోపించారు. తన భర్త లోకేష్ ను సైతం రేపో, మాపో పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేశ్‌కు ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసి ఓర్వలేకే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో లబ్ధికోసమే ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో చంద్రబాబు అరెస్ట్ చీకటి దశ అన్నారు.
ఆమె మాట్లాడుతూ.. ‘మా కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని మేం ఎప్పుడూ ఊహించలేదు. చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాలను ఎంతో అభివృద్ధి చేశారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రజల బాగుకోసం కష్టపడేవారు. 42 ఏళ్ల రాజకీయ అనుభవమున్న నేతను అక్రమంగా జైల్లో పెట్టారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే చంద్రబాబు చేసిన నేరమా? లక్షలాదిమంది యువతకు నైపుణ్యం మెరుగు పర్చేలా కృషి చేశారు. అభివృద్ధి, సంక్షేమం చేయడం నేరమా? ఉద్యోగాలు కల్పించడం నేరమా? ఇప్పుడున్న ప్రభుత్వం గంజాయి, లిక్కర్ ఇచ్చి యువత జీవితాలను నాశనం చేస్తోంది. చంద్రబాబు అరెస్టును దేశమంతా ఖండిస్తోంది’ అని అన్నారు.
దేవాన్ష్ కు రిమాండ్ రిపోర్ట్ చూపిస్తే..
‘చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు కనీసం ఆధారాలు కూడా లేవన్నారు నారా బ్రాహ్మణి. రిమాండ్ రిపోర్ట్ ను 8 ఏళ్ల తన బాబు దేవాన్ష్ కి చూపించినా ఆధారాలు ఏవీ అని అడుగుతాడని చెప్పారు. చంద్రబాబు రాత్రి పగలు తేడా లేకుండా కుటుంబాన్ని వదిలేసి ప్రజల కోసం పనిచేశారు. అటువంటి మహానాయుడిని ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాం. నేను ఒక కుటుంబ సభ్యురాలిగా కాదు, రాష్ట్రంలో ఒక యువతకు ప్రతినిధిగా చాలా బాధపడుతున్నా. చంద్రబాబు పరిస్థితే రాస్ట్రంలో ఇలా ఉంటే సామస్య ప్రజలు ఎలా బ్రతకగలరు. ప్రజలు ఆలోచించాలి. మన లాంటి యువతకు స్కిల్స్ ఎలా వస్తాయి. చంద్రబాబు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చాలా కష్టపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు. యువత బాధ పడుతున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నారు. ఇదంతా చంద్రబాబు గొప్పతనం’ అని చెప్పారు.
‘అన్ని వర్గాల వారు మహిళలు, యువత స్వచ్ఛందంగా బయటకు వచ్చి చంద్రబాబుకు మద్దతు తెలపడం చూస్తే ఆయన తెలుగు రాష్ట్రాలను ఎంత అభివృద్ధి చేశారో తెలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు, ఐటీ ప్రొఫెషనల్స్ చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించి అండగా నిలిచారు. మేము ఒంటరి కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువారు మాకు మద్దతు తెలుపుతున్నారు. జాతీయ నేతలు కూడా ఏపీ ప్రభుత్వ వైఖరిని విమర్శించారు. న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. చంద్రబాబు ఎప్పుడూ ప్రజల కోసమే కష్టపడేవారు‘ అని అన్నారు.
‘చంద్రబాబు కోసం వచ్చిన వారందరిని పోలీసులు ఇబ్బంది పెట్టారు. కష్టకాలంలో చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్న ప్రజలకు నా ధన్యవాదాలు. న్యాయవ్యవస్థపై మాకు విశ్వాసం ఉంది. త్వరలోనే ఆయన నిర్దోషిగా బయటకు వస్తారు. రాష్ట్రాన్ని మరోసారి ఇంకో గొప్ప స్థాయికి తీసుకెళ్తారనే నమ్మకం ఉంది. ’ అని బ్రాహ్మణి తెలిపారు. కొవ్వొత్తుల ర్యాలీలో టీడీపీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తన పాల్గొన్నారు. వీ వాంట్ జస్టిస్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.