హైదరాబాద్ మహానగరానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలు చేరుకున్నారు. కాంగ్రెస్ కీలక నేతలంతా హైదరాబాద్ కు చేరుకోవడంతో ఎన్నికల సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే కొందరు ముఖ్య నాయకులు శుక్రవారం రోజునే హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇవాళ ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇదివరకే తాజ్ హోటల్ కు చేరుకున్నారు.


ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్, రాజస్థాన్ సీఎం అశోక్ గహలోత్, ఉపముఖ్యమంత్రి సచిన్ పైలెట్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిదంబరం, వీరప్ప మొయిలీ తదితరులు ఇప్పటికే తాజ్ హోటల్ చేరుకున్నారు. హోటల్ తాజ్ కృష్ణ లో రెండు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.


ఆదివాసీ నృత్యాలతో స్వాగతం పలుకుతూ....
CWC సమావేశాలకు హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులకు ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదివాసి నృత్యాలతోస్వాగతం పలికారు. తాజ్ హోటల్ వద్ద ఎమ్మెల్యే సీతక్క వారితో ఆదివాసీ నిత్యం చేస్తూ సందడిగా కనిపించారు. ఆదివాసీలతో ఎమ్మెల్యే సీతక్క స్టెప్పులేశారు


పుష్పగుచ్చంతో సోనియాగాంధీకి స్వాగతం....
రెండు రోజుల CWC సమావేశాల్లో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీకి హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జయరాం రమేష్ తెలిపారు.  రెండు రోజుల CWC సమావేశాలకు వచ్చిన ఆయన మీడియా ముఖంగా ఈ విధంగా వ్యాఖ్యానించారు.


మంగళ హారతులతో స్వాగతం.....
రెండు రోజుల CWC సమావేశాలకు హైదరాబాద్ కు వచ్చిన కాంగ్రెస్ అధిష్టానానికి తాజ్ హోటల్ వద్ద ఘన స్వాగతం లభించింది. టీపీసీసీ అధికార ప్రతినిధి కత్తి కీర్తిక వీరికి తెలంగాణ సాంప్రదాయ ముట్టిపడేలా మంగళ హారతులతో కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కి తాజ్ హోటల్ లోకి సాదర ఆహ్వానం లభించింది.


కాంగ్రెస్ ముఖ్య నేతలంతా హైదరాబాదులోనే.....
సాధారణ సభ్యులతో పాటు, ప్రత్యేక ఆహ్వానితులు కలిపి మొత్తం 84 మంది CWC సమావేశాలకు హాజరు కానున్నారు. దీంతో శుక్రవారం రోజునే ముఖ్య నేతలు అంతా హైదరాబాద్ కు చేరుకున్నారు. వీరి రాకతో హైదరాబాద్ లో సందడి వాతావరణం నెలకొంది. దీంతో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాలకు సర్వం సిద్ధం అయింది.


బహిరంగ సభ వివరాలు....
రెండు రోజులపాటు హైదరాబాద్ లో కాంగ్రెస్ అధిష్టానం తీరికలేకుండా గడపనున్నారు. ఇందులో భాగంగా 17వ తేదీ సాయంత్రం హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరి సభ నిర్వహించనున్నారు. అనంతరం 18వ తేదీన రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు జాతీయస్థాయి నేతలు వెళ్లి... స్థానిక నేతలు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నారు.