TDP Leaders Protest: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై తెలుగు రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ప్రజలు నిరసనలు చేపడుతున్నారు. శనివారం మధ్యాహ్నం గుంటూరులో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ‘నేను సైతం-బాబు కోసం’ పేరుతో తెలుగు మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. శుభం కల్యాణ మండపం నుంచి చంద్రబాబుకు మద్దతుగా నిరసన ప్రదర్శన చేపట్టారు. నల్ల వస్త్రాలు ధరించి, నల్ల బెలూన్లు పట్టుకుని మహిళలు, వృద్ధులు, టీడీపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ‘బాబు తో నేను’ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా మహిళలు సీఎం జగన్‌పై మండిపడ్డారు. వేధింపుల్లో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. సైకో పోవాలి.. సైకిల్‌ రావాలి అంటూ నినాదాలు చేశారు. 


నరసరావుపేట నియోజకవర్గంలో బీసీ నాయకుల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. నరసరావుపేట నియోజకవర్గ ఇంచార్జ్ చదలవాడ అరవింద్ బాబు, నరసరావుపేట నియోజకవర్గ పరిశీలకుడు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన కృష్ణ రిలే దీక్షల్లో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో బీసీ నాయకుడు మస్తాన్ యాదవ్ ఆధ్వర్యంలో అర గుండుతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంది యువత భవిష్యత్‌కు బాటలు వేసిన చంద్రబాబును అరెస్ట్ చేయడం దారుణమన్నారు.  శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీ సీనియర్ నాయకుడు గౌతు శివాజీ, శిరీష, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శాంతి యుతంగా నిరసన తెలిపారు. రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. పోలీసులు దీక్షను భగ్నం చేశారు. గౌతు శివాజీని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


చంద్రబాబుకు అండగా నిలుద్దాం 
చంద్రబాబునాయుడును వెంట‌నే విడుద‌ల చేయాలంటూ నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు రిలే నిరాహార‌దీక్షలు, సంత‌కాల సేక‌ర‌ణ‌, ప్రార్థనలు చేపట్టారు. మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌ నెల్లూరులోని నారాయ‌ణ మెడిక‌ల్ కాలేజీ క్యాంప్ కార్యాల‌యంలో డివిజ‌న్ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లతో స‌మీక్షా స‌మావేశం నిర్వహించారు. త‌మ నాయ‌కుడు చంద్రబాబుకు తామంద‌రం అండ‌గా నిల‌వాల‌ని, ఆయ‌న్ని విడుద‌ల చేసేంత వ‌ర‌కు క‌లిసి క‌ట్టుగా పోరాడాల‌ని సూచించారు. ఈ స‌మావేశంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యద‌ర్శి కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి, నగర అధ్యక్షుడు మామిడాల మధు, టీడీపీ ముఖ్య నేత‌లు, కార్యక‌ర్తలు పాల్గొన్నారు.


చంద్ర బాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో గంటానాధం కార్యక్రమాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నిర్వహించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపి, తెలుగుజాతి గౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ మంగళగిరి నియోజకవర్గంలోని మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో జరుగుతున్న దీక్షకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ సంఘీభావం తెలిపారు. నెల్లూరు జిల్లా ఏఎస్ పేట దర్గాలో చంద్రబాబు విడుదల కావాలంటూ వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రార్థనలు చేశారు.


రాష్ట్రానికి జగన్ రెడ్డి ఒక చీడపురుగుల పట్టిపీడిస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని  కళ్యాణదుర్గం  నియోజకవర్గ  టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు అన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎన్టీఆర్ భవన్ వద్ద నాలుగవ రోజు రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. సీఎం జగన్ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఏ తప్పు చేయని చంద్రబాబును అక్రమ అరెస్టు చేసి జైలుకు పంపి పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. ప్రకాశం జిల్లా యర్రగొండ పాలెంలో నియోజకవర్గ ఇన్ చార్జి ఎరిక్షన్ బాబు రిలే దీక్షలు నిర్వహించారు.


 చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసనగా గిద్దలూరు పట్టణంలోని క్లబ్ రోడ్డులో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. మార్కాపురంలో మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బాపట్ల జిల్లా పర్చూరు టీడీపీ కార్యాలయంలో టీడీపీ శ్రేణులు రిలే దీక్ష చేపట్టారు. వై జంక్షన్‌లోని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేశారు.


రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొవ్వత్తుల ర్యాలీలు చేపట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు అధినేత అక్రమ అరెస్టను నిరసిస్తూ వివిధ జిల్లాల్లో భారీ ర్యాలీలు తీశారు. ఈ ర్యాలీల్లో మాజీ మంత్రులు, ఇతర రాష్ట్రస్థాయి లీడర్లు పాల్గొన్నారు.  చిలకలూరిపేటలో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక కార్యకర్తలు నిర్వహించిన కార్యక్రమంలో చిలకలూరిపేట ఇన్‌ఛార్జ్‌, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లరావు పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజలంతా జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.