CWC Meeting In Hyderabad: 
ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీడబ్లూసీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హైదరాబాద్ లోని తాజ్ హోటల్ కి చేరుకున్నారు. రెండు రోజుల కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశాలలో భాగంగా తొలి రోజు సమావేశం తాజ్‌కృష్ణా హోటల్‌లో శనివారం ప్రారంభమైంది. అంతకుముందు సీడబ్లూసీ సమావేశ ప్రారంభానికి ముందు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జాతీయ పతకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సీడబ్లూసీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరవుతున్న కాంగ్రెస్ అగ్రనేతలకు కళాకారులు తమ నృత్యాలతో స్వాగతం పలికారు.


హైదరాబాద్ కు చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేతలకు ఘన స్వాగతం
కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. కాంగ్రెస్ కీలక నేతలంతా హైదరాబాద్ కు చేరుకోవడంతో పార్టీ నేతల్లో జోష్ కనిపిస్తోంది. కొందరు ముఖ్య నాయకులు శుక్రవారం హైదరాబాద్ కు చేరుకోగా, మరికొందరు నతేలు శనివారం ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారిలో సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఉన్నారు. వారు ఎయిర్ పోర్ట్ నుంచి తాజ్ కృష్ణా హోటల్ కు చేరుకున్నారు.






ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఉపముఖ్యమంత్రి సచిన్ పైలెట్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిదంబరం, వీరప్ప మొయిలీ తదితరులు ఇప్పటికే తాజ్ హోటల్ చేరుకున్నారు. హోటల్ తాజ్ కృష్ణ లో రెండు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.


కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సోనియా గాంధీ ఆప్యాయంగా పలకరించారు. ఎంపీ వెంకట్ రెడ్డికి జరిగిన చిన్న కాలు ప్రమాదం గురించి అడిగి తెలుకొని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా, సెప్టెంబర్ 16, 17 తేదీల్లో హైదరాబాద్‌ వేదికగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలు జరగనున్నాయి. కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన  సీడబ్ల్యూసీ కార్యవర్గ పునర్‌ వ్యవస్థీకరణ అనంతరం జరుగుతున్న తొలి సమావేశం ఇదే. ఈ సమావేశం హైదరాబాద్‌లో జరపాలని తెలంగాణ పీసీసీ ప్రతిపాదించింది. సమావేశంతో రాష్ట్ర కాంగ్రెస్ లో జోష్ వస్తుందని వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఈ సమావేశాలు ప్లస్ పాయింట్ అవుతాయని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు.


మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్ కు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలు పాల్గొన్నారు. శనివారం ఉదయం బీఆర్ఎస్‌ పార్టీకి తుమ్మల రాజీనామా చేశారు.  ఈ మేరకు తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపించారు. 'తెలంగాణ రాష్ట్ర సమితిలో   సహకరించినందుకు ధన్యవాదములు. పార్టీకి నా రాజీనామాను సమర్పిస్తున్నాను' అంటూ రాజీనామా లేఖలో పేర్కొన్నారు.