Mudragada Kranthi Joined In Janasena: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు ఆమె కుమార్తె ముద్రగడ క్రాంతి (Mudragada Kranthi) షాక్ ఇచ్చారు. ఆమె తాజాగా జనసేన పార్టీలో చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆమెకు శనివారం కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. క్రాంతితో పాటు మరికొందరు వైసీపీ నుంచి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఆమెతో పాటు గుంటూరు నగర పాలక సంస్థ కార్పొరేటర్లు శ్రీ నిమ్మల వెంకటరమణ, శ్రీ సంకూరి శ్రీనివాసరావు, శ్రీమతి ఇర్రి ధనలక్ష్మి,  శ్రీమతి అయిశెట్టి కనకదుర్గ పార్టీలో చేరారు.




అలాగే, అమలాపురానికి చెందిన కల్వకొలను తాతాజీ జనసేన కండువా కప్పుకొన్నారు. అటు, జగ్గయ్యపేట మున్సిపాలిటీ కౌన్సిలర్లు శ్రీ కొలగాని రాము, శ్రీమతి కాశీ అనురాధ, శ్రీ తుమ్మల ప్రభాకరరావు, శ్రీమతి కాటగాని శివకుమారి, శ్రీమతి తన్నీరు నాగమణి, శ్రీ సాధుపాటి రాజా, శ్రీమతి పాకలపాటి సుందరమ్మ, శ్రీ షేక్ సిరాజున్, శ్రీమతి మోరే సరస్వతి, శ్రీ పండుల రోశయ్య, కోఆప్షన్ మెంబర్లు శ్రీ చైతన్య శర్మ, శ్రీ ఖాదర్ బాషా, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు శ్రీ ఆకుల బాజీ, శ్రీ వీరయ్య చౌదరి పార్టీలో జాయిన్ అయ్యారు. పెడన నియోజకవర్గం నుంచి ఎంపీటీసీ శ్రీ జక్కా ధర్మారాయుడుతోపాటు మాజీ ఎంపీటీసీలు సర్పంచులు, నాయకులు పార్టీలో చేరారు.






కాగా, ఏపీ పాలిటిక్స్‌లో ముద్రగడ పద్మనాభం అంటే తెలియని వారుండరు. ఎన్నికల సమయంలో ఆయన జనసేన, పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పిఠాపురంలో పవన్ ఓడిపోతారని.. ఆయనకు ఓటేస్తే ప్రజలు మోసపోతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ పిఠాపురంలో పవన్ గెలిస్తే తాను పేరు కూడా మార్చుకుంటానని సంచలన ప్రకటన చేశారు. చెప్పినట్లుగానే పవన్ ఎన్నికల్లో గెలవడంతో పేరు మార్చుకున్నారు. అయితే, ముద్రగడ కుమార్తె క్రాంతి మాత్రం ఎన్నికల సమయంలో పవన్‌కు జైకొట్టారు. జనసేన తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీనిపై ముద్రగడ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ తన కుటుంబంలో ప్రవేశించి తనకు, తన కుమార్తెకు గొడవలు పెట్టారని మండిపడ్డారు. తాజాగా, క్రాంతి జనసేన గూటికి చేరడంతో ఆమెకు కీలక పదవి కట్టబెట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.


'చేరికలు విశ్వాసం పెంచాయి'


అటు, జనసేనలో చేరికలు తమపై విశ్వాసాన్ని పెంచాయని పవన్ కల్యాణ్ అన్నారు. సామినేని ఉదయభానుపై నమ్మకం ఉంచి ఎన్టీఆర్ జిల్లా బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. 'పల్లెపండుగ ద్వారా గ్రామాల్లో అభివృద్ధికి బాటలు పడ్డాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీరాజ్ శాఖ పని చేస్తోంది. అవినీతికి ఆస్కారం లేకుండా అభివృద్ధి పనులు సాగుతున్నాయి. రూపాయి లంచం లేకుండా, ఎవరి సిఫారసులు లేకుండా బదిలీలు జరిగాయి. లంచం అనే పదం వినిపిస్తే కార్యాలయం నుంచి వెళ్లిపోవాల్సిందే. గుడివాడలో తాగునీటి సమస్య మా దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరించాం. ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు తీర్చేందుకు సిద్ధంగా ఉన్నాం.' అని పవన్ పేర్కొన్నారు.


Also Read: IT raids on MVV Satyanarayana : వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ ఇళ్లల్లో ఈడీ సోదాలు- దోచుకున్న ఎవర్నీ వదిలేది లేదన్న సీఎం రమేష్