IT raids on former YCP MP MVV Satyanarayanas house : విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో పాటు ఆయన వ్యాపార భాగస్వాములుగా ఉన్న ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు , గద్దె బ్రహ్మాజీ వంటి వారిపై ఈడీ దాడులు నిర్వహించింది. విశాఖలో ఉన్న ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ హయగ్రీవ యజమాని జగదీశ్వరుడు ఫిర్యాదు మేరకు ఇటీవల ఎంవీవీ, జీవీ, బ్రహ్మాజీపై కేసు నమోదు అయింది. అరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసు నుంచి వివరాలు తీసుకుని ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఆ కేసులో సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.
హయగ్రీవ భూముల వ్యవహారంపై నమోదు చేసిన కేసులో దాడులు
విశాఖలోని ఎండాడ కొండపై సర్వే నెంబరు 92/3లో గల 12 ఎకరాలను 2008లో హయగ్రీవ సంస్థ అధినేత చిలుకూరి జగదీశ్వరుడు ప్రభుత్వం నుంచి ఎకరా రూ.45 లక్షలకు కొన్నారు. వయోవృద్ధులకు హౌసింగ్ ప్రాజెక్టు కోసమని తక్కువకు కొనుగోలు చేసి మూడేళ్లలో ప్రాజెక్టు ప్రారంభించాల్సి ఉండగా నిర్మాణాలు చేపట్టలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అది చేతులుమారింది. అక్కడ భారీ విల్లా ప్రాజెక్టులు కడుతున్నారు. కోర్టు కేసులు ఉన్నాయి. తనను బెదిరించి ఖాళీ కాగితాలపై సంతకాలు పెట్టించుకుని ఆ భూమిని కబ్జా చేశారని జగదీశ్వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కంపెనీని అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున మనీలాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన ఎంవీవీ
ఈ కేసు విషయంలో అరెస్టు చేస్తారేమోనన్న భయంతో ఎంవీవీ సత్యనారాయణ కొన్నాళ్లు ఆజ్ఞాతంలో ఉన్నారు. తర్వాత ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. సినీ నిర్మాతగా పలు సినిమాలు తీసిన ఎంవీవీ విశాఖపట్నంలో ప్రముఖ బిల్డర్ గా ఉన్నారు. అయితే ఆయనపై అనేక వివాదాలు ఉన్నాయి. భూ వివాదాల్లో ఆయన పేరు వినిపిస్తోంది. గతంలో ఆయన కుటుంబాన్ని కొంత మంది రౌడీషీటర్లు ఇంట్లోనే బంధించి డబ్బులు డిమాండ్ చేశారు. తర్వాత కిడ్నాప్ చేశారని.. మధ్యలో కాపాడామని పోలీసులు ప్రకటించారు. దానిపై ఇంకా విచారణ జరుగుతోంది.
ఈడీ సోదాలు ప్రారంభం మాత్రమేనని.. ఇంకా కొనసాగుతాయని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ హెచ్చరించారు. వైసీపీ నేతలు దోచుకున్న అవినీతి సొమ్ము మొత్తం కక్కించి ప్రజల కోసం ఉపయోగించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఓ వీడియో విడుదల చేశారు. వైసీపీ నేతల అక్రమార్జనలపై ఈడీ , సీబీఐలకు తానే ఫిర్యాదు చేశానని త్వరలో మాజీ సీఎం జగన్తో పాటు వైసీపీ అక్రమార్కుల బండారాలన్నీ బయటపడతాయని ప్రకటించారు.