Diarrhea is rampant due to polluted water in Gurla mandal : విజయనగరం జిల్లా గుర్ల మండలంలో డయేరియా విలయ తాండవం చేస్తుంది. వాంతులు, విరోచనాలతో నాలుగు రోజుల వ్యవధిలో ఏడుగురు మృతి చెందారు. ఇంకా గ్రామంలో డయోరియా అదుపులోకి రాలేదు. వంద మందికి పైగా రోగులు చికిత్స పొందుతున్నారు. డయోరియాను అదుపు చేసేందుకు అధికారులు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి రోగులకు చికిత్స అందిస్తున్నారు.  


ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు 


గుర్ల మండలంలో ప్రత్యేక  వైద్య శిబిరం ఏర్పాటు చేసి డయోరియాను అదుపు చేసేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఇరవై రెండు మంది రోగులు జిల్లా కేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరొక ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కేజీహెచ్ కు తరలించారు. రోగులు పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెబుతున్నారు వైద్యాధికారులు   గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో సుమారు 22 మంది, చీపురుపల్లి సిహెచ్సిలో  13 మంది, విజయనగరంలోని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో 15 మంది చొప్పున చికిత్స పొందు తున్నారు. ఇంకా కొంతమంది తమ ఇళ్లల్లోనే వాంతులు, విరేచనాలతో మంచాలపై ఉన్నారు. మృతుల సంఖ్య పెరుగుతుండడంతో గ్రామస్తులు భీతిల్లుతున్నారు.   గుర్ల, గోషాడ, పున్నుపురెడ్డిపేట, కెల్ల, గూడెం, కోటగండ్రేడు గ్రామాల్లో డయేరియా కేసులు ఉన్నట్టు  వెలుగులోకి వచ్చింది.   


కొనసాగుతున్న వైద్య శిబిరం   


గుర్ల గ్రామంలో వైద్య శిబిరం కొనసాగుతోంది. రోగులందరికీ డయేరియా నివారణ చికిత్స చేస్తున్నట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. గ్రామంలో బోర్లు, కుళాయిల నీటి వాడకాన్ని నిషేదించారు. క్లోరినేషన్ చేసిన నీటి ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నట్టు ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఇ ఉమాశంకర్ చెబుతున్నారు. ఈ గ్రామాన్ని చిన్నతరహార పరిశ్రమల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం ఉదయం సందర్శించారు. వైద్యాధికారులు, పంచాయతీరాజ్, RWS  అధికారులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. వివిధ ఆసుపత్రుల్లో బాధితులకు అందిస్తున్న వైద్యసహాయంపై మంత్రికి డిఎంహెచ్ఐ ఎస్.భాస్కరరావు వివరించారు. పారిశుధ్య నిర్వహణ పనులపై డిపిఒ వెంకటేశ్వరరావు తెలియజేశారు. గ్రామంలో తాగునీరు కలుషితం కావడానికి గల కారణాలపై మంత్రి అధికారులతో చర్చించారు. తాగునీటి పథకాల ద్వారా సరఫరా అవుతున్న నీటి నాణ్యతపై కూడా రిపోర్టులు సేకరించాలని మంత్రి ఆదేశించారు. మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నామని మంత్రి చెప్పారు.


వైసీపీ ఆగ్రహం 


 డయేరియా తో ఏడుగురు చనిపోవడం పై వైసిపి జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఘాటుగా స్పందించారు. జిల్లా కేంద్రానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో జరిగిన ఘటన దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు నెలలుగా వైద్యం పడకేసిందని, వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని మండిపడ్డారు. డయోరియా మరణాలన్ని ప్రభుత్వ మరణాలని, తక్షణమే బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రబలిన డయోరియా ఘటన పై ముఖ్యమంత్రి కార్యలయం కూడా వెంటనే స్పందించింది. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించింది. జిల్లా కలెక్టర్ బి ఆర్ అంబేద్కర్ కూడా వెంటనే రంగంలోకి దిగి చర్యలకు చేపట్టారు. గుర్ల గ్రామాన్ని సందర్శించడంతో పాటు డయేరియా బాధితులను కూడా కలిసి పరిస్థితి పై ఆరా తీశారు. డయోరియా అదుపు చేసేందుకు అదనపు వైద్య సిబ్బందిని నియమించి గ్రామంలో క్లోరినేషన్ జరిపించారు. గ్రామంలో డయోరియా అదుపులోకి వచ్చే వరకు వైద్య ఉన్నతాధికారులు గ్రామంలో ఉండి పర్యవేక్షించాలని ఆదేశించారు.