AP CM Chandrababu restarts capital Amaravati Work | అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునప్రారంభానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులను ఏపీ సీఎం చంద్రబాబు శనివారం నాడు పున:ప్రారంభించారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయుని పాలెం వద్ద సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి పనులు ప్రారంభించారు. ఏపీ సీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ పనులను తిరిగి ప్రారంభించడం ద్వారా రాజధాని అమరావతి పనులను మొదలు కూటమి ప్రభుత్వం మొదలుపెట్టింది.


 నాడు 7 అంతస్తుల్లో రూ.160 కోట్ల వ్యయంతో సీఆర్‌డీఏ కార్యాలయ పనులను చేపట్టారు. రాజధాని నిర్మాణ పనులపై అక్టోబర్ 16 న జరిగిన సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో పనుల ప్రారంభంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 3.62 ఎకరాల్లో జీ ప్లస్‌ 7 భవనాన్ని ప్రభుత్వం ఇక్కడ నిర్మిస్తోంది. దాంతోపాటు పార్కింగ్‌, ల్యాండ్‌ స్కేపింగ్‌కు మరో 2.51 ఎకరాలు సైతం కేటాయించారు. ఇంటీరియర్స్‌, ఎలక్ట్రిక్‌ పనులు, ఆర్కిటెక్చరల్‌ ఫినిషింగ్స్‌ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. 2017లో నాటి చంద్రబాబు ప్రభుత్వం సీఆర్‌డీఏ ప్రాజెక్టు కార్యాలయ నిర్మాణాన్ని  ప్రారంభించింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతి పనులను నిలిపేశారు. మూడు రాజధానులు అని నిర్ణయం తీసుకోగా, నిర్మాణ పనులు ఎక్కడికక్కడి నిలిచిపోయాయి.  ఇటీవల జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి విజయం సాధించగా, రాజధాని అమరావతి పనులపై ఫోకస్ చేశారు.