Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితులు క్రమంగా కొలిక్కి వస్తున్న వేళ ఎన్నికల హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగా ఇప్పటికే డీఎస్సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. సామాజిక పింఛన్లు కూడా వెయ్యి రూపాయలు పెంచి అందిస్తోంది. ఇప్పుడు మరో పథకాన్ని ప్రజలకు అందించేందుకు రెడీ అవుతోంది.
సూపర్ సిక్స్ పేరుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అందులో కీలకమైన హామీ తల్లికి వందనం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దీన్ని అమ్మ ఒడి పేరుతో అందించింది. దానికి కూటమి ప్రభుత్వం పేరు మార్చి తల్లికి వందనం పేరుతో అమలు చేయనున్నారు. ఈ పథకం కింద చదువుకునే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో ఏడాదికి 15 వేల రూపాయలు వేయనున్నారు.
విద్యాసంవత్సరం జూన్‌లో ప్రారంభమైంది. ప్రభుత్వం కూడా అదే నెలలో కొలువు దీరింది. అన్ని సర్దుకొని పథకాలు అమలు చేయడానికి ఇంత టైం పట్టింది. ఆర్థికంగా వ్యవస్థలు అస్తవ్యస్థంగా ఉన్నందున వాటిని సరి చేసేందుకు టైం తీసుకున్నామని అంటున్నారు. అందుకే పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టలేదని చెబుతున్నారు. కేంద్ర సాయంతో వాటన్నింటి నుంచి గట్టేక్కేందుకు శతవిధాల ట్రై చేస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు ఒడ్డుకు చేరుతున్నందున సూపర్ సిక్స్ అమలుపై ఫోకస్ చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
సూపర్ సిక్స్ అమలులో తల్లికి వందనం పథకంతోనే ప్రారంభించాలని భావిస్తున్నారు. జనవరిలో ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. కాలేజీకి, స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థి తల్లికి 15 వేల రూపాయలు చొప్పున ఇవ్వబోతున్నారు. ఇంటిలో ఎంత మంది వెళ్తే అంతమందికి ఇవ్వడానికి సిద్దమవుతున్నారు. దీని కోసం 12 వేల కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం లెక్కలు వేస్తోంది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్కూల్స్, కాలేజీల్లో దాదాపు 80 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వారందరికీ ఇస్తారా లేకుంటే అందులో ఇంకా కోతవిధిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడున్న వారందరికీ అమలు చేస్తే మాత్రం 12వేల కోట్లు కావాల్సి ఉంటుంది.
వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ఎంత మంది స్కూల్‌కు వెళ్లిన ఒక బిడ్డకు మాత్రమే 15 వేలు ఇస్తామని చెప్పారు. అందులో మూడు వేలు వరకు కోత విధించారు. దీనికి వివిధ కారణాలు చెప్పారు. స్కూల్ నిర్వహణకు వాటిని ఖర్చు చేస్తామని వెల్లడించారు. గతేడాది వైసీపీ ప్రభుత్వం ఈ పథకం కింద రూ.6394 కోట్లు ఖర్చు పెట్టింది.
కూటమి ప్రభత్వం వచ్చినప్పటి నుంచి సూపర్ సిక్స్ ఎప్పటి నుంచి అమలు చేస్తారని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ వస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభమై ఉన్ని నెలలు అవుతున్నా ఇంత వరకు తల్లికి వందనం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తూ వస్తోంది. టీడీపీ కూడా దానికి కౌంటర్ ఇచ్చింది. 2019 మేలో అధికారం చేపట్టి జగన్ మోహన్ రెడ్డి 2020 జనవరిలో అమ్మ ఒడి పథకాన్ని అణలు చేశారని గుర్తు చేశారు. డేటా, ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకు టైం తీసుకున్నామని చెబుతున్నారు.