YSRCP Chief Jagan : తాడేపల్లిలోని తన నివాసంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలతో  జగన్ సమావేశమయ్యారు. ఉదయం నుంచి సాగినన్న వర్క్‌షాప్‌లో జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలీ ఎన్నికలు అంటూ ప్రచారం సాగుతోందని...అది అమలు అయితే కచ్చితంగా ఎన్నికలు వస్తాయని అన్నట్టు తెలుస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ నేతలు, కేడర్ సిద్ధంగా ఉండాలని లీడర్లకు సూచించారు. దేశంలోనే బలమైన పార్టీగా వైసీపీని మార్చాలని నేతలకు దిశీనిర్దేశం చేశారు. 


పథకాల అమలులో మనమే టాప్: జగన్


కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతోందని పాలన గాలికి వదిలేసిందని ఆరోపించారు జగన్. ప్రజలు పడుతున్న ఇబ్బందులు గుర్తించి వాటి కోసం ఫైట్ చేయాలని వైసీపీ నేతలకు సూచించారు. సమస్య ఉన్న చోట వైసీపీ నేతలు వెళ్లి ప్రజలకు అండగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ఇప్పుడు వాటిని అమలు చేయలేకపోతోందన్నారు జగన్. వైసీపీ హయాంలో క్యాలెండర్ ప్రకటించి పథకాలు అమలు చేసిన విషయం ప్రజలకు గుర్తే ఉంటుందన్నారు.  


ప్రజల్లో ఉంటేనే గుర్తింపు రేటింగ్


ప్రజలకు అండగా ఉన్న వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందన్నారు జగన్. ప్రతి విషయంపై రిపోర్టులు ఉంటాయన్న జగన్... వాటి ఆధారంగానే నేతలకు రేటింగ్ ఉంటుందన్నారు. కష్టపడి పని చేసే వాళ్లకు కచ్చితంగా మంచి భవిష్యత్ ఇస్తామని భరోసా ఇచ్చారు. పార్టీ వ్యవస్థీకృతంగా ఫైట్ చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు. రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ ఒకటిగా ఉంటేనే పార్టీ బలోపేతంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. 


మరో ఆరు నెలలకు మొత్తం మారిపోవాలి


మరో ఆరునెలల్లో సమావేశం ఉంటుందని కచ్చితంగా అప్పటికి గ్రామస్థాయిలో పార్టీ పటిష్టంగా ఉండేలా చూడాలన్నారు జగన్. పార్టీకి గ్రామస్థాయి కమిటీలతోపాటు  అనుబంధ విభాగాలకి కూడా గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏదో కమిటీలు ఏర్పాటు చేసి వదిలేయకుండా వాటి పని తీరును మోనిటరింగ్ చేయాలన్నారు. అప్పుడే పెట్టిన లక్ష్యం నెరవేరుతుందని చెప్పుకొచ్చారు. అలాంటి పార్టీయే నెంబర్ వన్‌గా ఉంటుదన్నారు. 


విశ్వసనీయతే అధికారంలోకి తెస్తుంది


వైసీపీకి గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టమైన నాయకత్వం ఉందన్న జగన్... వాటిని సరైన విధంగా నడిపించాల్సిన బాధ్యత నాయకులపై ఉందని సూచించారు. అప్పుడే పార్టీ ఇచ్చే పిలుపుతో కేడర్‌లో కదలిక వస్తుందన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉండాలని దిశానిర్దేశం చేశారు. మళ్లీ తమను అధికారంలోకి తీసుకొచ్చేది విశ్వసనీయతే అన్నారు జగన్. వైసీపీ ఇచ్చిన పథకాలు చేసిన పనులు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని వివరించారు. ప్రతి వైసీపీ కార్యకర్త కూడా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లగలడని...   టీడీపీ కూటమి కార్యకర్తలు చేయగలరా అని ప్రశ్నించారు. అధికారంలోకి ఉన్నప్పుడు అమలు చేసిన పథకాలే వైసీపీకి శ్రీరామ రక్ష అని చెప్పుకొచ్చారు. 


సోషలైజ్ అవ్వండి


సోషల్‌ మీడియా కాలంలో యుద్ధం చేయాల్సింది ఒక్క చంద్రబాబుతోనే కాదని చెడిపోయిన వ్యవస్థలతో అని విమర్శలు చేశారు జగన్. పత్రికలతోపాటు సోషల్‌మీడియాతో యుద్ధం చేయాలన్నారు. వాటికన్నా బలంగా తయారు కావాలని సూచించారు. పార్టీ కమిటీలన్నీ సోషల్‌ మీడియాకు అనసంధానం కావాలన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ కావాలని నేతలకు సూచించారు. ఎవరి సోషల్ మీడియా పేజ్‌ వాళ్లే రన్ చేసుకునేలా ఉండాలన్నారు. సోషల్‌ మీడియా ద్వారా పార్టీ మెసేజ్‌ గ్రామస్థాయికి వెళ్లాలని హితవు పలికారు. ఇలా ప్రతి అంశంపై దృష్టిపెట్టి దేశంలో అత్యంత బలమైన పార్టీగా వైఎస్సార్‌సీపీ తయారు కావాలని ఆకాంక్షించారు. 


Also Read: సైలెంట్‌గా పార్టీ ప్రక్షాళన చేస్తున్న జగన్- ఉత్తరాంధ్ర బాధ్యతలు విజయసాయిరెడ్డికి అప్పగింత- ప్రతిపాడులో వైసీపీకి టీడీపీ నేత హోప్