తెలంగాణలో రాజకీయం చాలా రంజుగా మారుతోంది. కీలకమైన నేతల చేరికలతో కాంగ్రెస్ జోరు మీద ఉంటే అంతర్గత కలహాలతో బీజేపీ కాస్త వెనుకబడింది. అధికార పార్టీలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. జిల్లాలను చుట్టేస్తున్న కేటీఆర్, బీజేపీ, కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కొన్ని రోజుల నుంచి ప్రధాన మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న ఆయన తమను ఢీ కొనే సరైన ప్రత్యర్థులే లేరని తేల్చేస్తున్నారు.
సమావేశం ఏదైనా, వేదిక ఎక్కడైనా సరే మంత్రి కేటీఆర్ అడుగుతున్న ప్రశ్న ఒక్కటే. తమ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్తి కేసీఆర్... మరి ప్రత్యర్థి పార్టీల తరఫున ఎవరు పోటీ పడుతున్నారో చెప్పాలంటున్నారు. ఇలా ప్రత్యర్థులను విమర్శిస్తూనే వారిని డైలమాలోకి నెట్టేస్తున్నారు. ఉద్యమకారుడిగా తెలంగాణ ప్రజలను ఏకం చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించిన కేసీఆర్ రెండుసార్లు ముఖ్యమంత్రిగా పాలనలో విజయవంతమయ్యారని బీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి పరిచయం చేశారని అందుకే ఈసారి కూడా కేసీఆర్ మాత్రమే తమకు ప్రచారాస్త్రమని బీఆర్‌ఎస్ నేతలు చాలా సార్లు చెప్పారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు.
అందుకే సమయం వచ్చినప్పుడల్లా కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేసేందుకు తామంతా ప్రజలకు ఓట్లు అడుగుతున్నామని ప్రత్యర్థుల పరిస్థితి ఏంటి బీఆర్‌ఎస్ నుంచి ఎదురవుతోంది. ఇలా కేసిఆర్‌ను సీన్‌లోకి తీసుకొస్తే మిగతా ఇష్యూలన్నీ సైడ్ అయిపోతాయని బీఆర్‌ఎస్ ప్లాన్. అదే టైంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించే సాహసం బీజేపీ, కాంగ్రెస్ చేయబోవని బీఆర్‌ఎస్ ప్లాన్. ఇది వారిని డిఫెన్స్‌లోకి నెట్టేస్తుందని.. అందుకే దీనిపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరిగేలా చూడాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిపై క్లారిటీ లేకపోతే రేపు వాళ్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇదే విషయంపై కొట్టుకుంటారనే సిగ్నల్ కూడా బీఆర్‌ఎస్ ఇస్తోంది. నిలకడైన ప్రభుత్వం ఉండాలంటే అది బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమనే సంకేతాలు గట్టిగా పంపుతోంది. 9ఏళ్లుగా ఎలాంటి సమస్యలు, లుకలుకలేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన కేసీఆర్ నాయకత్వంలో తాము ఎన్నికల పరీక్షను ఎదుర్కోబోతున్నామని ప్రజలకు చెబుతున్నారు.
కొందరు బీఆర్‌ఎస్ నాయకులు కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ నినాదాలు చేస్తున్నారు. అలాంటి వాటికి కూడా చెక్ పెట్టడమే కాకుండా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లకుండా జాగ్రత్త పడుతోంది. నాలుగు వైపులు ఆలోచించే కేటీఆర్ లాంటి వారితో ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రస్తావన తీసుకొచ్చింది బీఆర్‌ఎస్. 9 ఏళ్లు చేసిన అభివృద్ధితోపాటు ఈ విషయాన్ని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తోంది. మరి దీనికి బీజేపీ, కాంగ్రెస్ కౌంటర్ ఎలా ఉంటుందో చూడాలి.