AP Vote Politics :  ఆంధ్రప్రదేశ్‌లో ఓటరు జాబితా అంశం సంచలనం సృష్టిస్తోంది. పెద్ద ఎత్తున పాత ఓట్లు తీసేయడం..  కొత్త ఓట్లు చేర్చడం వంటివి హైలెట్ అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలు పోలంగ్ బూత్ ల వారీగా చూసి.. ఒకే డోర్ నెంబర్ తో ఉన్న ఓట్లను  కనిపెట్టి మీడియా ముందు పెడుతున్నారు. దొంగ ఓట్లను భారీ ఎత్తున చేర్చారని అంటున్నారు. ఈ ఆరోపణలతో ఎన్నికల సంఘం కూడా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. కొన్ని చోట్ల తప్పులు జరిగాయని కూడా అంగీకరించాల్సి వచ్చింది. అన్నింటినీ పరిశీలిస్తే దొంగ ఓట్లను తొలగిస్తామని చెబుతున్నారు. కానీ ఇలా ఎందుకు ఓటర్ల లిస్టులో ఊహించని విధంగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. 


ఓట్లు తొలగించటం అంత ఆషామాషీ కాదు !


ఓటరు జాబితాలో ఓటు తొలగించాలంటే ముందు నోటీసు జారీ చేయాలి. వివరణ తీసుకుని సరైన కారణం ఉంటే ఓటు తొలగించాలి. కానీ ఎలాంటి నోటీసులు లేకుండా ఓటును తొలగించేస్తున్నారు. అలాగే కొత్త వారిని చేర్పించేస్తున్నారు.  టెక్నాలజీ ఇంత పెరిగిన తర్వాత కూడా ఎవరి ఇష్టారీతిన వాళ్లు ఓట్లు తొలగించుకుని.. కావాల్సిన వారిని చేర్పించుకుని గెలవాలనుకుంటే ఇక ప్రజాస్వామ్యం ఎందుకని విపక్షాలు ప్రశ్నస్తున్నాయి.  గుంటూరులో ఒక్క పోలింగ్ బూత్ వందల కొద్దీ దొంగ ఓట్లు బయటపడ్డాయి. ఇది చిన్న విషయం కాదు.  గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మొత్తం మీద ఇలా ఎన్ని ఓట్లు నమోదు చేశారో.. ఎంత మంది ఓట్లు తొలగించారో చెప్పడం కష్టం. అన్ని చోట్లా ఇలాగే ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 


60 లక్షలకుపైగా దొంగ ఓట్లను తొలగించాలంటున్న వైసీపీ 


మరో వైపు వైసీపీ ఓటర్ లిస్టులో అరవై లక్షల దొంగ ఓట్లు ఉన్నాయంటున్నారు. అంత స్థాయిలో దొంగ ఓట్లు ఎలా ఉంటాయన్నది పక్కన పెడితే.. ఆ పార్టీ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తమ పార్టీ నేతలకు అదే చెబుతున్నారు.  పార్టీ నేతలంతా అరవై లక్షల దొంగ ఓట్లను తొలగించేందుకు కృషి చేయాలని పిలుపుస్తున్నారు.  ఇప్పటికే ఈ తొలగింపు ప్రారంభించారేమో కానీ వివాదా్పదం అవుతోంది.  వాలంటీర్లతో ఓట్ల తొలగించే ప్రక్రియ జరుగుతుందని అంటున్నారు. ఇక ఓటర్‌ లిస్ట్ లో ఒకే వ్యక్తి పేరు ఒకటి కంటే ఎక్కువసార్లు ఉందంటూ కొన్ని, వ్యక్తులు చని పోయారంటూ మరికొన్ని, వలస వెళ్లారంటూ ఇంకొన్ని ఓట్లు తీసేశారు. అయితే నిజంగా అలాంటి పరిస్ధితి ఉంటే అదేమి తప్పు కాదు.కానీ  టీడీపీ ఓటర్లు, సానుభూతిపరులు, కార్యకర్తలకు సంబంధించిన ఓట్లే తీసేస్తున్నారని అంటున్నారు.  


గతంలో ఉరవకొండలో ఓట్ల తొలగింపుపై విచారణకు వచ్చిన ఈసీ 


గతంలో ఉరవకొండ నియోజకవర్గంలో ఇలాగే ఓట్ల తొలగింపుపై ఫిర్యాదులు వస్తే అధికారులు స్పందించకపోవడంతో నేరుగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వచ్చారు. దీంతో అప్పటికప్పుడు ఓట్ల తొలగింపు నిజమేనని చెప్పి బీఎల్వోలపై చర్యలు తీసుకున్నారు. కానీ అలాంటివి రాష్ట్రం మొత్తం చోటు చేసుకున్నాయని అంటున్నారు.  ప్రతిపక్షాల ఓట్లు మాత్రమే తొలగిస్తూ వైసీపీకి అనుకూలంగా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నా ఎన్నికల సంఘం మాత్రం చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. పైకి ఓటరు నమోదు, ఎలాంటి ఎన్నికల విధులనూ వాలంటీర్లకు అప్పగించొద్దంటూ ఆదేశాలివ్వటమే తప్ప.. గీత దాటుతున్న వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోవట్లేదని ఆరోపిస్తున్నారు.  


ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయి ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయించుకుంది. ఈ ఓటర్ల జాబితా అంశం కీలక మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.